24/7 లా సర్వీస్.. వైసీపీ అధినేత వ్యూహాత్మక నిర్ణయం

వైసీపీ నేతలు, కార్యకర్తల శ్రేయస్సు కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.;

Update: 2025-08-05 12:15 GMT

వైసీపీ నేతలు, కార్యకర్తల శ్రేయస్సు కోసం ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వరుసగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కేసుల్లో చిక్కుకోవడం, కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో వారికి అండగా నిలవాలని నిర్ణయించారు. కేసులతో జైలుకు వెళ్లిన నాయకులతోపాటు కొత్తగా కేసులను ఎదుర్కొంటున్న వారి కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలో న్యాయవాదులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు జగన్. ఏ సమయంలో ఏ న్యాయ సహాయం కావాలన్నా, పార్టీ కార్యాలయంలో లాయర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు వైసీపీ అధినేత. అర్ధరాత్రి అయినా న్యాయ సహాయం కోసం కార్యకర్తలు సంప్రదిస్తే వెనువెంటనే వారికి అవసరమైన సలహాలు సూచనలిచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలే టార్గెట్ గా అరెస్టుల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన సీఎంవోలోని అధికారులతోపాటు అధినేత జగన్ కు కుడి, ఎడమ భుజాలుగా భావిస్తున్న నేతలు సైతం ప్రస్తుతం అరెస్టు అయ్యారు. ఇక అంతకుముందు సోషల్ మీడియా పోస్టులపై కేసులు నమోదు చేసి వందల మంది కార్యకర్తలను ప్రభుత్వం జైలుకు పంపింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, సినీ నటుడు పోసాని క్రిష్ణమురళి ఇలా చాలా మంది జైలుకు వెళ్లారు.

ఇక మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డి, కొడాలి నాని, రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలా చాలా మంది కేసుల్లో ఇరుక్కున్నారు. వీరిలో ఒక్కొక్కరిని సమయం చూసి అరెస్టు చేయాలన్న వ్యూహంతో ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. అంతేకాకుండా లిక్కర్ స్కాంలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను అరెస్టు చేయొచ్చని అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ కేడర్,లీడర్లకు నిత్యం న్యాయ సహాయం అందజేయాల్సిన అవసరాన్ని అధినేత గుర్తించారు.

ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం కేసులు నమోదుచేస్తూ వేధింపులకు దిగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. మాచర్ల నియోజకవర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిశోర్ ను ఇటీవల ఓ కేసులో విడుదలైన తర్వాత మళ్లీ అరెస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన భార్య హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబట్టింది. ఇదే మాదిరిగా వైసీపీలో చాలా మందిపై ఒకదాని తర్వాత ఒకటిగా కేసులు నమోదు చేయడాన్ని గుర్తు చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి న్యాయ పోరాటం చేసేందుకు మాజీ సీఎం జగన్ నిర్ణయించారని అంటున్నారు.

ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాల వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులతో ప్రత్యేకంగా సమావేశమైన అధినేత జగన్ తన మనసులో భావనను వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేయడంతోపాటు కేంద్ర కార్యాలయంలోనూ ప్రత్యేక డెస్క్ ప్రారంభిస్తున్నట్లు జగన్ వెల్లడించారు. దీంతో ప్రభుత్వంతో సుదీర్ఘ యుద్ధానికి సై అన్నట్లేనని ఆయన సంకేతాలిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News