త‌మిళ‌నాడులో విజ‌య్ కీల‌క పాత్ర‌.. ఇండియాటుడే-సీఓట‌ర్ స‌ర్వేలో వెల్ల‌డి

త‌మిళ‌నాడులో మ‌రో మూడు నెలల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ తొలిసారి ఎన్నిక‌ల్లో చేయ‌బోతున్నారు.;

Update: 2026-01-30 07:17 GMT

త‌మిళ‌నాడులో మ‌రో మూడు నెలల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. త‌మిళ సూప‌ర్ స్టార్ విజ‌య్ తొలిసారి ఎన్నిక‌ల్లో చేయ‌బోతున్నారు. విజ‌య్ త‌మిళ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌బోతున్నార‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యువ‌త‌లో విజ‌య్ ప‌ట్ల ఆకర్ష‌ణ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో త‌మిళ రాజ‌కీయాలు ఎలాంటి మ‌లుపు తిర‌గ‌బోతున్నాయ‌న్న చ‌ర్చ సంద‌ర్భంలో ఇండియా టుడే- సీఓట‌ర్ స‌ర్వే కీల‌క అంశాల‌ను వెల్ల‌డించింది.

విజ‌య్ కీల‌కం

ఇండియా టుడ్ -సీఓట‌ర్ 2026 స‌ర్వేలో విజ‌య్ పార్టీ టీవీకే దాదాపు 15 శాతం ఓటు బ్యాంకును సాధించ‌బోతున్న‌ట్టు వెల్ల‌డైంది. డిఎంకే కూట‌మి దాదాపు 45 శాతం ఓటు బ్యాంకును సాధించ‌నుంది. అదే విధంగా ఏఐఏడీఎంకే కూట‌మి 33 శాతం ఓటు బ్యాంకును సాధించ‌నుంది. మిగిలిన పార్టీలు 7 శాతం ఓటు బ్యాంకును సాధించ‌నున్నాయి. విజ‌య్ అధికారంలోకి వ‌స్తామ‌ని మాట్లాడుతున్న సంద‌ర్భంలో స‌ర్వే ఫ‌లితాలు నిరాశ‌ప‌రిచే విధంగా ఉన్న‌ప్ప‌టికీ.. విజ‌య్ ప్ర‌భావాన్ని మాత్రం తీసిపారేయ‌లేమ‌ని తేల్చాయి. 15 శాతం ఓటు బ్యాంకు చిన్న విష‌యం కాద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొద‌టి సారి పోటీ చేస్తున్న పార్టీకి 15 శాతం రావ‌డం అంటే.. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించ‌బోతున్నార‌ని అర్థం అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. డీఎంకే బ‌ల‌మైన ఆధిప‌త్యం క‌న‌బ‌రుస్తున్న నేప‌థ్యంలో విజ‌య్ పార్టీ 15 శాతం ఓటు బ్యాంకును సాధించ‌డం గొప్ప విష‌యం. ముఖ్యంగా యువ‌త‌, ప‌ట్ట‌ణ ప్రాంత ఓట‌ర్లు విజ‌య్ పార్టీ ప‌ట్ల ఆస‌క్తి చూపుతున్నారు. రాజ‌కీయాల్లో మార్పు కోరే వారు టీవీకే వైపు మొగ్గుచూపారు.

ఎన్నిక‌ల త‌ర్వాత విజయ్ కీ రోల్..

స‌ర్వేలో వ‌చ్చిన‌ట్టు 15 శాతం ఓటు బ్యాంకుతో గ‌ణ‌నీయ‌మైన సీట్లు విజ‌య్ సాధిస్తే.. ఎన్నిక‌ల త‌ర్వాత ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంటుంది. డీఎంకేకు, అన్నా డీఎంకేకు మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే త‌క్కువ సీట్లు వ‌స్తే అప్పుడు విజ‌య్ కీ రోల్ ప్లే చేస్తారు. విజ‌య్ మ‌ద్ద‌తుతో ప్ర‌భుత్వం ఏర్పాట‌వుతుంది. డీఎంకే క‌నుక పూర్తీ స్థాయి మెజార్టీ సాధిస్తే... విజ‌య్ ప్ర‌తిప‌క్ష పార్టీగా కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ద‌క్కుతుంది. ఆ త‌ర్వాత జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో బ‌లం పుంజుకోవ‌డానికి అవ‌కాశం ద‌క్కుతుంది.

ఓట్లే కాదు.. సీట్లూ రావాలి

త‌మిళ రాజ‌కీయాల్లో విజ‌య్ రాబోయే రోజుల్లో క్రియాశీల‌క పాత్ర పోషించ‌బోతున్నారు. ఇండియా టుడే- సీఓట‌ర్ స‌ర్వే ప్ర‌కారం 15 శాతం ఓట్లు వ‌చ్చి.. సీట్లు రాక‌పోతే క‌ష్టం. అలా కూడా జ‌ర‌గ‌డానికి అవ‌కాశం ఉంది. ఎందుకంటే స‌ర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించి ఉంటారు. మ‌న ఎన్నిక‌ల వ్య‌వ‌స్థ‌లో రాష్ట్రం యూనిట్ గా తీసుకుని, వ‌చ్చే ఓటు శాతాన్ని బ‌ట్టి సీట్ల పంప‌కం ఉండ‌దు. నియోజ‌క‌వ‌ర్గం యూనిట్ గా .. మొత్తం అభ్య‌ర్థుల్లో ఒక్క ఓటు ఎక్కువ వ‌చ్చిన వారే విజేత‌లు. ఇలాంటి నేప‌థ్యంలో విజయ్ పార్టీ ఓట్ల శాతంతో పాటు, మెజార్టీ సీట్ల‌లో గెల‌వాలి. అప్పుడే త‌మిళ రాజ‌కీయాల్లో క్రియాశీల‌క పాత్ర పోషిస్తారు. లేదంటే విజ‌య్ పాత్ర ప‌రిమితం అవుతుంది.

Tags:    

Similar News