తెలంగాణాలో 32...ఏపీలో డబుల్ అంటున్న జనసేన...?

అలాంటిది తెలంగాణాలో ఏకంగా 32 సీట్లకు పోటీ చేస్తే ఏపీలో గత పదేళ్ళుగా ఫుల్ ఫోకస్ పెట్టేసి రేపు అధికారం మాదే అని అంటున్న చోట ఎంతలా పోటీ చేయాలి.;

Update: 2023-10-03 16:47 GMT

జనసేన ఒక వ్యూహం ప్రకారం ఈసారి ఎన్నికల్లో పనిచేస్తోంది అని అంటున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే పార్టీ నేతలతో మాట్లాడుతూ తమకు వ్యూహాలు చాలా ఉంటాయని వాటినే అమలు చేస్తామని అన్నారు. తాము ఎపుడూ రాజకీయాలను కాల మాన పరిస్థితులకు అనుగుణంగా చేస్తామని కూడా చెప్పారు. ఏ పార్టీతో దోస్తీ చేసినా లేక సహకారం అందించినా అదే విధంగా సంఘర్షించినా కూడా దానికి ఒక్క లెక్క ఉంటుందని అన్నారు. అదంతా ప్రజల కోసమే అని కూడా ఆయన చెప్పేశారు.

ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణాలో మొత్తం ఉన్న సీట్లు 119 అయితే అందులో 32 సీట్లకు జనసేన పోటీ చేయబోతోంది. దానికి సంబంధించి లిస్ట్ ని కూడా ఆ పార్టీ విడుదల చేసింది. అంటే మొత్తం తెలంగాణాలో నాలుగవ వంతుకు జనసేన పోటీ చేయబోతోంది అన్న మాట. తెలంగాణాలో జనసేన పెద్దగా దృష్టి పెట్టింది లేదు, ఆ పార్టీ ఏపీనే కార్యక్షేత్రంగా మార్చుకుని తన రాజకీయాన్ని చేస్తూ వస్తోంది.

అలాంటిది తెలంగాణాలో ఏకంగా 32 సీట్లకు పోటీ చేస్తే ఏపీలో గత పదేళ్ళుగా ఫుల్ ఫోకస్ పెట్టేసి రేపు అధికారం మాదే అని అంటున్న చోట ఎంతలా పోటీ చేయాలి. ఇదే ఇపుడు చర్చకు వస్తోంది. అదే విధంగా చూసుకుంటే ఏపీలో జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది అని భావిస్తున్న వేళ మొత్తం 175 సీట్లలో ఎన్ని పోటీ చేయాలి, ఎన్ని చేస్తే జనసేన పోరాటానికి ఆరాటానికి తగిన ఫలితం ఉంటుంది అన్న చర్చ అయితే ఉంది.

తెలంగాణా లెక్కనే తీసుకుంటే ఏపీలో నాలుగవ వంతు సీట్లకు పోటీ చేసినా 44 దాకా వస్తాయి. అయితే తెలంగాణలో మాదిరిగా సో సోగా పోటీ ఏపీలో చేయబోవడం లేదు కాబట్టి అలా చూసుకుంటే అక్కడికి డబుల్ ఇక్కడ పోటీ ఖాయం అన్న మాట అయితే జనసేనలో వినిపిస్తోంది. అంటే క్లారిటీగా 64 సీట్లు అన్న మాట. అంటే మొత్తం ఏపీ సీట్లలో మూడవ వంతు.

ఈ సీట్ల విషయంలో జనసేన ఎక్కడా తగ్గేదే లేదు అని అంటున్నారు. మొత్తం 175 సీట్లలో జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా 64 సీట్లు ఇస్తే 111 సీట్లలో తాను పోటీ చేయాల్సి ఉంటుంది. ఆ సీట్లలో 88 మ్యాజిక్ ఫిగర్ అయితే టీడీపీకి దక్కదు, కాబట్టి రేపటి ప్రభుత్వంలో కచ్చితంగా జనసేన సాయం పాత్ర ఉంటాయని అంటున్నారు. అందుకే సంకీర్ణ ప్రభుత్వం అని పవన్ పదే పదే చెబుతున్నారు అంటున్నారు.

అలాగే జనసేన టీడీపీ ప్రభుత్వం అని కూడా చెబుతున్నారు. దీని మీద కూడా పవన్ వివరణ ఇస్తున్నారు. జనసేనను ఎందుకు ముందు పెట్టామంటే జనసేన క్యాడర్ గౌరవాన్ని ఎక్కడా తగ్గించబోమని చెప్పడానికే అని అంటున్నారు. మరి జనసేన గౌరవం అంతా ఒక్క పేరులోనే లేదు కదా సీట్ల విషయంలోనూ ఉంది. అందువల్ల వీలైతే 75 సీట్లకు లేకపోతే 64 సీట్లకు తక్కువ కాకుండా జనసేన పొత్తులలో భాగంగా పోటీ చేస్తుంది అని అంటున్నారు.

ఈ బిగ్ నంబరే ఇపుడు టీడీపీని సైతం కలవరపెడుతోంది అని అంటున్నారు. ఇన్నేసి సీట్లు జనసేనకు పొత్తులలో భాగంగా ఇచ్చేస్తే తమ్ముళ్ళు ఊరుకుంటారా అన్నది మరో చర్చ. అదే విధంగా ఇన్నేసి సీట్లకు జనసేనకు అభ్యర్ధులు ఉంటారా అన్నది ఇంకో చర్చ. ఏది ఏమైనా ఏపీ రాజకీయాలను మారుస్తామని చెబుతూ వస్తున్న జనసేన పోటీ చేసే సీట్ల విషయంలో ఏపీలో చెప్పకుండా తెలంగాణాలో స్కోర్ చెప్పి టీడీపీకి ఒక సిగ్నల్ అయితే పంపించింది.

దానికి టీడీపీ ఎంతవరకూ ఓకే చెబుతుంది అన్నది పక్కన పెడితే ఇపుడు టీడీపీ ఇబ్బందులలో ఉన్న వేళ పవన్ ఆసరాగా నిలిచారు. అంతే కాదు తన భుజం మోసారు కాబట్టి ఆ మొహమాటాలు అన్నీ వర్కౌట్ అయి జనసేన కోరుకున్న బిగ్ నంబర్ కచ్చితంగా వచ్చి ఒడిలోకి వాలుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News