జడ్ ప్లస్ భద్రత : జగన్ భయాలు నిజమవుతున్నాయా?
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి భయపడుతున్నట్లే పరిస్థితులు మారుతున్నాయి.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహనరెడ్డి భయపడుతున్నట్లే పరిస్థితులు మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రిగా తనకు సరైన భద్రత ఇవ్వడం లేదని జగన్ ఆరోపిస్తున్నారు. దీనిపై ఆయన న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం జగన్ భయాందోళనలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. తాజాగా జగన్ భద్రతపై హైకోర్టులో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పరిశీలిస్తే జగన్ భద్రత కుదించే అవకాశాలు ఉన్నాయని వైసీపీ శ్రేణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మాజీ సీఎం జగన్ భద్రతపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తనకు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఆయనకు జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారని చెబుతున్నాయి. అయితే తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని మాజీ సీఎం న్యాయపోరాటం చేస్తున్నారు. దీనిపై మంగళవారం వాదనలు వినిపించిన కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ అధికారులు జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రత అవసరం లేదని తేల్చిచెప్పారు. ఆ స్థాయిలో భద్రత కల్పించేందుకు ఆయన ప్రాణాలకు ఏమీ ముప్పులేదని చెప్పారు.
వైసీపీ అధినేత జగన్ సీఎంగా ఉండగా, ఆయనకు కేంద్ర హోంశాఖ జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించేది. అంతేకాకుండా ఆయన సెక్యూరిటీ కోసం రాష్ట్ర పోలీసులు కూడా పెద్ద ఎత్తున మొహరించేవారు. దాదాపు 900 మంది సిబ్బందితో జగన్ సెక్యూరిటీ శత్రు దుర్భేధ్యంగా ఉండేది. అయితే గత ఎన్నికల్లో ఓటమితో జగన్ మాజీ సీఎం అయ్యారు. దీంతో ఆయన సెక్యూరిటీ కోసం రాష్ట్రం నియమించిన 900 మందిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అదే సమయంలో జగన్ భద్రత దృష్ట్యా కేంద్రం జడ్ ప్లస్ సెక్యూరిటీ కొనసాగించింది. అయితే కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉండగా, జగన్ గుంటూరు మిర్చి యార్డులో రైతుల పరామర్శకు పర్యటించారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పర్యటించొద్దని కేంద్రం సూచించింది. కానీ, జగన్ తన పర్యటనను యథావిధిగా నిర్వహించడంతో కేంద్రం ఆయనకు కేటాయించిన సెక్యూరిటీని ఉపసంహరించుకుంది.
దీంతో తనకు జడ్ ప్లస్ కేటగిరీని పునరుద్ధరించాలని అభ్యర్థిస్తూ మాజీ సీఎం కోర్టులో కేసు వేశారు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన కేంద్ర హోంశాఖ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ విభాగాలు జగన్ ప్రాణాలకు ముప్పు లేదని తేల్చిచెప్పాయి. కేంద్ర సంస్థల పిటిషన్లను స్వీకరించిన కోర్టు.. దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ విచారణను జులై 15కు వాయిదా వేసింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగా పేర్కొంటూ ప్రభుత్వం సెక్యూరిటీ కల్పిస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాజీ సీఎంకు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ కల్పిస్తోంది. కానీ, జగన్ తన ప్రాణాలకు ముప్పు ఉందని భావిస్తూ సీఎంగా ఉన్నప్పటి సెక్యూరిటీని ఇప్పుడూ అడుగుతున్నారు. గతంలో తన భద్రత పర్యవేక్షించిన 900 మంది స్థానంలో సగం మందిని అయినా కేటాయించాలంటున్నారు. గతంలో విశాఖ విమానాశ్రయంలో దాడి, ఎన్నికల పర్యటనలో ఉండగా విజయవాడలో రాళ్ల దాడిపై ఆయన ఇప్పటికీ ఆందోళన చెందుతున్నారని చెబుతున్నారు.