చంద్రబాబుతో రాహుల్ హాట్ లైన్ చర్చలు.. జగన్ సంచలన ఆరోపణలు
పులివెందుల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన జగన్.. ఈ విషయంలో పోరాటానికి కాంగ్రెస్ సహకారం తీసుకుంటారా?;
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాట్ లైన్ చర్చలు జరుపుతున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రంలో చంద్రబాబు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నా కాంగ్రెస్ తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు జగన్ పరోక్షంగా ఆరోపించారు. దేశంలో ఓటు చోర్ అంటూ ఉద్యమం చేస్తున్న రాహుల్ గాంధీ ఏపీపై మాట్లాడకపోవడానికి చంద్రబాబుతో హాట్ లైన్ చర్చలే కారణమని ఆయన విమర్శించారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో లక్ష ఓట్లు అదనంగా చేర్చారని ఆరోపించడంతోపాటు ఈసీ పనితీరు సరిగా లేదని, ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ పోరాడుతున్నారు. కొద్దిరోజులుగా లోక్‌సభ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పులివెందుల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన జగన్.. ఈ విషయంలో పోరాటానికి కాంగ్రెస్ సహకారం తీసుకుంటారా? అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు. తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో జగన్ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నిక రద్దు కోరతారా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించిన జగన్.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయాయని ఆరోపించారు. ఈ ఎన్నికను కోర్టులో సవాల్ చేస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విధానంపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో 2024 ఎన్నికల నాటికి, ఓట్ల లెక్కింపు నాటికి 12.5 శాతం ఓట్లు పెరిగాయి, అంటే 48 లక్షల ఓట్లు పెరిగాయని గుర్తు చేశారు. ఓట్ చోరీ అంటూ జాతీయస్థాయి ఉద్యమం చేస్తున్న రాహుల్ గాంధీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు, రాహుల్ గాంధీ టచ్ లో ఉన్నట్లు ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణిక్కం ఠాకూర్ కూడా చంద్రబాబును ప్రశ్నించకుండా, తనపై విమర్శలు చేస్తుంటాడని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.