జ‌నం మాట‌: జ‌గ‌న్‌కు ఇంకా 'క‌సి' తీర‌లేదా ..!

వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.;

Update: 2025-10-13 10:53 GMT

వైసీపీ అధినేత జగన్ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆయనలో పెద్దగా మార్పు అయితే కనిపించడం లేదన్నది విశ్లేషకులు చెబుతున్న మాట. ఇది జనం కూడా అంగీకరిస్తుండడం విశేషం. గత ఎన్నికల్లో ప్రధానంగా వైసిపి ఓడిపోవడానికి మూడు కీలక కారణాలు ఉన్నాయి. ఒకటి అమరావతి రాజధానిని అటక ఎక్కించటం. మూడు రాజధానులను భుజానికి ఎక్కించుకోవడం. రెండోది మద్యం విధానం. ధ‌ర‌ల‌ను విపరీతంగా పెంచడం. అదేవిధంగా నాసిరకం బ్రాండ్లను తీసుకురావడం.

మూడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. భూముల రీసర్వ్ చేయడం ద్వారా ఇచ్చేటటువంటి పత్రాలపై జగన్ బొమ్మలు వేసుకోవడం. ఈ మూడు అంశాలు వైసిపికి మైనస్ గా మారి ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాయి. అయితే ఒక ఓటమి తర్వాత ఏ పార్టీలో అయినా ఏ నాయకుడిలో అయినా మార్పు అనేది రావాల్సి ఉంటుంది. ప్రజలను తన వైపు తిప్పుకునే దిశగా అడుగులు వేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ, ఈ తరహా పరిస్థితి జగన్‌లో ఎక్కడా కనిపించడం లేదు అనేది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇటీవల ఆయన నర్సీపట్నం నియోజకవర్గంలో పర్యటించారు. ఇక్కడ మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని పరిశీలించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో అమరావతిపై ఆయనకు ఉన్న అక్కసు, కసి ఇంకా తీరలేదా అనే విధంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతికి లక్షల కోట్ల రూపాయలు విచ్చేస్తున్న ప్రభుత్వం... 5 వంద‌ల‌ కోట్ల రూపాయలను ఏటా మెడికల్ కాలేజీలకు కేటాయించలేదని జగన్ ప్రశ్నించారు. వాస్తవానికి అమరావతికి అన్ని లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం వెనుక దానిని అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఉద్దేశం.

దీన్ని తప్పు ప‌ట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. కానీ, జగన్ దీన్ని తప్పుపడుతూ ఒక ప్రాంతానికి మాత్రమే లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, అలా కాకుండా మెడికల్ కాలేజీ లను పూర్తి చేసేందుకు 5 వంద‌ల‌ కోట్ల రూపాయలను కేటాయించడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని ఆయన చెబుతున్నారు. దీంట్లో ఆయన చెబుతున్న విషయం బాగానే ఉన్నప్పటికీ అమరావతిపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం అక్కడి రైతులను ప్రజలను కూడా విస్మ‌యానికి గురిచేస్తున్నాయి.

ఇంకా జగన్‌కు అమరావతిపై కసి తీరలేదా? ఇంకా అమరావతి విషయంలో ఆయన విషం కక్కుతూనే ఉన్నారా? అనే వ్యాఖ్యలు ఇటు అధికారపక్షం నుంచి అటు ప్రజల నుంచి కూడా వినిపిస్తున్నాయి. నిజానికి గత ఎన్నికల్లో ఓటమిపాలైంది అమరావతిని కాదనుకునే.. అన్న విషయాన్ని జగన్ గ్రహించలేకపోతున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా తన విధానాలను మార్చుకుని ప్రజల్లోకి వచ్చి అమరావతిపై సానుకూల వ్యాఖ్యలు చేస్తే కొంతలో కొంత మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు చెబుతున్న మాట.

Tags:    

Similar News