భారత్ కు వ్యతిరేకంగా ఒక్కటైనా మూడు దేశాలు ?
రక్షణ ఒప్పందాలతో పాకిస్థాన్ వ్యూహాత్మక వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్ - భారత్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో భారత్ ను కట్టడి చేసే వ్యూహంతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందాలు ఉన్నట్టు తెలుస్తోంది.;
రక్షణ ఒప్పందాలతో పాకిస్థాన్ వ్యూహాత్మక వైఖరి అవలంబిస్తోంది. పాకిస్థాన్ - భారత్ మధ్య ఉద్రిక్తత నెలకొన్న సమయంలో భారత్ ను కట్టడి చేసే వ్యూహంతో పాకిస్థాన్ రక్షణ ఒప్పందాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సౌదీఅరేబియాతో పాకిస్థాన్ ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కోసం ముసాయిదా సిద్ధం చేసినట్టు పాకిస్థాన్ డిఫెన్స్ ప్రొడక్షన్ మినిస్టర్ రజా హయత్ హరాజ్ తెలిపారు. ఇది భారత్ కు ఆందోళన కలిగించే అంశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పాకిస్థాన్ భారత్ ను కవ్వించినప్పుడు .. భారత్ ప్రతిదాడి చేసే సమయంలో కట్టడి చేయడానికి రక్షణ ఒప్పందాలు సహకరిస్తాయని అంచనా వేస్తున్నారు. పాకిస్థాన్ లక్ష్యం అంతర్లీనంగా ఇదేనని అంటున్నారు. దీంతో పాకిస్థాన్ వైఖరిపైన భారత్ లో చర్చ మొదలైంది.
రక్షణ ఒప్పందాలు ఎందుకు ?
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య రక్షణ ఒప్పందం ద్వారా.. మూడు దేశాలపై ఎవరు దాడి చేసినా, మూడు దేశాలు తమపై దాడి చేసినట్టుగా మూకుమ్మడిగా స్పందిస్తాయి. అంతర్గతంగా ఆయా దేశాల్లో ఉన్న ఆందోళనలు, ఉద్రికత్తలు, బయటి దేశాల నుంచి ఉన్న ముప్పును, ప్రాంతీయంగా ఉన్న హింసాత్మక వాతావరణాన్ని అంచనా వేసుకుని ఉమ్మడి భద్రతా వ్యవస్థ కోసం పాకిస్థాన్, టర్కీ, సౌదీఅరేబియా ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయి. ఈ ఒప్పందం నాటో లాంటిదే. త్రైపాక్షిక ఒప్పందంలో భాగం కాబోతున్న టర్కీ కూడా నాటో సభ్య దేశమే. కానీ అమెరికా వ్యవహారశైలిలో మార్పు నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా టర్కీ.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో జతకడుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా, పాకిస్థాన్ మధ్య రక్షణ ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందం కంటే త్రైపాక్షిక ఒప్పందం భిన్నమైనదని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందంపై మూడు దేశాలపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా ఏకాభిప్రాయం రాలేదు. ఒప్పందంపై సంతకాలు చేయలేదు.
మూడు దేశాలతో ముప్పేనా ?
సౌదీ అరేబియాతో భారత్ మెరుగైన సంబంధాలు కలిగి ఉంది. అదే సమయంలో టర్కీ మొదటి నుంచి పాకిస్థాన్ కు మద్దతుగా ఉంది. ఇటీవల భారత్ , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ కు టర్కీ డ్రోన్ల సహాయం చేసిందని భారత్ ఆరోపించింది. టర్కీ, పాకిస్థాన్ మధ్య చాలా కాలంగా సైనిక సహాయం కూడా ఉంది. పాకిస్థాన్ కోసం టర్కీ నౌకలను సిద్ధం చేస్తోంది. డ్రోన్ టెక్నాలజీని పాకిస్థాన్ తో పంచుకుంటోంది. ఇలాంటి నేపథ్యంలో టర్కీ, సౌదీ అరేబియా, పాకిస్థాన్ ఉమ్మడి రక్షణ ఒప్పందం భారత్ ను ఆందోళన కలిగించే అంశం. పాకిస్థాన్ రెచ్చగొట్టిన సమయంలో సైనిక చర్య చేపట్టాన్ని ఈ ఒప్పందం కట్టడి చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే సౌదీఅరేబియాకు భారత్ తో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈ ఒప్పందం విషయంలో సౌదీ ఎలా స్పందిస్తుందన్న విషయాన్ని వేచిచూడాలని నిపుణులు చెబుతున్నారు. భారత వ్యతిరేక శక్తులను పెంచిపోషించే పాత్రలో పాకిస్థాన్ ఉన్నప్పటికీ.. సౌదీ అరేబియా, టర్కీ అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న దేశాలు. అయితే ఈ దేశాలు భారత్ కు వ్యతిరేకంగా ఉంటాయా అన్న ప్రశ్న కూడా ఉంది.