జనసేన స్లో పాయిజన్ తీసుకుంటుందా?

ఇక.. తాజాగా జనసేన పార్టీ అధిష్టానం నుంచి కార్యకర్త వరకూ పొత్తు ధర్మాన్ని పాటిస్తుంటే.. టీడీపీలో అది ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు విమర్శించారు.;

Update: 2025-07-11 21:30 GMT

అది 2008 ఆగస్టు 26... తిరుపతి వేదికగా లక్షల మంది అభిమానుల సమక్షంలో, కోట్ల మంది టీవీల ముందు వీక్షిస్తుండగా.. "మెగా"స్టార్ చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీ పేరు, అజెండాను ప్రకటించారు. లక్షల మంది మద్దతుగా నిలిచారు. అప్పుడున్న రాజకీయ సమీకరణాలు, వైఎస్సార్ వైభవం ఉన్నప్పటికీ ప్రజారాజ్యం ఫస్ట్ టైం ఎన్నికల్లో పోటీ చేసి ఉన్నంతంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది!

ఆ ఎన్నికల్లో వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ కు 156 సీట్లు, టీడీపీకి 92, ప్రజారాజ్యం పార్టీకి 18, టీఆరెస్స్ కు 10 సీట్లు వచ్చాయి. మిగిలిన పార్టీల సంగతి పక్కనపెడితే... ప్రజారాజ్యం తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు సాధించడం పక్క రాష్ట్రంలోని స్టార్ తో పోల్చుకుంటే చిన్న విషయం కాదనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి! అప్పట్లో యువరాజ్యం ఉంది!

ప్రజరాజ్యం గెలుచుకున్న స్థానాల్లో, ఏపీలో ప్రధానంగా.. భీమిలి, గాజువాక, అనకాపల్లి, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, నెల్లూరు సిటీ వంటి కీలక స్థానాలున్నాయి. అయినప్పటికీ నాటి రాజకీయ పరిస్థితుల్లో, అధినేతకున్న ఆలోచనలో.. కారణాలేవైనా 2011 ఫిబ్రవరి 6న ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేస్తున్నామని చిరంజీవి ప్రకటించారు!

దీంతో... అతి తక్కువ సమయంలో తిరుపతిలో ఉదయించిన సూర్యుడు, హస్తినలో అస్తమించాడనే కామెంట్లు వినిపించాయి. అయితే ఆ బాధ నుంచి వీలైనంత తొందరలోనే తేరుకున్నవారు కొందరైతే.. ఇప్పటికీ తేరుకోనివారు కూడా ఉన్నారని అంటున్నారు! ఏది ఎమైనా... నాన్ చకుండా, నాయకులను, కార్యకర్తలను ఏమార్చకుండా.. కుండబద్దలు కొట్టేశారు చిరంజీవి!

కట్ చేస్తే... 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపిస్తున్నట్లుగా "పవర్"స్టార్ పవన్ కల్యాణ్ ప్రకటించారు. విద్య, వైద్యం మెరుగుపరచడం.. చట్టాల అమలులో అందరికీ సమన్యాయం.. ప్రజాధనం వ్యయానికి కాపలా.. డబ్బుకు అమ్ముడు పోని సామాజమే లక్ష్యం అంటూ ఆయన ఆవిర్భావ సభలో ప్రసంగించారు! 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. పవన్ రెండు చోట్లా ఓడిపోయారు!

అయినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాట పఠిమ చూపారు. వారాహి వాహనంపై ప్రచారం చేశారు. బీజేపీ, టీడీపీ కూటమిలో చేరారు. సూపర్ విక్టరీ సాధించారు. అధికారంలోకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా ఉన్నారు. తనదైన పాలన అందిస్తూ, సమస్యలపై స్పందిస్తూ, మరోకాడిన సినిమాల బాధ్యతలు చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.

అంతవరకూ బాగానే ఉంది కానీ... 2019 - 24 మధ్య అధికారంలో ఉన్న పార్టీ అధినేత చేసిన తప్పే పవన్ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైందని తెలుస్తోంది! దానికి ప్రధాన కారణం... అటు పార్టీని, ఇటు కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు. ప్రధానంగా పార్టీ పునాదులు బలపరిచే పనులు పూర్తిగా విస్మరించారని చెబుతున్నారు!

