మీ పింఛ‌న్ నాకొద్దు: జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మోడీకి షాకిచ్చారా?

అనారోగ్య కార‌ణాల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేసిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ తాజాగా సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-08-31 02:45 GMT

అనారోగ్య కార‌ణాల‌తో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వికి రాజీనామా చేసిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ తాజాగా సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణ‌యంతో ప‌రోక్షంగా ఆయ‌న కేంద్రంలోని మోడీ స‌ర్కారుకు భారీ షాకిచ్చిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. ఇటీవ‌ల ముగిసిన వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభం అయిన రెండో రోజే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా స‌మ‌ర్పించారు. ఎలాంటి సంకేతాలు ఇవ్వ‌కుండానే రాత్రికిరాత్రి దీనికి సంబంధించిన రాజీనామా ప‌త్రాన్ని రాష్ట్ర‌ప‌తికి స‌మ‌ర్పించారు.

అనంత‌రం.. ఆ రాజీనామాను ఆమోదించ‌డం తెలిసిందే. అప్ప‌ట్లో త‌న‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌డం లేద‌ని.. అందుకే రాజీనామా చేస్తున్నాన‌ని ఆయ‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. దీంతో ఉప‌రాష్ట్ర‌ప‌తి పోస్టుకు ఎన్నిక‌లు కూడా వ‌చ్చాయి. ఇక‌, అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఆయ‌న గురించిన వార్త కూడా ఎక్క‌డా వినిపించ‌లేదు. ఇప్పుడు అనూహ్యంగా ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని రాజస్థాన్ అసెంబ్లీ స్పీక‌ర్ వాసుదేవ్‌ దేవనాని చెప్పారు.

ఏం చేశారు?

రాజ‌స్థాన్ రాష్ట్రానికి చెందిన జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్‌.. 1993లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కిష‌న్‌గ‌ఢ్ నియోక‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఆ త‌ర్వాత‌.. ఆయ‌న ఓడిపోయారు. ఇంత‌లో కేంద్రంలో మోడీ స‌ర్కారు వ‌చ్చాక .. బీజేపీకి వీర విధేయుడు అనే కార‌ణంగా ఆయ‌న‌ను బెంగాల్‌కు గ‌వ‌ర్న‌ర్‌గా పంపించారు. ఆ త‌ర్వాత‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తిని చేశారు. ఇప్పుడు తాజాగా.. ``నేను మాజీ ఎమ్మెల్యేను కాబ‌ట్టి.. నాకు పింఛ‌ను ఇప్పించండి .`` అని రాజ‌స్థాన్ స్పీక‌ర్ వాసుదేవ్‌కు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. వాస్త‌వానికి గ‌తంలోనూ ఆయ‌న 2019లో గ‌వ‌ర్న‌ర్ అయ్యేదాకా.. పింఛ‌ను తీసుకున్నారు. ఇప్పుడు మ‌ళ్లీ మాజీ ప్ర‌జాప్ర‌తినిధి హోదాలో పింఛ‌నుకు ద‌ర‌ఖాస్తు చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు సుమారు 42 వేల చొప్పున నెల నెలా పింఛ‌ను రానుంది.

ఉప‌రాష్ట్ర‌ప‌తి పింఛ‌న్ వ‌ద్దా?!

వాస్త‌వానికి జ‌గ‌దీప్‌.. ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఉంటూ.. త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలోకూడా ఆయ‌న కు రాజ్య‌స‌భ చైర్మ‌న్‌గా అందించిన సేవ‌ల‌కు సంబంధించి పింఛ‌ను ల‌భిస్తుంది. ఇది ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ‌, లేదా రాజీనామా చేసే స‌మ‌యానికి ఎంత ఉంటే అందులో స‌గాన్ని పించ‌నుగా ఇస్తారు. ఉదాహ‌ర‌ణ‌కు తెలుగువారైన‌ వెంక‌య్య‌నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వీ విర‌మ‌ణ పొందే స‌మ‌యానికి ఆయ‌న వేత‌నం 3,20000 రూపాయ‌లు. ప్ర‌స్తుతం దీనిలో స‌గం మొత్తం ఆయ‌న‌కు పింఛ‌నుగా అందుతోంది.

అలానే.. జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ రాజీనామా చేసినా.. ఆయ‌న‌కు పింఛ‌ను వస్తుంది. ఆయ‌న ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు.. రూ.4 ల‌క్ష‌ల చొప్పున వేతనం అందుకున్నారు. దీనిలో స‌గం 2 ల‌క్ష‌లు ఆయ‌న‌కు పింఛ‌నుగా వ‌స్తుంది. కానీ, దీనిని కాదని.. ఆయ‌న మాజీ ఎమ్మెల్యేగా కేవ‌లం 42 వేల రూపాయ‌ల పింఛ‌ను కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం.. దీనిని ఆమోదించేందుకు రాజ‌స్థాన్ స్పీక‌ర్ రెడీ కావ‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి. దీనిని బ‌ట్టి.. ఆయ‌న మ‌న‌సులో ఆవేద‌న‌ను మ‌రో రూపంలో వెళ్ల‌గ‌క్కారా? ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి నుంచి అనూహ్యంగా రాజీనామా చేయ‌డం వెనుక ఉన్న కార‌ణాల‌పై ప‌రోక్షంగా ఆయ‌న స్పందించిన‌ట్టు అయిందా? అనే చ‌ర్చ‌కు దారితీసింది.

Tags:    

Similar News