జగన్ దగ్గర మొత్తం చిట్టా...ఇక మాట్లాడేదెట్టా...!?

అధినాయకుడు ఎన్ని చెప్పినా ఆఖరి నిముషంలో ఏదో విధంగా టికెట్ పట్టేయవచ్చు అన్నది ఇప్పటిదాకా అనేక మందిలో కనిపించిన భావన.;

Update: 2023-12-31 02:30 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్టైల్ ట్రెడిషనల్ పార్టీలకు చాలా భిన్నం. అయితే ఆయన పార్టీలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే అత్యధికం ఉన్నారు. చాలా మంది ఓల్డ్ ట్రెడిషన్ ని ఫాలో అయ్యే వారే ఉన్నారు. అధినాయకుడు ఎన్ని చెప్పినా ఆఖరి నిముషంలో ఏదో విధంగా టికెట్ పట్టేయవచ్చు అన్నది ఇప్పటిదాకా అనేక మందిలో కనిపించిన భావన.

కానీ అది తప్పు అని జగన్ రుజువు చేశారు. మొహమాటాలే లేవు అని చెప్పేస్తున్నారు. తనకు పార్టీ కన్నా ఎవరూ ముఖ్యం కాదని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇంచార్జిల మార్పు విషయంలో జగన్ దూకుడుగానే వెళ్తున్నారు. అయన దగ్గర ఎవరేమిటి అన్నది మొత్తం చిట్టా ఉందని అంటున్నారు.

ఇంకా విడమరచి చెప్పాలంటే అయిదేళ్ల పనితీరు ప్రతీ ఎమ్మెల్యేదీ కూడా ఉందిట. అలాగే ఏ నియోజకవర్గంలో పార్టీ బలమెంత, వర్గ పోరు ఎంత, దానికి కారకులు ఎవరు గ్రూపుల వెనక ఉన్నది ఎవరు ఇత్యాది విషయాలు అన్నీ జగన్ దగ్గర పక్కాగా ఉన్నాయట. దాంతో పాటు ఎవరు పార్టీని సీరియస్ గా తీసుకున్నారు ఎవరు లైట్ తీసుకున్నారు అన్న వివరాలు కూడా పూర్తిగా ఉన్నాయట.

జగన్ నిజం చెప్పాలంటే రెండేళ్ల ముందు నుంచి ఎమ్మెల్యేలను జనంలోకి వెళ్లమని పంపిస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక కార్యక్రమాన్ని ఆయన ఇచ్చిందే అందుకు. అంతే కాదు ప్రతీ రెండు మూడు నెలలకూ ఒక వర్క్ షాప్ లాంటిది నిర్వహించి గ్రాఫ్ బాగా లేని వారిని అలెర్ట్ చేస్తూ వచ్చారు. అంతే కాదు పలు మార్లు హెచ్చరించారు అని అంటున్నారు.

అయినా సరే చాలా మంది పెడచెవిన పెట్టిన ఫలితమే ఇపుడు వారి సీట్లో కొత్త వారు రావడం అని అంటున్నారు. మరి కొన్ని చోట్ల పార్టీ సామాజిక సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. దాంతో పాటుగా ఎమ్మెల్యే పనితీరు గ్రాఫ్, ప్రజలతో అటాచ్ మెంట్స్, క్యాడర్ తో సాన్నిహిత్యం ఇలాంటివి వన్నీ మెరిట్స్ డీ మెరిట్స్ కింద కొలమానం పక్కాగా వేసి మరీ జగన్ డెసిషన్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.

తాను ఇంచార్జిలను మారుస్తున్నాను అని అంటున్న వారు ఎందుకు మార్చకూడదో ఒక్క పాయింట్ అయినా చెప్పాలని ఎదురు ప్రశ్న వైసీపీ అధినాయకత్వం నుంచి వస్తోందిట. మార్చడానికి వంద కారణాలు ఉన్నాయని

అవి చిట్టా మొత్తం తీసి కూడా చెప్పగలమని అంటోందిట. దాంతో ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి అని అంటున్నారు.

తమ గ్రాఫ్ బాగులేదని హెచ్చరించిన వారిలో చాలా మంది సరిచేసుకుని తిరిగి పుంజుకున్నారని కూడా పార్టీ పెద్దలు గుర్తు చేస్తున్నారు. అలాంటి వారి సీటు సేఫ్ గా ఉందిట. అదే టైం లో మనకేంటి అని లైట్ తీసుకున్న వారికే ఇపుడు కష్టాలు అని అంటున్నారు. ఇక ప్రజలలో ప్రభుత్వం పనితీరు పట్ల అంతా బాగుంది. అలాగే సంక్షేమ పధకాలు నూటికి ఎనభై నుంచి తొంబై శాతం ప్రజానీకానికి అందుతున్నాయి.

దాంతో లబ్ది పొందిన ప్రజలతో ఎప్పటికపుడు కనెక్ట్ అయి ఉంటే చాలు రేపటి విజయం మనదే అని జగన్ వర్క్ షాప్ లో పదే పదే చెప్పుకొచ్చారు. కానీ అలా చేయని వారే ఇపుడు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. పార్టీ ఉంటేనే అంతా ఉంటామని కూడా జగన్ నాడు చెప్పారని అంటున్నారు. ముందు పార్టీ ఉండాలి అన్నది జగన్ ఆలోచన అని చెబుతున్నారు. వై నాట్ 175 అన్నది జగన్ నినాదంగా ఉంది.

ఎందుకు మొత్తం సీట్లు వైసీపీ గెలుచుకోకూడదు అన్న పట్టుదలతో జగన్ ముందుకు వెళ్తున్నారు ఈ నేపధ్యంలో ఇబ్బందిగా ఉన్న సీట్లలో మార్పు చేర్పులు తప్పనిసరి అని అంటున్నారు. దాంతోనే జగన్ కఠినంగా ఉంటున్నారు అని అంటున్నారు. ఎవరి విషయంలోనూ ఆయన ఉపేక్షించడం లేదు అని అంటున్నారు తనకు అత్యంత సన్నిహితులు అయిన వారిని కూడా స్పేర్ చేయడం లేదు అని అంటున్నారు.

మొత్తానికి చూస్తే చాలా పార్టీలు మాటల వరకే చెబుతూ ఉంటాయి. పనిచేయని వారికి చోటు లేదని టికెట్ ఇవ్వమని అంటాయి. తీరా ఆచరణకు వచ్చేసరికి ఇచ్చెస్తాయి. కానీ జగన్ ఫస్ట్ టైం అలాంటిది చేసి చూపిస్తున్నారు. ఇది నిజంగా మింగుడు పడని విషయం. అయినా ఈ ప్రయోగం కనుక హిట్ అయితే రేపటి రాజకీయానికి ఇదే రోల్ మోడల్ అవుతుంది అని అంతా అంటున్నారు. జగన్ చేస్తున్న ఈ సరికొత్త ప్రయోగాన్ని అన్ని పార్టీలూ కూడా ఆసక్తిగా చూస్తున్నాయి.

Tags:    

Similar News