ముగ్గురు ఉగ్రవాదుల చిత్రాలు విడుదల... అక్కడే దాడి అందుకేనా?

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొల్పిన సంగతి తెలిసిందే.;

Update: 2025-04-23 09:30 GMT

జమ్ముకశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మృతుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు! మరోపక్క పదుల సంఖ్యలో క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సమయంలో ఈ దారుణ మారణకాండకు పాల్పడిన ముగ్గురు ముష్కరుల ఊహాచిత్రాలు విడుదలయ్యాయి.

అవును... పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ముగ్గురు ముష్కరుల ఊహాచిత్రాలను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ విడుదల చేశాయి. వీరిని ఆసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తాలాగా గుర్తించారు. వీరికి... మూసా, యూనిస్, ఆసిఫ్ అనే కోడ్ నేమ్ లు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ప్రకటించినట్లుగానే వీరంతా "ది రెసిస్టెన్సీ ఫ్రంట్" (టీ.ఆర్.ఎఫ్.) లో సభ్యులే!

మరోపక్క వీరిలో కనీసం ఇద్దరు విదేశీయులని భావిస్తున్నట్లు ఏజెన్సీలు చెబుతున్నాయి! ఈ విషాదాన్ని తట్టుకోవడానికి దేశం కష్టపడుతోన్న తరుణంలో.. ఉగ్రవాదులను పట్టుకోవడంతో పాటు ఈ దాడి వెనుక ఉన్న అజ్ఞాత శక్తులను, క్రూరమైన ప్రణాళికలను వెలికితీసేందుకు భద్రతా సంస్థలు ఇప్పటికే పని మొదలుపెట్టాయి! స్థానిక అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి!

బైసరోన్ లోయనే ఎందుకు..?

మంగళవారం సాయంత్రం 3 గంటల సమయంలో ప్రయాణికులు సందడిగా ఉన్న సమయంలో ఉగ్రదాడి మొదలైంది. ఆ సమయంలో ముష్కరులు తొలుత బాధితులు అందరినీ ఒకచోటుకు చేర్చి వారి గుర్తింపులను చెక్ చేశారని అంటున్నారు. ఇక దాడి సమయంలో ముష్కరులు హెల్మట్లను ధరించి.. బాడీ కెమెరాలతో దాడిని చిత్రీకరించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలుస్తోంది.

ఆ సంగతి అలా ఉంటే... ఉగ్రవాదులు బైసరన్ లోయనే ఎందుకు ఎంచుకున్నారనే విషయం తెరపైకి వచ్చింది. అయితే... ఈ ఎంపిక వెనుక వ్యూహాత్మక ఎత్తుగడే ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఈ ప్రాంతంలో ఎక్కువ భద్రతా ఏర్పాట్లు ఉండవనే కారణంతోనే వారు ఈ ప్రాంతాన్ని దాడికి ఎన్నుకున్నట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో పహల్గాం నుంచి ఇక్కడకు 6.5 కి.మీ. దూరం ఉండగా.. అక్కడకు కాలినడకన, లేదా.. గుర్రాలపైనే సాధ్యమవుతుందని.. దాడి గురించి తెలిసినప్పటికీ భద్రతా బలగాలు ఇక్కడకు రావడానికి సమయం పడుతుందని భావించారని అంటున్నారు. పైగా ఈ లోయ చుట్టూ అటవీ ప్రాంతం ఉండటంతో తప్పించుకోవడం తేలిక అని వారు ప్లాన్ చేశారని అంటున్నారు.

Tags:    

Similar News