'230 రోజులు జైల్లో ఉంచారు.. చంద్రబాబు ఊళ్లో పుట్టటమే తప్పా?'

మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ తనను జైల్లో పెట్టారన్న చెవిరెడ్డి.. ‘‘ఈసారి 230 రోజులు జైల్లో ఉంచారు. నా పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతనిపై ఇప్పటివరకు పది కేసులు పెట్టారు.;

Update: 2026-01-30 04:16 GMT

వైసీపీ ముఖ్యనేతల్లో ఒకరు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు... వీర విధేయుడిగా పేరున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా తనకు అరెస్టులు.. శిక్షలు తప్పేలా లేవన్న ఆయన.. ‘‘చంద్రబాబు ఊరు నుంచి ఎదిగా. కాబట్టే ఓర్వలేకపోతున్నారు. చంద్రబాబు పుట్టిన ఊళ్లో పుట్టటమే నేను చేసిన తప్పా?’’ అంటూ ప్రశ్నించారు.

2014లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆయన ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లు (2019 వరకు) తనపై 72 కేసులు పెట్టి చిత్తూరు జిల్లాలో ఉన్న అన్ని జైళ్లకు తిప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘చంద్రబాబు నన్ను అక్రమంగా అరెస్టు చేసి కడప, నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించి కొట్టించాడు. ఎమ్మెల్యేగా ఉనన నన్ను కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లి తిరువళ్ళూరు దగ్గర కొట్టారు. చిత్తూరు నుంచి నెల్లూరుకు ఎందుకు తీసుకెళ్లారో తెలీదు’’ అని మండిపడ్డారు.

మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్లీ తనను జైల్లో పెట్టారన్న చెవిరెడ్డి.. ‘‘ఈసారి 230 రోజులు జైల్లో ఉంచారు. నా పెద్ద కొడుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అతనిపై ఇప్పటివరకు పది కేసులు పెట్టారు.

చిన్న కొడుకు విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటే అతడిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామంటున్నారు. ఇదంతా చంద్రబాబు ఊళ్లో మేం పుట్టటమే మేం చేసిన తప్పా?’’ అంటూ ప్రశ్నించారు. తన కుటుంబాన్ని చంద్రబాబు వేధిస్తున్నారన్న చెవిరెడ్డి.. తన తల్లిదండ్రులు బతికి ఉంటే వాళ్లపై కూడా కేసులు పెట్టించేవాడేమో? అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు.

తాను పైరవీలతో రాజకీయాల్లోకి రాలేదని.. పోరాటాలతో రాజకీయాలకు వచ్చిన విషయాన్ని చెవిరెడ్డి గుర్తు చేశారు. తాను వైఎస్ కుటుంబంలో రాజారెడ్డి, వైఎస్, జగన్మోహన్ రెడ్డి లాంటి మూడు తరాల నేతలతో పని చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తనను ఎంతలా వేధించినా.. తనపై ఎంత అసత్య ప్రచారం చేసినా తాను భయపడనని స్పష్టం చేశారు. విజయవాడ జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడారు. తనను అక్రమంగా జైల్లో వేసి 230 రోజులు జైల్లో ఉంచిన వైనాన్ని పదే పదే ప్రస్తావించటం గమనార్హం.

Tags:    

Similar News