వైసీపీ 2.O.. మాస్టర్ ప్లాన్ వేస్తోన్న అధినేత జగన్..
అధికారంలో ఉండగా, పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైన వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యక్రమాలను వెనక్కి పెట్టారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.;
గత ఎన్నికల్లో ఘోర ఓటమిని ఎదుర్కొన్న వైసీపీని బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీ నేతలను అణచివేస్తున్నారని, మళ్లీ తాను అధికారంలోకి వస్తే జగన్ 2.O సినిమా చూపిస్తానని ఇన్నాళ్లు మాటలు చెప్పిన జగన్.. ముందు పార్టీని చక్కదిద్దాలని ఆలోచనకు వచ్చారని అంటున్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని ప్రక్షాళించి రాష్ట్రస్థాయిలో పటిష్టం చేయాల్సివుందన్న అభిప్రాయానికి వచ్చిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
అధికారంలో ఉండగా, పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితమైన వైసీపీ అధినేత జగన్ పార్టీ కార్యక్రమాలను వెనక్కి పెట్టారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా తమకు ప్రాధాన్యం, ప్రాముఖ్యత లేకుండా చేశారని వైసీపీ కార్యకర్తల్లో ఎక్కువ అసంతృప్తి ఉందన్న చర్చ జరగుతోంది. . ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలలో ఆ అసంతృప్తిని తగ్గించి 2019 ఎన్నికలకు ముందు పనిచేసిన విధంగా వచ్చే ఎన్నికలకు వారిని సిద్ధం చేయాలని జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే తగిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనతో కీలక ప్రతిపాదనలను చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు వైసీపీలో హైకమాండ్ ఓ నిర్ణయం తీసుకుని దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించేది. దీనివల్ల క్షేత్రస్థాయి స్థితిగతులతో సంబంధం లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలతోపాటు ఆశించిన ఫలితం రావడం లేదన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఎక్కడి సమస్యలను అక్కడ హైలెట్ చేయడానికి బదులుగా రాష్ట్రవ్యాప్తంగా ఒక ఇష్యూని ఎంపిక చేసి ఆందోళనకు పిలునివ్వడం జరిగేది. దీనివల్ల కార్యకర్తలు ఆశించినట్లు స్పందించడం లేదని అధిష్టానం గుర్తించినట్లు చెబుతున్నారు.
కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా చేయడంతోపాటు పార్టీ యంత్రాంగంతో వారు మమేకమయ్యేలా చేయాలంటే పార్టీలో కార్యకర్తల ప్రాధాన్యం పెరగాలని సూచనలు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఆ సూచనలకు వాస్తవరూపం ఇచ్చే ఉద్దేశంలో ఇకపై గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కమిటీలను నియమించాలని నిర్ణయించారని అంటున్నారు. ఈ కమిటీల్లో పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన సూచనలతో పదవులు కట్టబెట్టే పద్ధతికి స్వస్తి చెప్పి, కార్యకర్తల అభిప్రాయానికి పెద్దపీట వేయాలని నిర్ణయించారంటున్నారు. అంటే ఇకపై వైసీపీలో ఏ పదవికి నియామకం జరగాలన్నా కార్యకర్తల అభిప్రాయం సేకరించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
అదేవిధంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలన్నఉద్దేశంతో గ్రామ, మండల స్థాయిలో చురుగ్గా పనిచేసేవారిని గుర్తించాలని పార్టీ సీనియర్లకు జగన్ సూచించారని చెబుతున్నారు. దీనివల్ల పునాదుల నుంచి పార్టీ నిర్మాణం జరుగుతుందని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. బుధవారం జరిగే రాష్ట్ర పార్టీ సమావేశంలో పీఏసీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో ఈ అంశంపైనే చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతోనూ సమావేశం నిర్వహించి టాలెంట్ హంట్ స్టార్ట్ చేయాలని ఆదేశాలివ్వాలని అధినేత ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.