మైదానంలో తేనెటీగ‌ల దాడి.. ప‌రుగెత్త‌లేకనే అంపైర్ ప్రాణాలు బ‌లి

వికెట్ల మ‌ధ్య ఎన్నో ప‌రుగులు చూసిన అత‌డు.. కేవ‌లం ప‌రుగెత్త‌లేక ప్రాణాలు కోల్పోయాడు. ద‌శాబ్దాల పాటు ఎన్నో మ్యాచ్ లు చూసిన అత‌డు.. అదే చివ‌రి మ్యాచ్ అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయాడు.;

Update: 2026-02-20 10:55 GMT

వికెట్ల మ‌ధ్య ఎన్నో ప‌రుగులు చూసిన అత‌డు.. కేవ‌లం ప‌రుగెత్త‌లేక ప్రాణాలు కోల్పోయాడు. ద‌శాబ్దాల పాటు ఎన్నో మ్యాచ్ లు చూసిన అత‌డు.. అదే చివ‌రి మ్యాచ్ అవుతుంద‌ని ఊహించ‌లేక‌పోయాడు. జీవితం మొత్తాన్ని క్రికెట్ కు అంకితం చేసిన అత‌డు.. అదే క్రికెట్ మ్యాచ్ నేప‌థ్యంలో జీవం కోల్పోయాడు. ఇదంతా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఉన్నావ్ లో తేనె టీగ‌ల దాడిలో మ‌ర‌ణించిన అంపైర్ మాణిక్ గుప్తా గురించి. కాన్పూర్ క్రికెట్ స‌ర్కిల్ లో ఈయ‌న పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. బ‌హుశా మాణిక్ క‌ళ్ల ముందే పుట్టి పెరిగిన వారు ఎంద‌రో దేశానికి, యూపీకి ఆడి ఉండొచ్చు కూడా. లేదా ఆయ‌న అంపైరింగ్ చేసిన మ్యాచ్ ల‌లో ఎంద‌రో దిగ్గ‌జ క్రికెట‌ర్ల ఆడి ఉండొచ్చ కూడా. అలాంటి మాణిక్ కేవ‌లం తేనెటీగ‌లు కుట్టి చ‌నిపోవ‌డం విషాద‌క‌రం. అందులోనూ మ్యాచ్ సంద‌ర్భంగా ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం మ‌రింత బాధాక‌రం.

అతడి మ్యాచ్ ముగిసింది..

మాణిక్ గుప్తా విశేష అనుభ‌వం ఉన్న క్రికెట్ అంపైర్. కాన్పూర్ క్రికెట్ అసోసియేష‌న్ అనుబంధం ఉన్న‌వాడు. ఈ క్ర‌మంలో విధి నిర్వ‌హ‌ణ‌లో భాగంగా మ్యాచ్ కు అంపైరింగ్ చేస్తుండ‌గా స‌మీపం ప్రాంతం నుంచి అక‌స్మాత్తుగా తేనెటీగ‌లు పైకి లేచాయి. దీంతో మైదానంలోని అంద‌రూ ప‌రుగెత్తారు. కానీ, 65 ఏళ్ల మాణిక్ మాత్రం ఆ ప‌ని చేయ‌లేక‌పోయాడు. 30 ఏళ్లకు పైగా క్రికెట్ మైదానంలో అంపైర్ గా విధులు నిర్వ‌ర్తించిన ఆయ‌న‌పై తేనె టీగ‌లు తీవ్రంగా దాడి చేశాయి. ఆ స‌మ‌యంలో మాణిక్ తో పాటు జ‌గ‌దీష్ శ‌ర్మ కూడా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నాడు. కానీ, అత‌డు కాస్త యువ‌కుడు కావ‌డంతో గ‌బ‌గ‌బా అక్క‌డినుంచి త‌ప్పించుకున్నాడు. ఇదే విష‌య‌మై శ‌ర్మ మాట్లాడుతూ.. మాణిక్ భాయ్ ప‌రుగు తీయ‌లేక‌నే తేనెటీగ‌ల దాడికి గుర‌య్యాడ‌ని వివ‌రించాడు.

డ్రింక్స్ బ్రేక్స్ స‌మ‌యంలో..

బ‌హుశా తేనె టీగ‌ల దాడి మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో అయితే, మాణిక్ బ‌తికి ఉండేవాడేమో? కానీ, డ్రింక్స్ బ్రేక్స్ స‌మ‌యంలో ఆట‌గాళ్ల‌తో పాటు అంపైర్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు తేనెటీగ‌ల గుంపు మీద‌ప‌డింది. వ‌యో భారం రీత్యా మాణిక్ కు ప‌రుగెత్తే ఓపిక లేక‌పోయింది. ఈ క్ర‌మంలో అత‌డు కింద‌ప‌డిపోయిన‌ట్లు కూడా స‌మాచారం. అప్పుడే తేనెటీగ‌లు కుట్టాయ‌ని మాణిక్ సోద‌రుడు వివ‌రించాడు. 30 ఏళ్ల‌కు పైగా అత‌డు అంపైరింగ్ బాధ్య‌త‌ల్లో ఉన్నాడు. రాష్ట్ర ప్యానెల్ అంపైర్ గానూ ఉన్నాడు.

కేవ‌లం ప‌ది నిమిషాల్లోనే...

మాణిక్.. జీవితాన్ని అంపైరింగ్ కు అంకితం చేశాడ‌ని పొరుగున ఉండే భ‌ర్తేందు పూరి తెలిపాడు. అత‌డి కుటుంబానికి అంపైరింగే ఆధార‌మ‌ని చెప్పాడు. కాగా, తేనెటీగ‌ల దాడి కేవ‌లం 10 నిమిషాల్లోనే చోటుచేసుకున్న‌ట్లు స‌మాచారం. మాణిక్ తో పాటు స‌హ‌చ‌ర అంపైర్, ఆట‌గాళ్ల‌కూ గాయాల‌య్యాయి.

Tags:    

Similar News