యుద్ధం సరే...అమెరికా దివాళా తీస్తోందా ?
ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ తో కలసి అమెరికా మొదలెట్టింది.;
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరే అధ్యక్షుడు తీసుకోని విధంగా డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. మొత్తం ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించే విధంగా అమెరికా నిర్ణయాలు ఉంటున్నాయి. అమెరికన్లు సైతం షాక్ తినేలా ట్రంప్ దూకుడుతో తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా అధిక సుంకాలు పెంచడం నుంచి ఇతర దేశాలతో రిలేషన్స్ నుంచి నచ్చని దేశాల మీద దండయాత్రలు చేయడం నుంచి ఇలా ట్రంప్ పాలన ఆయన శైలిలోనే సాగుతోంది. వెనిజులా అధ్యక్షుడు ఆయన సతీమణిని తీసుకుని వచ్చి అమెరికా కోర్టు ముందు పెట్టడం ట్రంప్ తన విజయంగా భావిస్తున్నారు. అదే సమయంలో ఇరాన్ మీద దశాబ్దాలుగా పెద్దన్ను గుర్రు ఉన్నా ఇంతకు ముందు అధ్యక్షులు ఎవరూ దుస్సాహసానికి అయితే ఒడి కట్టలేదు, కానీ ట్రంప్ మాత్రం ఏకంగా యుద్ధానికి సై అంటూ తనేంటో లోకానికి చెప్పాలని చూశారు.
ఫణంగా పెడుతున్నారా :
అమెరికా ఈ రోజున తీసుకుంటున్న వరస నిర్ణయాలు నాటో దేశాలకే మింగుడు పడలేదని ప్రచారంలో ఉంది. ఆ విషయం పక్కన పెడితే అమెరికా ఒక ఇస్లామిక్ కంట్రీ మీద పడి పెద్ద ఎత్తున యుద్ధానికి తెర తీయడం మీద కూడా అగ్ర రాజ్యంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. అమెరికా ప్రయోజనాలను భవిష్యత్తుని ఫణంగా పెడుతూ ఈ ఇరాన్ తో యుద్ధం సాగుతోంది అని అంటున్నారు. యుద్ధం కోసం అమెరికా చేస్తున్న ఖర్చు కానీ పెడుతున్న ఫోకస్ కానీ అగ్ర రాజ్యాన్ని భవిష్యత్తులో ఏ వైపునకు తీసుకుని వెళ్తాయో అర్ధం కావడం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి.
అమెరికా సొమ్ము ఆవిరి :
ఇక ఈ యుద్ధం అనుకోనిదా లేదా అనివార్యమా అన్నది కూడా అర్ధం కాని పరిస్థితి ఉందని అంటున్నారు. ఈ యుద్ధం వల్ల అమెరికా గెలుపు అన్నది ఏ విధంగా అన్వ్యైంచుకుంటుందో తెలియదు కానీ ఆర్ధికంగా మాత్రం కోలుకోలేని దెబ్బ తినే పరిస్థితి ఉండవచ్చు అన్న చర్చ కూడా సాగుతోంది. భీకరమైన ఈ యుద్ధంలో అమెరికా పెడుతున్న ఖర్చు చూస్తే వామ్మో అనాల్సిందే అంటున్నారు. ఇరాన్ ని నాశనం చేయాలని తపిస్తున్న శ్వేత సౌధం అమెరికా సంగతిని మరచిపోతోందా అన్న డిస్కషన్ కూడా సాగుతోంది. ఈ యుద్ధానికి ఒక్క రోజుకే అమెరికా పెట్టిన ఖర్చు ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు ఉంది అంటే ఆశ్చర్యపోవాల్సిందే. అంతే కాదు అమెరికా రక్షణ బడ్జెట్ ని అమాంతం ట్రంప్ పెంచేశారు అని అంటున్నారు. ఏకంగా కోటి పాతిక లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కి కేటాయించడం అంటే అమెరికన్ ఎకానమీ ఏ విధంగా కోలుకుంటుంది అన్నది కూడా చర్చగా ఉంది.
