దుమారంగా సాధ్వి ప్రేమ్ బైసా మరణం.. మిస్టరీ ఇదే?
రాజస్థాన్ కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయంగా పెను దుమారానికి కారణమైంది;
రాజస్థాన్ కు చెందిన సాధ్వి ప్రేమ్ బైసా మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. రాజకీయంగా పెను దుమారానికి కారణమైంది. ఆమె మరణం వెనుకున్న మిస్టరీని ఛేదించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. అన్నింటికంటే విచిత్రమైన అంశం.. ఆమె మరణించిన నాలుగు గంటలకు ఆమె ఇన్ స్టా అకౌంట్లో పోస్టు రావటం.. అందులోని అంశాలు ఇప్పుడు కొత్త సందేహాలకు కారణమవుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగింది? ఇంతకూ ఈ సాధ్వి ప్రేమ్ బైసా ఎవరు? ఆమె వెనుకున్న వివాదాలేంటి? లాంటి అంశాల్లోకి వెళితే.
రాజస్థాన్ లోని జోధ్ పూర్ లోని బోరనాడ ఆశ్రమంలో ఉండే సాధ్వి ప్రేమ్ బైసా ఆ రాష్ట్రంలో చాలా పాపులర్. అదే సమయంలో ఆమెపై పలు వివాదాలు ఉన్నాయి. ఆ విషయాల్ని కాసేపు పక్కన పెడితే జనవరి 28న ఆమెను ఆశ్రమం నుంచి ఆమె తండ్రి వీరమ్ నాథ్, మరో సహాయకుడు కలిసి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధ్విని పరీక్షించిన వైద్యులు.. ఆసుపత్రికి రావటానికి ముందే ఆమె మరణించినట్లుగా స్పష్టం చేస్తున్నారు.
ఆమెకు పరీక్షించిన డాక్టర్ ప్రవీణ్ జైన్ చెప్పిన అంశాల్ని చూస్తే.. ‘‘స్వాధిని కాపాడేందుకు పలు విధాలుగా ప్రయత్నించాం. ఆమె శరీరంలో ఎలాంటి చలనం లేదు. సాధ్వికి జ్వరం రావటంతో ఆశ్రమానికి ఒక కాంపౌండర్ ను పిలిపించినట్లుగా ఆమె తండ్రి చెప్పారు. ఆ కాంపౌండర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత సాధ్వి స్ప్రహ కోల్పోయారు. దీంతో మా దగ్గరకు తీసుకొచ్చారు. ఆమె ఆసుపత్రికి వచ్చేసరికే చలనం లేదు’’ అనిపేర్కొన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సాధ్వీని పోస్ట్ మార్టం నిమిత్తం ఆమె డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు వైద్యులు ప్రయత్నిస్తుంటే.. అందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె తండ్రి తన ప్రైవేటు కారులో తీసుకెళ్లినట్లుగా వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే సాధ్వి చాలా కాలంగా జలుబు.. దగ్గుతో బాధ పడుతుందని ఆమె తండ్రి వీరమ్ నాథ్ చెప్పినట్లుగా వైద్యులు చెబుతున్నారు.
ఈ ఉదంతంపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చిన కాంపౌండర్ ను పిలిపించి.. విచారించారు. అతన్ని అదపులోకి తీసుకోవటంతో పాటు.. అతడి వైద్య పరికరాల్ని సీజ్ చేశారు. పేరు ప్రఖ్యాతులున్న సాధ్వికీ రోజుల తరబడి ఆరోగ్యం బాగోపోతే.. మంచి వైద్యుల చేత వైద్యసేవలు అందించాలే తప్పించి.. ఒక కాంపౌండర్ తో ఇంజెక్షన్ ఇప్పించటం ఏమిటి? అన్నది ప్రధాన ప్రశ్న. ఇదిలా ఉండగా.. ఆమె మరణించిన నాలుగు గంటల తర్వాత ఆమె ఇన్ స్టా అకౌంట్ లో ఒక పోస్టు నమోదైంది.
ఈ పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది. ఆమె మరణిస్తే.. ఆమె ఖాతాలో పోస్టు రావటం ఏమిటి? దాన్ని ఎవరూ ఆపరేట్ చేస్తారు? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకూ ఆ పోస్టులో ఏముందంటే.. ‘‘నేను ప్రతి క్షణం సనాతన ధర్మ ప్రచారం కోసం జీవించాను.నా జీవితాంతం జగద్గురు శంకరాచార్యులు..యోగా గురువులు.. సాధు సంతుల ఆశీస్సులు అందుకున్నాను. అగ్నిపరీక్ష కోరుతూ వారికి లేఖలు రాశాను.కానీ.. ప్రక్రతి ఏం తలపెట్టిందో నేను ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్తున్నాను. నా జీవితకాలంలోకాకున్నా.. నా మరణం తర్వాతైనా నాకు కచ్ఛితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా’’ అంటూ పెట్టిన పోస్టు ఇప్పుడు సంచలనంగా మారింది.
ఈ పోస్టు పెట్టింది ఎవరు? ఆమె కోరుకున్న న్యాయం ఏమిటి? అన్నదిప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టు ఆమె మొబైల్ నుంచే షేర్ అయినట్లుగా ఆమె తండ్రి సైతం ధ్రువీకరించటం గమనార్హం. ఇదిలా ఉండగా గత ఏడాది ఆమె రెండు వివాదాల్లో ఇరుక్కున్నారు. అందులో ఒకటి... ఆమె ఒక గదిలో తన తండ్రిని హత్తుకొని ఉన్న వీడియో వైరల్ అయ్యింది ఆ సమయంలో ఒక మహిళ గదిలోకి వచ్చి దుప్పటి తీసి వెళ్లటం ఆ వీడియోలో కనిపించింది. అది తండ్రీకూతుళ్ల మధ్య అనురాగానికి నిదర్శనంగా పేర్కొంటూ.. ఆ బంధాన్ని కించపరిచేలా వీడియోను ఎడిట్ చేసి వైరల్ చేసినట్లుగా సాధ్వి అప్పట్లో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదంతానికి సంబంధించిన అరెస్టు జరిగాయి.
మరో ఉదంతంలో అథ్యాత్మిక వేత్త వీరంపురి మహారాజ్ అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉన్నట్లుగా వీడియో వైరల్ అయ్యింది. అయితే.. ఆ వీడియో పాతదని.. తనను అపఖ్యాతి పాలు చేసేందుకు ఇలా తప్పుడు ప్రచారానికి దిగినట్లుగా ఆమె మండిపడ్డారు. ఈ వీడియోు బయటకు రాకుండా ఉండేందుకు రూ.20 లక్షలు డిమాండ్ చేస్తూ తనను బ్లాక్ మొయిల్ చేశారని ఆరోపించారు. తాను డబ్బులు ఇచ్చేందుకు అంగీకరించకపోవటంతో ఇలా బయటపెట్టినట్లుగా ఆమె ఆరోపించారు. తాజాగా ఆమె మరణం సైతం పలు సందేహలకు దారి తీసింది. పోస్టుమార్టం రిపోర్టు బయటకు వస్తే కొంత స్పష్టత వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.