నిజాయితీకి నిలువెత్తు రూపం దీనికి మించి ఇంకేం ఉంటుంది?
ప్రపంచం మారింది. దుర్మార్గం పెరిగింది. అరాచకం హద్దులు దాటుతుందన్న మాటల్ని తరచూ వింటుంటాం. కానీ.. చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది.;
ప్రపంచం మారింది. దుర్మార్గం పెరిగింది. అరాచకం హద్దులు దాటుతుందన్న మాటల్ని తరచూ వింటుంటాం. కానీ.. చెడుతో పాటు మంచి కూడా ఉంటుంది. చూడాలే కానీ.. మనసున్న మనసులు చెడు కంటే చాలా ఎక్కువగా ఉంటారు. సమస్యేమంటే.. చెడు హైలెట్ అయినంతగా మంచి కాదంతే. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం గురించి తెలిస్తే.. సదరు వ్యక్తి నిజాయితీకి సలాం చేయాల్సిందే. నిజాయితీకి నిలువెత్తు రూపాన్ని చూడాల్సి వస్తే.. హర్యానాకు చెందిన అక్తర్ ఖాన్ ను చూపించాల్సిందే. అసలు విషయంలోకి వెళితే..
హర్యానాలోని ఫరీదాబాద్ కు చెందిన అశోక్ శర్మ గత అక్టోబరులో దీపావళి పండుగ సందర్భంగా ఇంటిని శుభ్రం చేయాలని డిసైడ్ చేశారు. ఇందులో భాగంగా ఇంటి మొత్తాన్ని క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం పెట్టగా.. భారీ ఎత్తున స్క్రాప్ తేలింది. దీంతో.. ఆయన స్క్రాప్ ను కొనుగోలు చేసే అక్తర్ ఖాన్ అనే డీలర్ ను సంప్రదించాడు. అయితే.. ఇక్కడ అనుకోని రీతిలో ఒక పొరపాటు చోటు చేసుకుంది.
ఇంట్లోని చెత్తను స్క్రాప్ డీలర్ కు ఇచ్చే క్రమంలో ఒక సంచిలో ఉన్న బంగారు నగల మూట కూడా చెత్తతో పాటు వెళ్లిపోయింది. ఆ బంగారు ఆభరణాల విలువ రూ.15 లక్షలకు పైనే ఉంది. ఇంట్లోని స్క్రాప్ తో పాటు వెళ్లిన బంగారు నగల సంచి గురించి వారు కొన్నిరోజుల తర్వాతే గుర్తించారు. దీంతో.. అసలు విషయం గుర్తుకు వచ్చి స్క్రాప్ డీలర్ వద్దకు వెళ్లగా.. అతను కూడా వెతికాడు. అయినా.. ఏమీ దొరకలేదు. ఈ నేపథ్యంలో నిరాశతో ఇంటికి తిరిగి వచ్చారు.
కట్ చేస్తే.. నాలుగునెలల అనంతరం ఇటీవల తన షాపులో ఉన్న చెత్తను వేరు చేసే సమయంలో.. ఒక సంచి కనిపించటం.. అందులో బంగారు నగలు ఉండటంతో.. ఆ రోజున తన వద్దకు వచ్చిన అశోక్ శర్మ గురించి గుర్తు చేసుకున్న అక్తర్ ఖాన్ వెంటనే స్థానిక పోలీసు స్టేషన్ ను సంప్రదించి.. జరిగిందంతా చెప్పి బంగారు ఆభరణాల్ని అప్పజెప్పారు. అయితే.. తమ బంగారు ఆభరణాలు పోయిన దానికి సంబంధించి తమకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో అశోక్ శర్మను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. అక్తర్ ఖాన్ చేతుల మీదుగా ఆభరణాల్ని ఇప్పించారు. ఇంతటి నిజాయితీని ప్రదర్శించిన అక్తర్ ఖాన్ ను పలువురు ప్రశంసిస్తున్నారు.నిజమే.. మన చుట్టూ చెడు ఉంటుంది చీకటి మాదిరి. కానీ.. మంచి అనే వెలుగు కూడా ఉంటుంది. ఇలాంటి అక్తర్ ఖాన్ రూపంలో. కాదంటారా?