జగన్ ఉండమంటే.. బొత్స బయటకొచ్చేశారు!
``నేను అసెంబ్లీకి రాను. మనకు శాసన మండలిలో మంచి బలం ఉంది. ప్రభుత్వ దుర్మార్గాలను మండలిలో ఎదుర్కొనండి.;
``నేను అసెంబ్లీకి రాను. మనకు శాసన మండలిలో మంచి బలం ఉంది. ప్రభుత్వ దుర్మార్గాలను మండలిలో ఎదుర్కొనండి. బలంగా మాట్లాడండి. ఏ ఒక్క అంశాన్నీ వదిలి పెట్టకుండా ప్రభుత్వాన్నిఇరుకున పెట్టిండి.`` అని గురువారం ఉదయం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన పార్టీకి చెందిన మండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా మండలిలో ప్రధాన ప్రతిప్రతి పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణకు చెవిలో మరేదో కూడా చెప్పారు. మొత్తంగా.. మండలిలో పైచేయి సాధించాలని జగన్ వ్యూహం.
మరి అలా జరిగిందా?
అయితే.. మండలిలో బొత్స సత్యనారాయణ పదే పదే మాట్లాడినా.. ఆయన మాట్లాడిన దానిలో చాలా వరకు ఎవరికీ అర్ధం కాలేదని.. అధ్యక్ష స్థానంలో ఉన్న మోషేన్ రాజు వ్యాఖ్యానించారు. ``బొత్స గారూ.. మీరు సవరించుకోవాలి. మీరు ఏం చెబుతున్నారో.. సభలో అర్ధం కావడంలేదు`` అని రెండు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఇక, యూరియా కొరత, రైతుల సమస్యలపై బొత్స స్పందించారు. తమ హయాంలో రైతులు ఎక్కడా రోడ్డెక్కలేదని.. వారికి ముందుగానే అన్నీ ఏర్పాట్లు చేశామని.. కానీ, ప్రస్తుత ప్రభుత్వం రైతుల కంట నీరు పెట్టేలా చేస్తోందని విమర్శలు గుప్పించారు.
దీనికి మంత్రి అచ్చెన్నాయుడు దీటుగా సమాధానం చెప్పారు. ఏ ప్రభుత్వంలో రైతులకు మంచి జరిగిందో.. ఏ ప్రభుత్వంలో రైతులు ముఖ్యమంత్రిని తిట్టిపోశారో.. ప్రభుత్వాన్ని దించేశారో.. చర్చించేందుకు తాము రెడీ అని సవాల్ రువ్వారు. దీని సమయం బొత్స సత్యనారాయణ నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు. తాము ఎప్పుడు చర్చించేందుకుఅయినా సిద్ధమేనని మంత్రి చెప్పారు. దీంతో ఆ విషయం అయిపోయింది.
ఇక, మధ్యాహ్నం సెషన్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులు.. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టోకెన్ల పంపిణీ సమయంలో జరిగిన తొక్కిసలాటలను.. బొత్స సత్యనారాయణ ప్రస్తావించారు. అదేసయమంలో సింహాచలంలో చందనోత్సవం నాడు గోడపడి నలుగురు మృతి చెందారని.. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారని .. అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారని.. బాధిత కుటుంబాలను కనీసం ఆదుకోలేదని కూడా వ్యాఖ్యానించారు.
అయితే.. ఈ సమయంలో సభలో పెద్ద రగడ చోటు చేసుకోవడంతో మంత్రి ఆనం సమాధానం చెప్పేలోగానే.. సభలో దండం పెట్టి వాకౌట్ చేస్తున్నట్టు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. దీంతో సభ నుంచి వైసీపీ నాయకులు బయటకు వచ్చేశారు. మొత్తానికి జగన్ ఉండమంటే.. బొత్స వచ్చే శారని.. అధికార పార్టీ సభ్యులు వ్యాఖ్యానించారు.