జగన్ కు ‘జబర్దస్త్’ ఝలక్.. వీడియో వైరల్!!

సుమారు 4 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో జబర్దస్త్ ఫేమ్ శాంతిస్వరూప్ తన ఆవేదన వ్యక్తం చేశాడు.;

Update: 2026-01-30 07:16 GMT

ఏపీ మంత్రి సుభాష్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేసిన విమర్శలు కాకరేపుతున్నాయి. మంత్రి సుభాష్ ఆడవాళ్లతో కలిసి అశ్లీల నృత్యాలు చేశారంటూ రెండు రోజుల క్రితం జగన్ రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో విచ్చలవిడిగా రికార్డింగు డ్యాన్సులు నిర్వహిస్తున్నారని దుయ్యబట్టారు. అయితే ఈ విమర్శలపై అధికార పార్టీని మించిన రీతిలో జబర్దస్త్ ఫేమ్ శాంతిస్వరూప్ స్పందించాడు. మాజీ సీఎం జగన్మోహనరెడ్డిని ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన శాంతిస్వరూప్ మంత్రి సుభాష్ పై వచ్చిన ఆరోపణలను ఖండించడమే కాకుండా, జనవరి 15న ఏం జరిగిందో వివరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సుమారు 4 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో జబర్దస్త్ ఫేమ్ శాంతిస్వరూప్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. రెండు రోజుల క్రితం భీమవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ, మంత్రి సుభాష్ అశ్లీల నృత్యాలు చేశారంటూ విమర్శలు చేయడాన్ని శాంతిస్వరూప్ తప్పుబట్టాడు. నిజం ఏంటో తెలుసుకోకుండా మాజీ సీఎం అలా మట్లాడటం కరెక్టు కాదని వ్యాఖ్యానించాడు. మాజీ సీఎం జగన్ రెడ్డి అంటే తనకు ఎంతో అభిమానం అంటూనే ఆయన అలా మాట్లాడటం వల్ల తమలాంటి కళాకారులు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన వీడియోలో ముందుగా మంత్రి సుభాష్ ఓ మహిళా కళకారిణితో కలిసి నృత్యం చేయడాన్ని శాంతిస్వరూప్ చూపించాడు. ఈ వీడియోను చూసి మాజీ సీఎం జగన్ రెడ్డి పొరపాటు పడ్డారని వ్యాఖ్యానించారు. ఆ వీడియోలో మంత్రి సుభాష్ తో కలిసి డ్యాన్స్ చేస్తున్నది మహిళ కాదని, ఆ గెటప్ లో ఉన్న వ్యక్తిని తానేనంటూ వెల్లడించాడు. తాను జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేస్తుంటానని, తన కార్యక్రమాలు వైసీపీలో కూడా చాలా చేశామని నిర్వహించారు. అయితే తనతో మంత్రి సుభాష్ డ్యాన్స్ చేయడాన్ని మాజీ సీఎం జగన్ తప్పుపట్టడంపైనే శాంతిస్వరూప్ ఆవేదన వ్యక్తం చేశాడు. వీడియోను చూసి జగన్ రెడ్డి మాట్లాడటం కరెక్టు కాదని, కనీసం అక్కడ ఉన్న వైసీపీ కార్యకర్తలతో మాట్లాడితే అసలు నిజం తెలిసేదని వ్యాఖ్యానించాడు.

నిజానికి మంత్రి సుభాష్ అసభ్యకర డ్యాన్సులు చేయలేదని, జనవరి 15న పండుగ సందర్భంగా కళాకారులుగా తాము బలవంతం చేస్తేనే ఆయన నృత్యం చేయడానికి అంగీకరించారని, ఆ తర్వాత తాను వెళ్లి ఆయనతో కలిసి డ్యాన్స్ చేశానని శాంతిస్వరూప్ వివరించాడు. మాజీ సీఎం జగన్ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడితే బాగుటుందని చురకలు అంటించాడు. పెద్దవారైన జగన్ వంటివారు ఇలా మాట్లాడటం వల్ల తమలాంటి వారు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని శాంతిస్వరూప్ వ్యాఖ్యానించాడు. ఈ వీడియోను టీడీపీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది.

జబర్దస్త్ ఫేం శాంతిస్వరూప్ ఎంట్రీతో మాజీ సీఎం జగన్ రెడ్డి విమర్శలు వైసీపీని ఇబ్బందుల్లోకి నెట్టాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విషయంతో వైసీపీలో సమాచార లోపం, అవగాహన రాహిత్యం ఉన్నాయంటూ విమర్శలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ రెడ్డితో ఒక విషయంపై మాట్లాడించే ముందు పార్టీలో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సివుంటుందని, కానీ పార్టీ కేంద్ర కార్యాలయంలోని నాయకులు తొందరపాటుతో మాజీ సీఎం జగన్ ను తప్పుదోవ పట్టించారని ఆ పార్టీ కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



Tags:    

Similar News