తనకు కూటమిలో మనుగడే ముఖ్యంగా పవన్ తీరు ఉంటుందని.. పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలపరుచుకునే ఆలోచన ఆయన చేయడం లేదనే చర్చ ప్రధానంగా ఆయనకు అత్యధిక బలమున్నట్లు చెప్పే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో మొదలైందని చెబుతున్నారు. అందుకు ఇటీవల కాలంలో తెరపైకి వచ్చిన పలు ఉదాహరణలు గుర్తుకు తెస్తున్నారు!

ఇందులో భాగంగా... తనకు రాజకీయంగా బ్రేక్ ఇచ్చిన పిఠాపురంలో పవన్ మార్కు అభివృద్ధి కనిపించలేదనే కామెంట్లు అప్పుడే మొదలయ్యాయని అంటున్నారు! ఎస్.వి.ఎస్.ఎన్. వర్మను అడిగితే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు! పిఠాపురం పవన్ నుంచి చాలా ఆశిస్తుందని గుర్తుచేస్తున్నారు! పిఠాపురాన్ని నిలుపుకోవాలని చెబుతున్నారు!

ఇక.. తాజాగా జనసేన పార్టీ అధిష్టానం నుంచి కార్యకర్త వరకూ పొత్తు ధర్మాన్ని పాటిస్తుంటే.. టీడీపీలో అది ఎక్కడా కనిపించడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు విమర్శించారు. ఈ విషయంలో కూటమి పెద్దలుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని కోరారు. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తేడా కొట్టేస్తాయని చెప్పారు.

ఇది టీవీ రామారావు ఆవేదన అవ్వొచ్చు, వాస్తవం అవ్వొచ్చు, మరో కోణంలో చూస్తే అవాస్తవం అవ్వొచ్చు, స్థానిక పరిస్థితుల దృష్టా ఆందోళన కూడా అయ్యి ఉండోచ్చు! అది ఆయన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అయ్యి ఉండోచ్చు.. పార్టీ ఫ్యూచర్ గురించి అయినా అయ్యుండొచ్చు. టీవీ రామారావుకి ఏమి పోతుంది?... జనసేన కాకపోతే మరో పార్టీ!!

మరి పవన్ కల్యాణ్ పరిస్థితి అది కాదు కదా! ఆయన పార్టీ అధినేత. తన ఒక్కడి భుజాలపై, కార్యకర్తలను, అభిమానులను కలుపుకుంటూ నిలుపుకున్న పార్టీ. దాని మేలు కోరి ఓ సీనియర్ నేత చెబితే.. వెంటనే ఆయనను సస్పెండ్ చేయడం వల్ల.. అటు నేతలకు, ఇటు కార్యకర్తలకు.. మధ్యలో రాజకీయ ప్రత్యర్థులకు, ప్రజలకు ఎలాంటి సంకేతాలు వెళ్తాయనేది డిప్యూటీ సీఎంకి అర్ధం కాకపోతే ఎలా?

ఇప్పుడు ఈ చర్చే అటు జనసేన శ్రేణుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ, రాజకీయ విశ్లేషకుల్లోనూ వినిపిస్తుందని అంటున్నారు! దీనివల్ల పార్టీ పునాదులు పాడైపోతాయనే విషయం మరిచిపోకూడదని అంటున్నారు! 2019-24 మధ్య వైసీపీ కార్యకర్తలు, పలువురు నేతలు గురైన అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు! కానిపక్షంలో.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు!

నేడు బీజేపీ ఎంతో విలువ ఇస్తుందంటే... దానికి కారణం జనసేనకు పార్టీకి గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలే అని పవన్ గుర్తించాలని.. ఒక్కసారి ఆ నెంబర్ తగ్గితే మోడీ అపాయింట్మెంట్ వరకూ వద్దు, హస్తినలో చోటా నాయకులు సైతం కనీసం ఫోన్ కూడా ఎత్తరనే విషయం.. చాలా మంది నాయకుల చరిత్రను చూసి తెలుసుకోవాలని పలువురు గుర్తుచేస్తున్నారు!

Tags:    

Similar News