కేంద్ర మంత్రి రామ్మోహన్ పై తీవ్ర ఆరోపణలు.. పదవికి ముప్పేనా?
రామ్మోహన్ నాయుడు ఏ ముహూర్తాన తన శాఖ బాధ్యతలు చేపట్టారో గానీ కేంద్రంలో మరే మంత్రికి లేనన్ని చిక్కులు వెంటాడుతున్నాయని అంటున్నారు.;
కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. రామ్మోహన్ నాయుడు ఏ ముహూర్తాన తన శాఖ బాధ్యతలు చేపట్టారో గానీ కేంద్రంలో మరే మంత్రికి లేనన్ని చిక్కులు వెంటాడుతున్నాయని అంటున్నారు. విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపైనా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని టార్గెట్ చేస్తున్నారు. అజిత్ విమాన ప్రమాదంపై కుట్ర జరిగిందని, ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఆయన మేనల్లుడు మహారాష్ట్ర ఎమ్మెల్యే రోహిత్ పవార్ తాజాగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా దర్యాప్తు సజావుగా సాగాలంటే అది పూర్తయ్యే వరకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తన పదవి నుంచి తప్పుకోవాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణం ఆ రాష్ట్రంలో రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. అజిత్ మరణంపై ఆయన పార్టీ నేతలు రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విమాన ప్రమాదంపై ఇన్సూరెన్స్ కోణం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. తమ వాదనను బలపర్చేలా అనేక అంశాలను లేవనెత్తుతున్నారు. ఈ పరిణామాలతో అజిత్ మరణంపై విచారణ చేయాలని ఉప ముఖ్యమంత్రి, అజిత్ భార్య సునేత్ర పవర్ కూడా గళం విప్పారు. ప్రమాదానికి కారణమైన చార్టెర్డ్ విమానయాన సంస్థ విఎస్ఆర్ వెంచర్స్ ను కాపాడేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయత్నిస్తున్నారని ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు.
మహారాష్ట్ర రాజకీయాల్లో రోహిత్ పవార్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఇదే సమయంలో తెలుగు వాడైన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని మధ్యలోకి లాగడంపైనా చర్చ జరుగుతోంది. విమాన కొనుగోలు ధర రూ.35 కోట్లు అయితే, దాని ప్రస్తుత మార్కెట్ ధర రూ.10 కోట్లు ఉంటుందని ఎన్సీపీ నేతలు చెబుతున్నారు. అయితే విమానానికి రూ.55 కోట్ల ఇన్సూరెన్స్, రూ.210 కోట్ల లయబిలిటీ ఇన్సూరెన్స్ చేయడంపై ఎన్సీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదానికి గురైన విమానయాన సంస్థను కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేతలతోపాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి వీఎస్ఆర్ వెంచర్స్ యాజమాన్యం అత్యంత సన్నిహితంగా ఉందని, వీఎస్ఆర్ సంస్థ యజమాని వీకే సింగ్ కుమారుడు వివాహానికి ఏపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అంతేకాకుండా ప్రమాదం జరిగిన వెంటనే వీకే సింగ్, ఆయన కుమారుడు రోహిత్ సింగ్ దేశం విడిచి వెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. కాగా, ఈ వ్యవహారంపై ఎన్సీపీ (ఎస్) ఎంపీ, అజిత్ సోదరి సుప్రియ సూలే కూడా స్పందించారు. ప్రమాదంపై రోజుకొక కొత్త విషయం బయటపడుతోందని, ఈ ఘటనపై పారదర్శక, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.