త్రాల్ ఎన్‌కౌంటర్‌లో మిలిటెంట్ హతం: తల్లి ప్రాధేయపడినా వినని కొడుకు..

ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న హృదయవిదారక వీడియోలో వాణి తల్లి కన్నీళ్లతో తన కొడుకును లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని వేడుకుంటుంది.;

Update: 2025-05-15 12:54 GMT

జమ్మూ కాశ్మీర్ లోని అవంతిపోరాలో గల త్రాల్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. జైషే మహ్మద్ మిలిటెంట్ అమీర్ వాణి, లొంగిపోవాలని తన తల్లి చేసిన ఆర్తనాదాలను పట్టించుకోకుండా కాల్పులు జరపడంతో భద్రతా బలగాల చేతిలో హతమయ్యాడు.

గురువారం త్రాల్‌లో మిలిటెంట్ల ఉనికి గురించి సమాచారం అందడంతో భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. భద్రతా దళాలు వారిని చుట్టుముట్టగానే, నక్కి ఉన్న మిలిటెంట్లు కాల్పులు జరపడంతో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి.

తీవ్రమైన కాల్పుల సమయంలో భద్రతా బలగాలు చిక్కుకున్న మిలిటెంట్లను లొంగిపోవాలని ఒప్పించే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే అమీర్ వాణికి అతని తల్లితో వీడియో కాల్ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు.

ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న హృదయవిదారక వీడియోలో వాణి తల్లి కన్నీళ్లతో తన కొడుకును లొంగిపోయి ఇంటికి తిరిగి రావాలని వేడుకుంటుంది. అయితే అందిన నివేదికల ప్రకారం, వాణి లొంగిపోవడానికి నిరాకరించాడు.. దమ్ముంటే ఇండియన్ ఆర్మీ బలగాలను ముందుకు రావాలని తన తల్లితో చెప్పాడు.

తల్లి చేసిన భావోద్వేగ విజ్ఞప్తిని బేఖాతరు చేస్తూ, వాణి భద్రతా బలగాలతో తలపడటం కొనసాగించాడు. తదనంతరం ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ ఆపరేషన్‌లో మొత్తం ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు.

ఈ సంఘటన మరోసారి జమ్మూ కాశ్మీర్‌లో మిలిటెన్సీ వల్ల కలిగే సంక్లిష్టమైన.. విషాదకరమైన మానవ నష్టాన్ని హైలైట్ చేసింది, అక్కడ యువకులు హింస వైపు మళ్లి, దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలను వదిలివేస్తున్నారు. తమ కొడుకును రక్షించడానికి తల్లి చేసిన చివరి ప్రయత్నానికి సంబంధించిన వీడియో చాలా మందిని తీవ్రంగా కలచివేసింది. హింస వలయంలో చిక్కుకున్న కుటుంబాలు అనుభవించే బాధ.. వేదనను ఇది నొక్కి చెబుతోంది.

Tags:    

Similar News