సంబరాలు సరిపోతాయా :
ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఖమేనీని అంతమొందించామని అమెరికా గర్వంగా చెప్పుకోవచ్చు. 86 ఏళ్ళ ఖమేనీని లేకుండా చేయవచ్చు కానీ ఇరాన్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతాయన్నది అమెరికా ఆలోచించుకోవాలని అంటున్న వారూ ఉన్నారు. యుద్ధ పిపాసతో అమెరికా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడడం లేదా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఈ యుద్ధం వల్ల అమెరికా మీద పెను ఆర్థిక భారం పడుతోంది అని కూడా అంటున్నారు. ఆర్ధికంగా అమెరికా దెబ్బ తింటే ఆ పన్నుల భారం అంతా అక్కడ ప్రజల మీదనే పడుతుంది అని అంటున్నారు. ట్రంప్ కేవలం తన ఆనందం కోసం ఈ యుద్ధానికి తెర తీశారా అన్నది కూడా బిగ్ డిబేట్ గా ఉంది అంటున్నారు.
ఏం సాధించాలని :
ఇరాన్ వద్ద అణు ఆయుధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ తో కలసి అమెరికా మొదలెట్టింది. ఒకవేళ అణు ఆయుధాలు కలిగి ఉంటే అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించడానికి, వాటి వినియోగాన్ని పరిమితం చేయడానికి నిరాయుధీకరణను ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఒప్పందాలు అనేక ఉన్నాయి. వాటి కోసం అంతర్జాతీయ స్థాయిలో సంస్థలు పని చేస్తున్నాయి. ప్రధానంగా ఐఏఈ వంటి సంస్థలు అణు ఆయుధాల భద్రత, నియంత్రణను పర్యవేక్షిస్తాయి. అణుశక్తి శాంతియుత వినియోగాన్ని మాత్రమే ఈ సంస్థలు ప్రోత్సహిస్తాయి. అలా వాటి దృష్టిలో పెట్టి ప్రపంచ శాంతి కోసం అమెరికా చూడవచ్చు.
అమెరికా వద్ద లేవా :
ఆ మాటకు వస్తే అమెరికా అణు ఆయుధాలను కలిగి ఉన్న అతి పెద్ద దేశంగా లేదా అన్న చర్చ ఉంది. అమెరికా వద్ద 5 వేలకు పైగా అణు బాంబులు ఉన్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. మరి అమెరికాకు లేని బాధ ఇరాన్ కి ఎందుకు అన్నది కూడా కీలకమైన ప్రశ్న. కేవలం అమెరికా మాత్రమే కాదు భారతదేశం, రష్యా, చైనా, పాకిస్థాన్, ఫ్రాన్స్,యూకే , ఇజ్రాయెల్, ఉత్తర కొరియా వంటి దేశాలు అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఇరాన్ కనుక అణు సంపత్తిని సమకూర్చుకోవాలని చూస్తే వ్యవస్థల ద్వారా కట్టడి చేయవచ్చు కానీ ఏకంగా యుద్ధానికి తెర లేపడమేంటి అన్నది చర్చ. ఇరాన్ ఆయుధాలు ఉగ్ర వాదుల చేతుల్లోకి వెళ్తాయన్న భయం ఉంటే ఆ దిశగా అమెరికా పెద్దన్న వ్యవస్థల ద్వారానే ప్రయత్నం చేయాలి కదా అని అంటున్నారు.
అసలు టార్గెట్ అదేనా :
ఇక ఇరాన్ దగ్గర అపారమైన చమురు నిల్వలు ఉన్నాయని వాటి కోసమే ఈ యుద్ధం అన్న మాట కూడా ఉంది. అంతే కాదు ఇరాన్ ని తమ చెప్పు చేతలలో ఉంచుకోవాలన్న సామ్రాజ్య వాద కాంక్ష కూడా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అమెరికా చేస్తున్న ఈ దూకుడుతో ఇపుడు ఇరాన్ తో పాటు అమెరికా సైతం తీవ్రంగా నష్టపోతోంది అన్న మాట వినిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ యుద్ధం అతి పెద్ద ముప్పుని తెస్తోంది అని కూడా అంటున్నారు. చూడాలి మరి అమెరికా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో.