తికమక పెడుతున్న వందేభారత్ రైళ్లు
ఇదే రీతిలో అనంతపురం స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లే వందే భారత్ కు సంబంధించి పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో రెండు వందే భారత్ లు వెళతాయి.;
భారత రైల్వే వ్యవస్థకు కొత్త రూపు ఇచ్చి.. రానున్న రోజుల్లో మరిన్ని హైస్పీడ్ రైళ్లకు స్ఫూర్తిని ఇచ్చిన రైలుగా వందేభారత్ ను చెప్పాలి. భారత రైళ్లకు సంబంధించి వందే భారత్ కు ముందు.. తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారుతోంది. మరికొద్దిరోజుల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న వందే బారత్ కు సంబంధించి ఒక అంశం ప్రయాణికులకు తెగ కన్ఫ్యూజ్ చేస్తోంది. ఏ చిన్నపాటి అశ్రద్ధకు గురైనా.. మొదటికే మోసం వచ్చే పరిస్థితి. వందేభారత్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికుల్లో కొన్ని స్టేషన్లలో సిత్రమైన పరిస్థితి ఎదురవుతుంది.
చెన్నై సెంట్రల్.. విజయవాడ కానీ మరికొన్ని ప్రధాన స్టేషన్లలో వందేభారత్ రైళ్లు ఒకే సమయంలో రెండు ఫ్లాట్ ఫాంలకు రావటం.. ఒక ట్రైన్ లో ఎక్కాల్సిన వారు మరో ట్రైన లో ఎక్కేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఉదాహరణకు విజయవాడ స్టేషన్ ను ఉదాహరణగా తీసుకుంటే.. విశాఖపట్నం - సికింద్రాబాద్ రైలు.. సికింద్రాబాద్ - విశాఖపట్నం రైలు ఐదు నిమిషాల తేడాతో విజయవాడ స్టేషన్ లో ఆగుతాయి కొన్నిసార్లు.. ఒకే సమయంలో రెండు ప్లాట్ ఫాంల మీద ఈ రెండు రైళ్లు ఆగుతాయి. దీంతో విశాఖకు వెళ్లాల్సిన ప్రయాణికులు సికింద్రాబాద్ వందేభారత్ లో.. సికింద్రాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు విశాఖ వందేభారత్ లో ఎక్కుతున్న పరిస్థితి.
ఇదే రీతిలో అనంతపురం స్టేషన్ నుంచి బెంగళూరు వెళ్లే వందే భారత్ కు సంబంధించి పది నుంచి పదిహేను నిమిషాల వ్యవధిలో రెండు వందే భారత్ లు వెళతాయి. ఈ రెండు వందే భారత్ లు రెండు వేర్వేరు మార్గాల్లో వెళతాయి. ఒకవేళ ఒక వందేభారత్ ఆలస్యమై.. మరొకటి సరైన సమయానికి చేరుకుంటే.. రెండు బెంగళూరు వెళ్లేవే అయినా.. ఆ మధ్య స్టేషన్ లో దిగాల్సిన వారు మాత్రం పొరపాటున వేరు వందే భారత్ లో ఎక్కే ప్రమాదం ఉంటోంది.
సాధారణంగా ఒక రైలు ఎక్కాల్సింది మరో రైలు ఎక్కేయటం.. ట్రైన్ బయలుదేరుతున్న సమయంలో ఈ విషయాన్ని గుర్తించి హడావుడిగా రైలు దిగటం లాంటివి చూసేవే. వందే భారత్ విషయంలో అలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే.. రైలు బయలుదేరటానికి ముందే డోర్లు క్లోజ్ అయిపోతాయి. ఒకసారి రైలు స్టార్ట్ అయితే చాలా దూరం తర్వాతే స్టాప్ ఉంటుంది.
దీంతో.. పలువురు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కన్ఫ్యూజ్ కాకుండా సదరు వందే భారత్ రైళ్ల టేంటేబుల్ మార్చటం ఒకపరిష్కారం అయితే.. మరొకటి వందేభారత్ ఎక్కే ప్రయాణికులు ఒకటికి రెండుసార్లు తాము ఎక్కాల్సిన ట్రైన్ లోనే ఎక్కుతున్నామా? లేదా? అన్నది కన్ఫర్మ్ చేసుకొని ఎక్కటం చాలా అవసరం. బీకేర్ ఫుల్.