రాయల కాలం గుర్తుకు తెస్తున్న నవాచ్ కా చౌరాహా.. ఇక్కడ వజ్ర, వైడూర్యాలు.. ధర ఎంతంటే..

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ను ప్రపంచం ‘పింక్‌ సిటీ’గా గుర్తింపు ఉంది. రాజ ప్రాసాదాలు, కోటలు, హవేలీలు ఈ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తే, రత్నాలు, ఆభరణాల వాణిజ్యం దీని ప్రత్యేకతను మరింత పెంచుతుంది.;

Update: 2025-09-25 10:30 GMT

‘రాయల వారి కాలంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారు’ ఇది మనం పుస్తకాల్లో చదువుకున్నాం. అచ్చం ఇలానే రాజస్థాన్ లో జరుగుతుందంటే నమ్ముతారా..? కాదు.. కాదు.. అవి నకిలీవి అంటారా..? లేదు లేదు ముమ్మాటికీ అవి ఒరిజినల్. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌ను ప్రపంచం ‘పింక్‌ సిటీ’గా గుర్తింపు ఉంది. రాజ ప్రాసాదాలు, కోటలు, హవేలీలు ఈ నగర వైభవాన్ని ప్రతిబింబిస్తే, రత్నాలు, ఆభరణాల వాణిజ్యం దీని ప్రత్యేకతను మరింత పెంచుతుంది. చరిత్ర చెబుతున్నట్లుగా, రాజుల కాలంలో రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారని ఇప్పటికీ కథనాలుగా వినిపిస్తుంది. ఆ సంప్రదాయం జైపూర్ వీధుల్లో ఇప్పటికీ కొనసాగుతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

నవాబ్ కా చౌరాహాకు మార్చిన మార్కెట్..

ఒకప్పుడు రత్నాల వ్యాపారం రాజస్థాన్ లోని జోహరీ బజార్‌లో నడిచేది. ట్రాఫిక్ రద్దీ, భౌతిక అవరోధాల కారణంగా ఈ మార్కెట్‌ను ఘాట్‌ గేట్‌ సమీపంలోని నవాబ్‌ కా చౌరాహాకు మార్చారు. అయితే ఈ బజార్ రోజు ఉండదు కేవలం వారానికి ఆరు రోజులే ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు కేవలం 2 గంటల వ్యవధిలో (సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు) లావాదేవీలు జరుగుతాయి. ఆ అర కిలోమీటర్‌ పొడవైన వీధి వ్యాపారులకే అంకితం అవుతుంది. ఇది సాధారణమైన మార్కెట్ కాదు. లక్షలు, కోట్లు విలువ చేసే రత్నాలు రోడ్డుపైనే చేతులు మారుతాయి. ఇక్కడ రసీదులు, బిల్లులు లాంటివి ఉండవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం మాత్రమే. ఇది వ్యాపార సంస్కృతి, నైతిక విలువలకు చూపిస్తుంది.

నవాబ్ కా చౌరహాకు ఎమరాల్డ్, సఫైర్, రూబీ, టోపాజ్, ఓనిక్స్, అగేట్, టాంజానైట్, కోరల్, లాపిస్‌ వంటి విలువైన రత్నాలు పెద్ద ఎత్తున వస్తాయి. అత్యుత్తమ రకాల ధరలు లక్షల్లో ఉంటుంది. కేవలం వ్యాపారులకే కాదు.. రత్నాలను కత్తిరించే కళాకారులు, శిల్పులు, మెరుగులు పెట్టే కార్మికులు తమ జీవనోపాధిని ఇక్కడే వెతుక్కుంటారు. జైపూర్‌ కేవలం పర్యాటక కేంద్రం మాత్రమే కాదు.. రత్నాల పరిశ్రమ జీవనాధారం కూడా..

విదేశీయులను ఆకర్షిస్తున్ మార్కెట్

విదేశీ పర్యాటకులకు ఈ మార్కెట్ ఆకర్షణగా మారింది. విలువైన రత్నాలను కొని స్వదేశానికి తీసుకెళ్తూ జైపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువస్తున్నారు. ఇది జైపూర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, భారతదేశాన్ని రత్నాల వ్యాపారానికి గ్లోబల్‌ హబ్‌గా నిలబెడుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇంతటి విలువైన వ్యాపారం జరుగుతున్నా, నిబంధనలు, పర్యవేక్షణలు లేకపోవడం ఆర్థిక భద్రతా కోణంలో సవాలే. పారదర్శకత లేకపోవడం వల్ల పన్ను వసూళ్లలో నష్టం కలగవచ్చు. అయినప్పటికీ, శతాబ్దాల ఈ ‘నమ్మక వాణిజ్యం’ ఇప్పటికీ నిలబడటం విశేషమే. మొత్తానికి, జైపూర్ రత్నాల మార్కెట్‌ కేవలం వ్యాపారమే కాదు.. ఒక సాంప్రదాయం..

Tags:    

Similar News