ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావ్ జగన్ ?

రాజకీయాల్లో ప్రతీ చిన్న విషయమూ కౌంట్ అవుతుంది. ప్రజలు బయటకు ఏమీ చెప్పరు.;

Update: 2024-06-15 11:48 GMT

రాజకీయాల్లో ప్రతీ చిన్న విషయమూ కౌంట్ అవుతుంది. ప్రజలు బయటకు ఏమీ చెప్పరు. కానీ రిలజ్ట్ మాత్రం మొత్తం చెప్పి కఠినమైన పరీక్షను పెడుతుంది. ఏపీలో దారుణమైన ఓటమిని కొని తెచ్చుకున్న వైసీపీ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది అని అంటున్నారు. ఎందుకు అంటే ఎక్కడ 151 సీట్లు మరెక్కడ 11 సీట్లు అన్న చర్చ సాగుతోంది.

రాజకీయాల్లో ఏమి జరుగుతుంది అన్నది చూసుకోకుండా కొన్ని సార్లు లాజిక్ మిస్ అవుతూ చేసే దూకుడు చర్యల ప్రతిఫలమే ఫలితాలలో చూడాల్సి వస్తుంది అని అంటున్నారు. దీనికి సింపుల్ ఉదాహరణ బంపర్ మెజారిటీతో టీడీపీ కూటమి గెలవడం. చంద్రబాబుకు చరిత్రలో ఎన్నడూ ఊహించని విజయం దక్కడం.

దీనికి కారణం జగన్ సర్కార్ ఆయన పట్ల అనుసరించిన విధానం అని అంటున్నారు. ఆయనను జైలులో పెట్టి 53 రోజుల పాటు ఉంచిన సందర్భం. ఇది జనాలలో చాలా బాగా సానుభూతి తెచ్చి పెట్టింది. జనాగ్రహం గా మారి వైసీపీని భారీ ఓటమి దిశగా నడిపించింది.

సరిగ్గా ఎన్నికల ఏడాదిలో కొద్ది నెలలు ముందు చేసిన ఈ పనికి వైసీపీ తగిన భారీ మూల్యం చెల్లించుకుంది అని అంటున్నారు. అసలు కాస్తా ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే జగన్ కి ఏ విధంగా అదే సానుభూతి ఉపయోగపడిందో అర్ధం అవుతుంది. వైఎస్ జగన్ పదేళ్ల కష్టం తో సీఎం అయితే ఆయన తండ్రి వైఎస్సార్ ముప్పయ్యేళ్ల పాటు కష్టపడితే కానీ సీఎం కాలేదు

ఇక సీఎం అయ్యాక వైఎస్సార్ అనేక మంది ప్రజల కోసం మంచి పధకాలను అమలు చేసారు. మరో వైపు అభివృద్ధి పనులను చేపట్టారు. వీటికి మించి వైఎస్సార్ చుట్టూ మంచి టీం ఎపుడూ ఉండేది. కేవీపీ రామచంద్రరావును అలాగే రోశయ్యను వైఎస్సార్ బాగా నమ్మారు. పక్కన ఉంచుకున్నారు. రోశయ్యకు అతి ముఖ్యమైన ఆర్ధిక శాఖను ఇచ్చారు.

తెలంగాణాలో అత్యధికంగా ఉన్న రెడ్లను సమాదరించారు. అదే విధంగా రాయలసీమలో రెడ్లను ప్రోత్సహించారు. కోస్తాలో కాపులను ఆకట్టుకున్నారు. విజయవాడ గుంటూరులలో కమ్మలను కేవీపీ ద్వారా దగ్గరకు తీసుకున్నారు. ఉత్తరాంధ్రా దాకా వస్తే బీసీలను పూర్తి స్థాయిలో ముందుకు నడిపించారు.

ఇలా అన్నీ చేయడం ద్వారానే వైఎస్సార్ రెండోసారి అధికారంలోకి వచ్చారు. వైఎస్సార్ తన సొంత కష్టంతోనే ఈ విధంగా రాజకీయాలు చేస్తూ వచ్చారు. ఇక వైఎస్సార్ చనిపోయిన తరువాత జగన్ కి సీఎం చాన్స్ ఇవ్వాలని చాలా మంది సంతకాలు చేశారు. అయినా హై కమాండ్ ఆయనకు సీఎం పోస్టు ఇవ్వలేదు.

ఆ కోపంతోనే జగన్ ఓదార్పు యాత్ర చేసి ప్రజలతో కొంచెం ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ తరువాత జగన్ ని ఏకంగా 16 నెలల పాటు జైలులో పెట్టడంతో ఆయనకు విపరీతంగా సానుభూతి జనాలలో వచ్చింది. ఆ మీదట జగన్ కి పొలిటికల్ గా క్రేజ్ పెరిగి వైసీపీకి అది బలంగా మారింది.

ఈ నేపధ్యంలో 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 67 అసెంబ్లీ సీట్లు దక్కాయి. కేవలం ఒక్క శాతం ఓటు షేర్ తో జగన్ ఓటమి పాలు అయ్యారు. ఆ తరువాత అయిదేళ్ల కాలం టీడీపీ కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది. జగన్ మరో వైపు పాదయాత్ర చేసి జనాల్లోకి వెళ్ళి సీఎం అయ్యారు.

ఫ్లాష్ బ్యాక్ ఇలా ఉంటే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కక్ష సాధింపు చర్యలకు తెర తీశారు. గడచిన అయిదేళ్ల పాటు టీడీపీ విషయంలో జగన్ చేసిన పొరపాట్లు టార్గెట్ చేయడం వంటి కారణంగానే వైసీపీ తాజా ఎన్నికల్లో మట్టి కొట్టుకుని పోయింది అని అంటున్నారు.

ప్రజా స్వామ్యంలో గెలుపోటములు సహజం. ఇటీవల కాలంలో అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న పార్టీని ఓడించేస్తున్నారు జనాలు. ఇది పొలిటికల్ గా ఒక ట్రెండ్ గా చూడాల్సి ఉంది. కానీ కక్ష సాధింపు రాజకీయాలతో అధికారాలు పోగొట్టుకోవడం మాత్రం ఏపీలోనే కనిపిస్తోంది. జగన్ తాను నాయకుడిగా ఎలా ఎదిగారు అన్నది గుర్తు చేసుకుంటే 2019 నుంచి 2024 మధ్యలో టీడీపీ మీద దాడులు జరిగేవి కావు అని అంటున్నారు.

కానీ జగన్ తమకు ప్రజలు ఇచ్చిన అధికారం శాశ్వతం అనుకున్నారో లేక టీడీపీ 23 సీట్ల నుంచి ఇక బయటకు లేవదని భావించారో తెలియదు కానీ తానే చాన్స్ ఇచ్చినట్లుగా మరీ కక్షకట్టి బాగా లేపారు. దాని ఫలితమే టీడీపీకి భారీ విజయం. వైసీపీకి భారీ ఓటమి అని అంటున్నారు. ఏది ఏమైనా కూడా జగన్ చిన్న లాజిక్ మిస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News