కొనసాగుతున్న రెంటపాళ్ల మంట.. మొత్తం 113 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు

గత నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే.;

Update: 2025-07-07 06:35 GMT

మాజీ సీఎం జగన్ గత నెలలో చేపట్టిన రెంటపాళ్ల పర్యటన మంటలు ఇంకా చల్లారలేదు. ఈ పర్యటనలో జగన్ అనుమతిలేకుండా ర్యాలీ నిర్వహించడంతోపాటు ముగ్గురి మరణానికి కారకులయ్యారన్న కారణంతో ప్రభుత్వం పలు కేసులు నమోదు చేస్తోంది. ఇప్పటికే గుంటూరు శివార్లలోని ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదానికి జగన్ కారు కారణమని గుర్తించిన పోలీసులు.. కారులో ప్రయాణించిన మాజీ సీఎం జగన్ తోపాటు మాజీ మంత్రులు, ఎంపీలపైనా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక అనుమతి లేని ర్యాలీలో పాల్గొన్నారని, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ తాజాగా మరో 113 మందిపై ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. నిందితుల జాబితాలో కీలక నేతల పేర్లు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది.

గత నెల 18న సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు మాజీ సీఎం జగన్మోహనరెడ్డి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే శాంతిభద్రతల దృష్ట్యా మాజీ సీఎం జగన్ కాన్వాయ్ లో ఉండే వాహనాలతోపాటు అదనంగా మరో మూడు వాహనాలకు వంద మంది నేతలు, కార్యకర్తలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. కానీ, మాజీ సీఎం జగన్ తన నివాసం గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి ఆ రోజు ర్యాలీగా బయలు దేరారు. వందలాది కార్లు, వేల మంది కార్యకర్తలను వెంటబెట్టుకుని తాడేపల్లి నుంచి రెంటపాళ్ల వరకు భారీ ర్యాలీ చేశారు.

దీంతో ఆ ర్యాలీకి అనుమతి లేదన్న కారణంగా పోలీసులు తాజాగా 113 మందిపై కేసులు నమోదు చేశారు. రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పలు కేసులు నమోదు చేసిన పోలీసులు రోడ్డు ప్రమాదానికి కారణమన్న అభియోగంతో మాజీ సీఎం జగన్ పైన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న నేరంపై మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గతంలోనే కేసులు నమోదు చేశారు. అయితే తాజాగా జగన్ పర్యటన వీడియోలను పరిశీలించి అనుమతి లేని ర్యాలీలో పాల్గొన్నారని జగన్ తోపాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేశ్ రెడ్డి, నంబూరు శంకరరావుతోపాటు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ పై కేసులు నమోదు చేశారు.

వాహనాలపై డీజే సౌండ్ సిస్టమ్ పెట్టడం, పాఠశాలలు, ఆస్పత్రులకు వెళ్లేవారికి ఇబ్బందులు కలిగించడం, సాధారణ జన జీవనానికి ఆటంకం కల్పించారనే కారణాలతో మొత్తం 113 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో వైసీపీతో తాడోపేడో తేల్చుకోవాలన్నట్లే ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. ఒకేసారి 113 మందిపై కేసులు నమోదు చేయడాన్ని వైసీపీ కూడా సీరియస్ గానే పరిగణిస్తోందని అంటున్నారు. ఈ కేసుల ద్వారా జగన్ పర్యటనలను అడ్డుకోడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కేసులకు భయపడేది లేదని తెగేసి చెబుతున్నారు.

Tags:    

Similar News