సిక్కోలులో అబ్బాయిల రాజకీయ జోరు

ఇక వైసీపీలో చూస్తే ధర్మాన కుటుంబం మీద కీలక బాధ్యతలను అధినేత వైఎస్ జగన్ మోపారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన క్రిష్ణదాస్ నే ఎక్కువగా నమ్మారు.;

Update: 2026-01-17 08:30 GMT

ఉత్తరాంధ్రాలో శ్రీకాకుళం ప్రత్యేకమైనది రాజకీయంగా కీలకమైనది, చైతన్యమైనది కూడా. ప్రజలు విస్పష్టంగా తీర్పు చెబుతారు. ఎక్కువగా ప్రజా సమస్యల మీద పనిచేసే వారి పక్షమే జనాలు ఉంటారు. అంతే కాదు ఎంతో ఆదరించిన వారే తమకు నచ్చకపోతే తీసి పక్కన పెడతారు. అలాంటి శ్రీకాకుళంలో ఎన్నో పార్టీలు వచ్చినా టీడీపీ మాత్రం తన విశిష్టతతో బలంగా మారింది. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని తన వైపు తిప్పుకుని వైసీపీ సైతం పటిష్టంగా ఉంది.

అబ్బాయితో బాబాయ్ :

ఇక శ్రీకాకుళం జిల్లాలో బాబాయ్ మంత్రి అచ్చెన్నాయుడు కింజరాపు కుటుంబంలో పెద్దగా టీడీపీ రాజకీయాలను నడిపిస్తున్నారు. దివంగత ఎర్రన్నాయుడు వారసుడిగా అబ్బాయి రామ్మోహన్ నాయుడు సైతం తండ్రికి తగ్గ తనయుడిగా ఎదుగుతూ కేంద్ర మంత్రి స్థాయికి చేరుకున్నారు. టీడీపీ రాజకీయాల్లో ఈ ఇద్దరూ తన హవా చాటుతున్నారు. దాంతో పాటుగా కింజరాపు కుటుంబం మీద టీడీపీ అధినాయకత్వం పెద్ద బాధ్యతలు ఉంచింది.

వైసీపీలో సీన్ :

ఇక వైసీపీలో చూస్తే ధర్మాన కుటుంబం మీద కీలక బాధ్యతలను అధినేత వైఎస్ జగన్ మోపారు. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి ధర్మాన క్రిష్ణదాస్ నే ఎక్కువగా నమ్మారు. ఆయనే తొలుత కాంగ్రెస్ కి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు, 2014లో ఓడినా 2019లో బంపర్ విక్టరీ కొట్టి ఏకంగా ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ఇక 2014లో ఎన్నికల ముందు వైసీపీలో చేరిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా శ్రీకాకుళం నుంచి మూడు సార్లు వైసీపీ తరఫున పోటీ చేస్తే ఒకసారి గెలిచారు. ఆయనకు కూడా జగన్ రెవిన్యూ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అయితే ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా చూస్తే కొంత తగ్గినట్లుగా కనిపిస్తూ ఉంటారు. అదే సమయంలో ఆయన తన కుమారుడు రాం మనోహర్ నాయుడుని వారసుడిగా చేయాలని చూస్తున్నారు.

పెదనాన్నతోనే :

ఈ నేపధ్యంలో మనోహర్ నాయుడు ఎక్కువగా పెదనాన్న జిల్లా వైసీపీ అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ వెంట తిరుగుతూ కనిపిస్తున్నారు. ప్రసాదరావు జిల్లా కేంద్రం అయిన శ్రీకాకుళం అసెంబ్లీకి ఇంచార్జిగా ఉన్నా ఎక్కువగా అక్కడ జరిగే కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్ష హోదాలో దాసన్న పాల్గొంటూ ఉంటారు. ఇక ప్రసాదరావు రాజకీయ వారసుడు కూడా దాసన్నతో కలసి వైసీపీ కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్నారు. తాజాగా నరసన్నపేటలో నిర్వహించిన భోగీ మంటలలో మెడికల్ కాలేజీలని ప్రవేట్ పరం చేసే పీపీపీ జీవోల దహనం కార్యక్రమంలో ప్రసాదరావుకు బదులుగా రాం మనోహర్ నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైసీపీ ఇంచార్జిలు పాల్గొన్నారు.

ఎంపీనా ఎమ్మెల్యేనా :

ఇక దాసన్న తన తమ్ముడు కుమారిడి రాజకీయ భవిష్యత్తు గురించి కూడా సీరియస్ గానే ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తన కుమారుడికి నరసన్నపేట టికెట్ ని సాధించే విషయంలో సక్సెస్ అయిన దాసన్న శ్రీకాకుళం అసెంబ్లీకి లేదా ఎంపీకి రాం మనోహర్ నాయుడు పోటీ చేసేందుకు అధినాయకత్వం ద్వారా టికెట్ ని సాధిస్తారు అని అంటున్నారు. జగన్ దగ్గర దాసన్నకు ఉన్న చనువు, సాన్నిహిత్యంతో అది సాధ్యపడుతుందనే అంటున్నారు. ఈ క్రమంలో రాజకీయంగా ఏ విధంగా ముందుకు సాగాలి అన్న దాని మీద జిల్లా అధ్యక్షుడిగానే కాకుండా పెదనాన్నగా కూడా దాసన్న తమ్ముడు కుమారుడికి అవసరమైన తీరులో దిశా నిర్దేశం చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి టీడీపీలో బాబాయ్ అబ్బాయ్, వైసీపీలో పెదనాన్న అబ్బాయిల రాజకీయం అయితే ఆకట్టుకుంటోంది అని అంటున్నారు.

Tags:    

Similar News