శబరిమలలో జైజగన్ నినాదాలు.. అవసరం అంటారా?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై అభిమానంతో వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ పై అభిమానంతో వైసీపీ కార్యకర్తలు ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ అధినేత పట్ల అభిమానం చాటుకుంటున్నామనే ఆలోచనతో సమయం, సందర్భం లేకుండా కొందరు చేస్తున్న పనులపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనకాపల్లి జిల్లాకు చెందిన కొందరు అయ్యప్పభక్తులు శబరిమల సన్నిధానం యాత్రకు వెళ్లగా, పంబ నుంచి కాలినడక మార్గంలో జగన్ పోస్టర్లు ప్రదర్శిస్తూ, జై జగన్ అంటూ నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
శబరిగిరీషుడి మాలధారణలో స్వామి నామ స్మరణలో తరించాల్సిన స్వాములు.. ఇలా రాజకీయ నినాదాలు చేయడమేంటని హిందూ భక్తులు విమర్శిస్తున్నారు. జగన్ బ్యానర్ ప్రదర్శిస్తూ నినాదాలు చేసిన వైసీపీ కార్యకర్తలు, తాము ఏదో గొప్ప పని చేసినట్లు వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధినేతపై అభిమానం ఉంటే ఇంకోలా చాటుకోవాలి కానీ, ఇలా మాలధారణతో దీక్షలో ఉంటూ రాజకీయ నినాదాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా కొందరు వైసీపీ కార్యకర్తలు తిరుమల కొండపై గోవింద నామస్మరణకు బదులుగా జగన్ నినాదాలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
కాగా, శబరిగిరులపై జై జగన్ నినాదాలు చేయడంపై టీడీపీ సోషల్ మీడియా విమర్శిస్తోంది. ఎంతో పవిత్రంగా భావించే శబరిమలలో అయ్యప్ప భజన కాకుండా, జై జగన్ భజన చేయడం ఏంటని టీడీపీ విరుచుకుపడుతోంది. ఇతర రాష్ట్రాల భక్తులు అసహ్యించుకుంటారన్న విషయం వైసీపీ కార్యకర్తలు తెలుసుకోకపోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇలా వ్యవహరించి రాష్ట్రం పరువు తీసేస్తున్నారని విమర్శలు గుప్పిస్తోంది.
మరోవైపు వైసీపీ అధినేతపై అభిమానంతో కార్యకర్తలు శబరిమలలో జగన్ పోస్టర్లను ప్రదర్శించడాన్ని వైసీపీ వెనకేసుకు వస్తుంది. తమ అధినేత యోగక్షేమాలను కోరి కొందరు కార్యకర్తలు సన్నిధానం యాత్రకు వెళ్లారని, మొక్కు చెల్లింపులో భాగంగా పోస్టర్లు ప్రదర్శించడంలో తప్పేముందని అంటున్నారు. గతంలో కూడా చాలా మంది రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ నేతల కోసం మొక్కులు చెల్లించుకున్న సందర్భాలు ఉన్నాయని, కొందరు మోకాళ్లపై తిరుమల కొండ ఎక్కితే, మరికొందరు అంగ ప్రదక్షిణలు చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వారు చేస్తారని, దేవుడి విషయంలో ఏ తప్పూ చేయలేదని అంటున్నారు. మొత్తానికి పాయకరావుపేట అయ్యప్ప భక్తులు చేసిన పని రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.