జగన్ చెప్పిన 'సైకిల్' పిట్టకథ !

దాని రిపేర్ కోసం మొదట కమ్యూనిస్టుల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం రాలేదు

Update: 2024-05-08 04:19 GMT

**2019 ఎన్నికల తర్వాత సైకిల్‌కు రిపేర్‌ చేయాలని చంద్రబాబు చాలా కష్టపడుతున్నాడు. దాని రిపేర్ కోసం మొదట కమ్యూనిస్టుల దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఫలితం రాలేదు. దీంతో దత్తపుత్రుడిని పిలుచుకున్నాడు. అతడు సైకిల్ మొత్తం చూసి నేను క్యారేజీ మీదనే ఎక్కుతాను. టీ గ్లాస్ పట్టుకుని తాగుతాను. మిగతావి నావల్ల కాదు అని చేతులెత్తేశాడు. దీంతో వదినమ్మను ఢిల్లీ పంపించాడు. అక్కడి మెకానిక్ లను రంగంలోకి దింపాడు. సైకిల్ ను ఒక షేప్ లోకి తీసుకురావాలని చంద్రబాబు కోరాడు. తుప్పుపట్టిన సైకిల్ కు హ్యాండిల్ లేదు. సీటు లేదు. పెడల్స్ లేవు. చక్రాలు లేవు. ట్యూబులు లేవు. మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు. దీనిని ఎలా బాగు చేస్తామని మెకానిక్ లు చంద్రబాబుకు చెప్పారు. దీంతో ఇదిగో ఇది మిగిలింది అని చంద్రబాబు నాయుడు బెల్ కొట్టడం మొదలు పెట్టాడు. ఆ బెల్ పేరు అబద్దాల మేనిఫెస్టో’’ అని వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుకొండలో జగన్ చెప్పిన పిట్టకథ అందరినీ ఆశ్చర్యపరిచింది.

14 ఏండ్లు హుఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదని, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు పేరు చెబితే ఏ ఒక్క సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా ? అని జగన్ ప్రశ్నించాడు. ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకపోవడంతోనే 2019 ఎన్నికలలో ఏపీ ప్రజలు అంతా ఒక్కటై సైకిల్ ను ఓడించారని జగన్ ఆరోపించాడు.

అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు చేస్తూనే ఉంటారని, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు, మోసాలు ఎలా ఉంటాయో 2014 మేనిఫెస్టో చూస్తే తెలుస్తుందని జగన్‌ విమర్శించారు. ఇవే మూడు పార్టీలు అప్పుడు కూటమిగా ఏర్పడి తయారు చేసిన ఒక మేనిఫెస్టోను ఇంటింటికీ పంపించాడని జగన్ గుర్తు చేశాడు. ఆ మేనిఫెస్టోతో గెలిచిన తర్వాత అందులో చెప్పిన ఒక్క దాన్ని కూడా అమలు చేయలేదని అన్నాడు.

Tags:    

Similar News