ఏ2 ఎఫెక్ట్... చంద్రబాబుపై జగన్ ప్రశ్నల వర్షం!

సింగయ్య మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-23 11:54 GMT

సింగయ్య మృతి కేసుకు సంబంధించి గుంటూరు ఎస్పీ ఆదివారం సాయంత్రం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు నిర్ధారణ అయిందన్నారు. అందుకే ఈ కేసులో జగన్ ని ఏ2గా చేర్చినట్లు తెలిపారు. దీనిపై జగన్ తాజాగా స్పందించారు.

అవును... తన పర్యటనలో భాగంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన కేసులో జగన్ ను ఏ2గా చేర్చారన్న విషయం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... చంద్రబాబు ఈరోజు మీరు రాజకీయాలను మరింత దిగజార్చారని చెబుతూ తాను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? అని పలు ప్రశ్నలు సంధించారు!

ఇందులో భాగంగా... 'చంద్రబాబు.. అసలు నా పర్యటనకు మీరు ఎందుకు ఆంక్షలు పెట్టి, ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు? గతంలో మీరు కాని, మీ పవన్‌ కళ్యాణ్‌ కాని తిరుగుతున్నప్పుడు మేం ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టామా?' అని ప్రశ్నించిన జగన్... ప్రతిపక్ష నాయకుడిగా కార్యకర్తల ఇంటికి వెళ్లడం తప్పా? అని అడిగారు.

ఇదే సమయంలో... ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున, ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్లడం తప్పా? అని ప్రశ్నించిన జగన్... ‘ఒక మాజీ ముఖ్యమంత్రిగా, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ భద్రత అన్నది నాకు అయినా, మీకు గతంలో అయినా, భవిష్యత్తులో అయినా, ఆటోమేటిక్‌ హక్కు కాదా?’ అని అడిగారు.

అలా కాకుండా... బుద్ధి పుట్టినప్పుడు భద్రత ఇస్తాం, లేదంటే మూడ్‌ రానప్పుడు మేం మీకు జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీని విత్‌ డ్రా చేసుకుంటామనే అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా? అది మీకైనా, నాకైనా? అని ప్రశ్నించారు.

ఇదే సమయంలో... 'జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు, ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు. అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ ను ఫాలో అయ్యి, ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి. ఇది నాకైనా, మీకైనా ఒకటే' అని తెలిపారు.

'మరి జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే, తన ప్రోగ్రాంకు సంబంధించి రూట్‌ మ్యాప్‌ ఇచ్చిన తర్వాత, పైలట్‌ వెహికల్స్‌, రోప్‌ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్‌ లో భాగమైనప్పుడు.. మీ రోప్‌ పార్టీల, జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్‌ పట్టుకుని, ఎవ్వరూ వాహనంమీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా?' అని జగన్ నిలదీశారు!

'అందుకే కదా జడ్‌ ప్లస్‌ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో, ప్రొటోకాల్‌ లో భాగంగా ఈ రోప్‌ పార్టీని, పైలట్‌ వాహనాలను పెట్టడానికి కారణం' అని చెప్పిన జగన్... 'మరి మీ పైలట్‌ వెహికల్స్‌, అందులో సెక్యూరిటీ, రోప్‌ పార్టీలను జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ, ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు, ఎందుకు లేరు? ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమే అయితే మరి ఎవరైనా వెహికల్‌ కింద ఎలా పడగలుగుతారు?’ అని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో ఏది వాస్తవమో చెప్పాలని జగన్ నిలదీశారు. ఇందులో భాగంగా.. 'మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నది నిజమా.. లేక, లేక వెహికల్‌ కింద ఎవరూ పడలేదన్నది నిజమా?' అని ప్రశ్నిమారు. ఇదే సమయంలో.. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలని అన్నారు.

