రంగంలోకి జనసేనాని.. ఏడాదిన్నర తర్వాత పార్టీపై ఫోకస్

ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు.;

Update: 2025-11-23 15:30 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో జనసేనాని పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత పార్టీ కమిటీల పునర్నిర్మాణంపై ఆయన పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. స్థానిక ఎన్నికల్లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మండల, నియోజకవర్గ స్థాయి నేతల మనోభావాలను తెలుసుకుని పార్టీ కమిటీలను ఎంపిక చేయాలని పవన్ సూచించారు.

దాదాపు 18 నెలలుగా అధికారిక విధుల్లో పూర్తిగా లీనమైన పవన్.. పార్టీపైనా ఫోకస్ చేయాలని కొంతకాలంగా పార్టీ శ్రేణులు కోరుతున్నాయి. పొత్తు ధర్మంలో భాగంగా నామినేటెడ్ పదవుల్లో జనసేన వాటాగా పదవులు ఇస్తున్నా, పార్టీ పదవులను భర్తీ చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. పార్టీని విస్తరించాలంటే గ్రామ, మండల, జిల్లా కమిటీల భాగస్వామ్యమే ప్రధానమని జనసేన హైకమాండ్ కూడా భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి జనసేన ప్రాతినిధ్యం పెరగడానికి క్షేత్రస్థాయిలో పనితీరు మెరుగుపడాలని కేడర్ కు అధిష్టానం నిర్దేశిస్తుంది. ఇక అధిష్టానం కార్యకర్తల మధ్య వారదిగా పనిచేసే పార్టీ కమిటీలు ఇందులో క్రియాశీలంగా పనిచేయాల్సివుంటుందని పవన్ భావిస్తున్నారు.

దీంతో శనివారం సడన్ గా పార్టీ శ్రేణులతో పవన్ అత్యావసర సమావేశం నిర్వహించారు. జనవరి తర్వాత ఏ క్షణమైనా స్థానిక నగారా మోగే అవకాశం ఉండటంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నియమించే కసరత్తు చేయాలని సీనియర్ నేతలకు పవన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ పనితీరుపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంలో కార్యకర్తలను భాగం చేయాలని సూచించారు. జనసేనకు ప్రస్తుతం ఉమ్మడి విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో బలమైన నాయకత్వం ఉందని, ఆ స్థాయిలోనే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ నాయకత్వాన్ని పటిష్టం చేయాలని పవన్ భావిస్తున్నారు.

ఈ విషయమై శనివారం పార్టీ ముఖ్యులతో ఆయన చర్చించారు. నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు పార్టీకి గ్రామస్థాయిలో బలమైన పునాదులు ఉన్నా, సరైన నాయకత్వం తయారు చేయలేకపోయామనే అభిప్రాయం వ్యక్తమైనట్లు చెబుతున్నారు. రానున్న కాలంలో పార్టీని నడిపించే నాయకులను ఎంపిక చేయాలని వారి స్థాయిని బట్టి పార్టీ కమిటీల్లో బాధ్యతలు అప్పగించాలని పవన్ నిర్ణయించారని అంటున్నారు. దీంతో వైసీపీ నుంచి బయటపడాలని చూస్తున్న క్షేత్రస్థాయి నేతలకు పవన్ డోర్లు ఓపెన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News