పోలీసుల ముందు మీసం తిప్పుతానంటున్న గంజాయి బ్యాచ్... షాకింగ్ వీడియో!
వివరాళ్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా యాడికి మండలంలో మద్యం, గంజాయి సేవించిన ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు.;
ఆంధ్రప్రదేశ్ లో గంజాయి, మాదకద్రవ్యాల వినియోగాన్ని పూర్తిగా నివారించాలని.. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని నిలపాలని ప్రభుత్వం పలు కఠిన, కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే.. ఏపీలో ఎక్కడా గంజాయి పంట పండించకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లాలో "ఎమ్మెల్యే" స్టిక్కర్ ఉన్న కారులో గంజాయి బ్యాచ్ చేసిన హల్ చల్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అవును... ఆంధ్రప్రదేశ్ ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలనే లక్ష్యంతో ఈగల్ వ్యవస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత ఏడాది నవంబర్ లో ఈ విషయాలపై స్పందించిన హోమంత్రి అనిత.. ఈగల్ వ్యవస్థను స్థాపించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయిగా ఏపీని మార్చామని తెలిపిన సంగతీ తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం ఆ స్థాయిలో సీరియస్ గా ఉంది! మరోవైపు టీడీపీ 'ఎమ్మెల్యే' స్టిక్కర్ ఉన్న కారులో ఇద్దరు వ్యక్తులు గంజాయి మత్తులో చేసిన హల్ చల్ సంచలనంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... అనంతపురం జిల్లా యాడికి మండలంలో మద్యం, గంజాయి సేవించిన ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. ఈ సందర్భంగా నిందితులిద్దరినీ గుత్తి టౌన్ కు చెందిన రౌడీషీటర్ అజయ్, ఆదిత్య వర్మగా గుర్తించారు. నిందితులిద్దరూ యాడికి మండలం కోనుప్పలపాడు సమీపంలోని అటవీప్రాంతానికి కారులో వచ్చి.. బుధవారం రాత్రి 8 గంటల వరకూ మద్యం, గంజాయి తాగారని చెబుతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి రోడ్లపై మద్యం తాగుతూ అల్లరి చేశారని అంటున్నారు.
ఈ సమయంలో.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు రంగంలోకి దిగారు. ఈ సమయంలో పోలీసుల పైకి వాహనం నడిపి, తప్పించుకుని యాడికి వైపు వెళ్లిపోయారు. అక్కడ రోడ్డుకు అడ్డంగా వాహనాన్ని నిలబెట్టి, ఇతరులతో గొడవ పడుతూ కనిపించిన పరిస్థితి. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు, స్టేషన్ కు తరలించారు. ఆ సమయంలోనూ వారిద్దరూ పోలీసులపై దౌర్జన్యానికి దిగుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.
అయితే.. వారు ప్రయాణించిన కారుపై 'ఎమ్మెల్యే' స్టిక్కర్ ఉండటంతో.. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించారు. ఈ సందర్భంగా అజయ్ తో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గడువు ముగిసిన 'ఎమ్మెల్యే' స్టిక్కర్ ను కలర్ జిరాక్స్ తీయించుకుని వాడుకుంటున్నారని తెలిపారు! ఈ సందర్భగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది.