గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్... ఆ మూడు రాష్ట్రాల్లో ఏమి జరుగుతుంది!
అవును... తమిళనాడు, కేరళ, తాజాగా కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;
గత కొంతకాలంగా బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో.. గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అనే ఘటనలు తెరపైకి వస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో తెలంగాణలో బీఆరెస్స్ ప్రభుత్వంలో ఈ సమస్య కనిపించినా.. తర్వాత కాస్త సద్దుమణిగింది! అయితే మరో మూడు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఇది రోజు రోజుకీ తీవ్రమవుతుందనే చర్చ మదలైంది. దీంతో.. ఈ వ్యవహారం రకరకాల అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. "రబ్బర్ స్టాంప్" అనే టాపిక్ మరోసారి చర్చనీయాంశంగా మారిందని చెబుతున్నారు.
అవును... తమిళనాడు, కేరళ, తాజాగా కర్ణాటక రాష్ట్రాల్లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళనాడులో గవర్నర్ ఆర్.ఎన్. రవి - సీఎం స్టాలిన్.. కేరళలో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ - సిఎం పినరయి విజయన్.. తాజాగా కర్ణాటకలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ - సీఎం సిద్ధరామయ్య వ్యవహారాలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా రాజ్యాంగ సంక్షోభం టాపిక్ తెరపైకి వచ్చింది.
తమిళనాడు గవర్నర్ వాకౌట్!:
ఇటీవల తమిళనాడులో ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి గవర్నర్ ఆర్.ఎన్. రవి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ప్లే చేయకుండా అవమాన పరిచారని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే అదే అసలు కారణం కాదని.. ప్రసంగంలోని కొన్ని పేరాలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటంతో.. వాటిని చదవడం ఇష్టం లేక వెళ్లిపోయారనే ప్రచారమూ జరిగింది. సంప్రదాయం ప్రకారమే రాష్ట్ర గీతాన్ని తొలుత ప్లే చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరో అడుగు ముందుకేసిన కేరళ గవర్నర్!:
ఈ సమయంలో.. కేరళ విషయానికొస్తే ఇది మరింత హీటెక్కించే విషయంగా మారింది. ఇందులో భాగంగా.. ప్రసంగంలోని కొన్ని పారాగ్రాఫ్ లను తనకు నచ్చినట్లు మార్చేశారు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్. దీంతో.. అనూహ్య నిర్ణయం తిసుకున్న సీఎం పినరయి విజయన్.. క్యాబినెట్ అమోదించిన ప్రసంగాన్ని అసెంబ్లీ రికార్డ్ చేసేందుకు.. ప్రసంగ ప్రతులను స్వయంగా ఆయనే చదివి వినిపించారు. ఈ వ్యవహారం తాజాగా మరింత వేడెక్కిన పరిస్థితి.
ఎందుకంటే... తన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఫుటేజ్, తన ప్రకటన, సీఎం ప్రకటన ఆమోదానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ని షేర్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ ను గవర్నర్ లేఖలో కోరారు. అయితే... స్పీకర్ కార్యాలయం నుంచి ఎలాంటి రిప్లై రాలేదని తెలుస్తోంది. దీంతో.. ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటక గవర్నరూ తగ్గలేదు!:
తమిళనాడు, కేరళ గవర్నర్లకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య పరిస్థితి ఆ విధంగా ఉండగా.. కర్ణాటకలోనూ సేం సీన్ రిపీట్ అయ్యింది! ఇందులో భాగంగా... గతవారం జరిగిన అసెంబ్లీ జాయింట్ సెషన్ లో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, సమావేశం నుంచి వెళ్లిపోయారు. తన ప్రసంగంలోని 11 పారాగ్రాఫ్ లను తీసేయాలంటూ తాను చేసిన డిమాండ్ ను కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వ పట్టించుకోకపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు!
అసలు ఏమిటీ సమస్య..?:
రాష్ట్ర ఏదైనా, గవర్నర్ పేరు ఇంకేమైనా... మూడు రాష్ట్రాల్లోని ఈ తరహా పరిస్థితికి కారణం.. తమ తమ ప్రసంగాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడమే అని అంటున్నారు. ఇందుకు తాజా ప్రధాన అంశం... మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎం.ఎన్.ఆర్.ఈ.జీ.ఏ) స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజేవికా మిషన్ (రూరల్) (వీబీ - జీ రామ్ జీ) తీసుకురావడమే అని చెబుతున్నారు.
ఈ అంశంపైనే తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వమైనా, కేరళలోని ఎల్.డీ.ఎఫ్. ప్రభుత్వమైనా, కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ అయినా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని చెబుతున్నారు. అయితే ఈ అభ్యంతరాలు, వ్యతిరేకత కేవలం ప్రాథమిక నిర్మాణంలో మార్పుల పైనే కాదని.. ఈ మార్పుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాలపై అదనంగా ఆర్థిక భారం పడుతుందని చెబుతున్నారు. ఈ విషయంలోనే ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని అంటున్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1) రాష్ట్రాల వెర్షన్!:
ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ నిపుణులు స్పందిస్తున్నారు. ఈ సందర్భంగా.. ప్రసంగంలోని భాషను మార్చమని సూచించే హక్కు గవర్నర్ కు ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ప్రభుత్వం రెండు పారాగ్రాఫ్ లను సవరించిందని అంటున్నారు. అయితే.. ఒక పర్టిక్యులర్ విషయానికి సంబంధించిన మొత్తం పారాగ్రాఫ్ లనే తొలగించాలనే గవర్నర్ ల డిమాండ్ లను మాత్రం మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరించాయని చెబుతున్నారు!
ఈ నేపథ్యంలోనే... రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 (1)ను రాష్ట్రాలు ఉదహరిస్తున్నాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా.. ఒకవేళ గవర్నర్ సూచనలతో ప్రభుత్వం ఏకీభవించకపోతే.. గవర్నర్ కు మరో దారి ఉండదని.. ఆయన తప్పనిసరిగా ప్రసంగాన్ని చదవాల్సిందేనని.. మరో పరిష్కారం లేదని అంటున్నారు! మరోవైపు.. గవర్నర్ పదవి రాజకీయం కావడం చాలా కాలం క్రితమే మొదలైందని పలువురు అభిప్రాయపడుతున్నారు!