వైసీపీ నమ్మకం వర్సెస్ కూటమి భరోసా.. !
వైసీపీ అధినేత జగన్ నమ్మకం - కూటమి పార్టీల భరోసా ఈ రెండు విషయాలు చాలా కీలకంగా మారాయి.;
వైసీపీ అధినేత జగన్ నమ్మకం - కూటమి పార్టీల భరోసా ఈ రెండు విషయాలు చాలా కీలకంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు అంశాల ప్రాతిపదికగానే పార్టీలు ముందుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తద్వారా అది తనకు మేలు చేస్తుందని వైసీపీ అధినేత జగన్ పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నారు. తన హయాంలో ఇచ్చిన సంక్షేమ పథకాలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చేసిన మేలు వంటివి ప్రస్తుత ప్రభుత్వం విస్మరించిందని జగన్ ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఏర్పడే వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని ఇదే తనను తన పార్టీని విజయ తీరాలకు చేరుస్తుందని జగన్ నమ్ముతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఆయన తరచుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విశ్లేషణ చేస్తున్నారు. విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వ వ్యతిరేకతను జగన్ భారీ స్థాయిలో నమ్ముతున్నారన్నది స్పష్టం అవుతుంది. ఇదే సమయంలో కూటమి పార్టీలు కూడా తమ అంచనాలు తాము వేసుకుంటున్నాయి.
ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరగకుండా చూసే క్రమంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి ప్రధానంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను బలోపేతం చేసుకునే విషయంపై టిడిపి, జనసేన పార్టీలు బలంగా ప్రయత్నిస్తున్నాయి. తద్వారా వ్యతిరేకతను అధిగమించవచ్చన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వైసీపీ కార్యకర్తలు చీలిపోవడం జగన్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం వంటి కారణాలు వైసిపిని బలంగా దెబ్బతీశాయి.
తమకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకుండా వాలంటీర్లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారన్న వాదన కార్యకర్తల్లో బలంగా ఏర్పడింది. వైసిపి ప్రభుత్వం లోకి రావడానికి కార్యకర్తలు గా తాము ఎంతో కష్టపడ్డామని, కృషి చేశామని కానీ వైసీపీ అధినేత మాత్రం తమను పట్టించుకోలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎన్నికల సమయంలో కలివిడితనం లేకుండా పోయింది. ఇది వైసీపీ ప్రభుత్వానికి గొడ్డలిపెట్టుగా మారింది అన్నది వాస్తవం. ఈ క్రమంలోనే తాజాగా కూటమి పార్టీలు కార్యకర్తలను పదేపదే ఐక్యం చేయడంతో పాటు ప్రాధాన్యం ఇచ్చేందుకు కూడా ముందుకు వస్తున్నాయి.
వారిని, వారి మద్దతును పదే పదే కోరుతున్నాయి. దీనిని బట్టి జగన్ నమ్ముతున్న వ్యతిరేకత ఏ మేరకు ఫలిస్తుంది.. అనేది సందేహంగా మారుతుంది. ఇదే సమయంలో కార్యకర్తల ఐక్యతతో కూటమి పార్టీలు విజయం సాధించుకోవడం నల్లేరుపై నడకే అని మరొక వాదన వినిపిస్తోంది. ఏదేమైనా ఈ రెండు అంశాలు ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య కీలకంగా మారాయి. ఏం జరుగుతుందన్నది చూడాలి.