అవమానం.. అనుమానం.. అందుకే రాజీనామా?
సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జగదీప్ ధనఖర్ రాజీనామా ప్రకటన చేయడం విస్మయానికి గురిచేసింది.;
ఉప రాష్ట్రపతి జగదీప్ ధనఖర్ ఆకస్మిక రాజీనామాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సోమవారం రోజంతా రాజ్యసభ విధుల్లో చురుగ్గా పాల్గొన్న జగదీప్ ధనఖర్ అనూహ్యంగా రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమైవుంటుందని అంతా ఆరా తీస్తున్నారు. రెండేళ్ల 344 రోజులపాటు ఉప రాష్ట్రపతిగా విధులు నిర్వహించిన జగదీప్ ధనఖర్ పది రోజుల కిందటే తన పదవీ విరమణపై వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత ఆయన అనూహ్య నిర్ణయం తీసుకోవడం తీవ్ర సస్పెన్స్ గా మారింది. అయితే కేంద్ర ప్రభుత్వంతో విభేదాల వల్లే ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.
సోమవారం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజే జగదీప్ ధనఖర్ రాజీనామా ప్రకటన చేయడం విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి ఆయన ఈ నిర్ణయాన్ని అప్పటికప్పుడు తీసుకున్నట్లు భావిస్తున్నా, ఈ విషయంలో కొంతకాలంగా తర్జనభర్జన జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే పది రోజుల క్రితం జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి తన పదవీకాలంపై వ్యాఖ్యలు చేశారని మీడియా గుర్తు చేస్తోంది. 2027 ఆగస్టులో ఏం చేయాలో స్పష్టంగా తెలుసుకుని పదవీ విరమణ చేస్తా, దైవ నిర్ణయానికి లోబడి ఉంటా అంటూ అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. ఇది జరిగిన పది రోజులకు ఆయన అనూహ్యంగా పదవి నుంచి తప్పుకున్నారు.
మరోవైపు కేంద్రం కూడా జగదీప్ ధనఖడ్ రాజీనామాను వెనువెంటనే ఆమోదించేలా రాష్ట్రపతికి సూచించడంతో దీని వెనుక బీజేపీలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఉప రాష్ట్రపతిగా జగదీప్ ధనఖడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని విపక్షాలు ఆరోపిస్తూ వస్తున్నాయి. ఆయనపై అవిశ్వాసానికి కూడా ఓ సారి ప్రయత్నించాయి. అయితే అప్పట్లో అధికార పక్షం అండతో ఆ తీర్మానం చర్చకు రాకుండానే అడ్డుకున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఆయన పనితీరుపై కేంద్ర పెద్దలు పెద్దగా సంతృప్తిగా లేరని పరిశీలకులు చెబుతున్నారు. అందుకే ఉప రాష్ట్రపతిని పదవి నుంచి తప్పుకోవాలని సంకేతాలు పంపారని అంటున్నారు. దీనితో విభేదించిన ఆయన పది రోజుల క్రితం తన పదవీ విరమణ దైవ నిర్ణయం ప్రకారం ఉంటుందని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు.
అయితే జగదీప్ ధనఖర్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న బీజేపీ నేతలు ఈ సమావేశాల్లో ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు పావులు కదిపారని అంటున్నారు. ఇది తెలుసుకుని అధికార పక్షం అవిశ్వాసంతో అవమానం ఎదుర్కొవడాన్ని జీర్ణించుకోలేక స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు అభిప్రాయపడుతున్నారు. అంటే ఉప రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వంతో కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోందన్న విషయాన్ని రాజీనామా రుజువు చేస్తోందని అంటున్నారు.