అదేవిధంగా... ఆ వాహనానికి గవర్నమెంట్‌ డ్రైవరే ఉంటారని.. ఇది ప్రొటోకాల్‌ అని.. మంచి బుల్లెట్ ప్రూఫ్‌ వెహికల్‌ మీరు ప్రొవైడ్‌ చెయ్యకపోతే, గవర్నమెంటు అనుమతితో తానే తన సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనిపెడితే, డ్రైవర్‌ ను మీరు (ప్రభుత్వం) ప్రొటోకాల్‌ ప్రకారం ఇచ్చారని జగన్ తెలిపారు.

అలాంటప్పుడు.. 'మీ గవర్నమెంటు డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్‌, మీరు ఇచ్చిన పైలట్‌ వెహికల్స్, మీ రోప్‌ పార్టీల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతున్నప్పుడు.. మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత మీది కాదా? అందుకే కదా ఈ ప్రొటోకాల్‌" అని అడిగిన జగన్... ప్రమాదం జరిగిన ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్‌ మెంట్‌ ఏమిటి? అని అడిగారు.

అలాంటప్పుడు మళ్లీ ఎందుకు ఈ టాపిక్‌ డైవర్షన్‌ రాజకీయాలు? అని జగన్ ప్రశ్నించారు. ప్రతిపక్షంగా తాను ప్రెస్‌ మీట్‌ పెట్టి, సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలపై మీరు చెప్పిన మాటలు, గతంలో మీరు ఇంటింటికీ పంపించిన బాండ్లను, మీ మేనిఫెస్టో, మీ అబద్ధాలను, మీ మోసాలను బయటపెడితే తట్టుకోలేకపోతున్నారా అని జగన్ అడిగారు!

ఈ సందర్భంగా... 'మీ పాలనా వైఫల్యాలను, రెడ్‌ బుక్‌ రాజ్యాంగం పేరుతో మీరు చేస్తున్న భయంకర పాలన గురించి ఎక్స్‌ పోజ్‌ చేస్తే.. రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, తద్వారా రాష్ట్ర ఖజానాకు మీ వల్ల జరిగిన నష్టాన్ని, అతలాకుతలమవుతున్న రైతులు, అక్క చెల్లెమ్మలు, పిల్లల బ్రతుకులు, వీటన్నింటినీ నేను చెబితే, వాటికి సమాధానం చెప్పలేక.. డైవర్షన్‌ రాజకీయాలు మరింత దిగజారి చేయడం అత్యంత హేయకరమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే.. 'కాస్తైనా సిగ్గు తెచ్చుకుని మారండి' అని సూచించిన జగన్... 'ఒక్కటి మాత్రం నిజం.. నేను సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామానికి చేరి, తిరిగి వచ్చేటప్పుడు దురదృష్టకర ఘటన జరిగిందని మా పార్టీ నాయకులు నాదృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ప్రత్తిపాడు మా పార్టీ ఇన్‌ఛార్జి బాలసాని కిరణ్‌, మాజీ మంత్రి అంబటి రాంబాబు సహా అప్పటికే మా పార్టీ నాయకులు ఆస్పత్రికి చేరుకున్నారని మా వాళ్లు చెప్పారు' అని తెలిపారు.

దీంతో.. 'వెంటనే నేను స్పందించి మరుసటి రోజుకూడా ఆ కుటుంబం దగ్గరకు వెళ్లాలని, కష్టంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.10లక్షల ఆర్థిక సహాయం చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చాను. ఒక మనిషిని కోల్పోయిన కుటుంబం పట్ల చేతనైనంత మేర మా బాధ్యతను మేం నిర్వర్తించాం. అందులోనూ మరణించిన ఆ వ్యక్తి మా మనిషి, మమ్మల్ని అభిమానించే వ్యక్తి అయినప్పుడు ఆ బాధ్యత మరింత రెట్టింపు అవుతుంది' అని అన్నారు.

అదేవిధంగా... 'ఇదే పర్యటనలో గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన మరో అభిమాని విషయంలోనూ ఇదే రీతిలో స్పందించాం. అయినా మా మీద విషప్రచారాలు చేస్తున్నారు. మానవత్వం గురించి, నైతికత గురించి మీరు పాఠాలు చెప్పడమే ఆశ్చర్యం?' అని జగన్ విమర్శించారు!

Tags:    

Similar News