డ్రాయర్ల కంపెనీ - డేటా కంపెనీ... జగన్ పై మంత్రులు ఫైర్!
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన విషయంలో క్రెడిట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.;
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిన విషయంలో క్రెడిట్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా స్పందించిన వైసీపీ అధినేత జగన్... డేటా సెంటర్లకు సంబంధించి గూగుల్ తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు 2023 మే 3న శంకుస్థాపన చేశామని చెప్పారు.
దీనికోసం.. 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి కొనసాగింపులో భాగంగా ఈ రోజు గూగుల్ వచ్చిందని.. వైసీపీ ప్రభుత్వం ఆరోజు వేసిన విత్తనమే ఈ రోజు డేటా సెంటర్ కొనసాగింపని అన్నారు. దీనిపై ఏపీ మంత్రులు, కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు.
జాకీనే వెళ్లగొట్టిన జగన్..!:
వైసీపీ అధినేత జగన్ ప్రమేయంతో రాష్ట్రానికి గూగుల్ వచ్చిందంటే ఆయన కుటుంబ సభ్యులు కూడా నమ్మరని.. రాష్ట్రం నుంచి జాకీనే వెళ్లగొట్టిన జగన్, డేటా సెంటర్ రావడానికి తానే కృషి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉందని పలువురు మంత్రులు, టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా, యువతకు ఉపాధి లభించకుండా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.
గూగుల్ ని అడిగినా చెబుతుంది!:
విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ఎవరు తెచ్చారనే విషయాన్ని నెట్ లో గూగుల్ ని అడిగినా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పేర్లు వస్తాయని చెప్పిన మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి.. జగన్ మాత్రం తానే తెచ్చానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. వినేవాళ్లు ఉంటే విశాఖకు సముద్రం తెచ్చింది కూడా తానే అనే వ్యక్తి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు!
డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చారట!;
ఇదే విషయంపై ‘ఎక్స్’ వేదికగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తాను చేసే నకిలీ మద్యం వ్యవహరంతో తనకు సంబంధం లేదని బుకాయిస్తాడు.. తనకు సంబంధం లేని గూగుల్ అంశంలో తానే క్రెడిట్ దక్కించుకునేలా మాట్లాడుతున్నాడు అని అన్నారు.
ఇదే సమయంలో... డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చారట అని ఎద్దేవా చేసిన సోమిరెడ్డి... 'డేటా సెంటర్ అంటే దానికేం సీన్ లేదు.. అదో గొడౌన్ మాత్రమేనని సాక్షిలో రాయిస్తారు.. మళ్లీ దాన్ని తెచ్చిందీ తానేనంటాడు.. అప్పట్లో కియా తెచ్చింది తన తండ్రేనన్నారు.. ఇప్పుడు గూగుల్ తానే తెచ్చానంటున్నాడు' అని మండిపడ్డారు!
ఇదే క్రమంలో... 'భోగాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్న పెద్ద మనిషి, భోగాపురం ఎయిర్ పోర్టు గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉంది. ఇన్నాళ్లూ సగం పిచ్చొడనుకున్నాం... ఇప్పుడు పూర్తి పిచ్చొడని అర్థమైంది' అని సోమిరెడ్డి ఘాటుగా స్పందించారు!