క్రీస్తు విగ్రహంపై ఇజ్రాయెల్ సైనికుడి దాడి.. తీవ్రంగా ఖండించిన ప్రపంచం..!

ఇజ్రాయెల్‌లో యూదుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా జెరూసలేం వంటి చోట్ల క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై కొందరు తీవ్రవాద యూదులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి.;

Update: 2026-04-20 05:51 GMT

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇప్పటికే ఉద్రిక్తతలు తారా స్థాయిలో ఉన్న తరుణంలో, ఇజ్రాయెల్ సైనికుడు ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేయడం ‘అగ్నికి ఆజ్యం పోసినట్లు’గా మారింది. మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలు యుద్ధాన్ని మరో ప్రమాదకరమైన మలుపు తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన చెందుతున్నారు.

ఇజ్రాయెల్ జవాను చర్యపై ప్రపంచవ్యాప్త నిరసన..

యుద్ధ క్షేత్రంలో సైనికులు కేవలం ప్రాణాలకే కాదు.., అక్కడి సంస్కృతి, మతపరమైన కట్టడాలు, నిర్మాణాలను కూడా రక్షణగా ఉండాలి. కానీ, దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కు చెందిన ఒక సైనికుడు ఏసుక్రీస్తు విగ్రహాన్ని సుత్తితో పగలగొడుతున్న దృశ్యాలు అంతర్జాతీయంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రాథమికంగా యూదుల దేశం కావడం, లెబనాన్‌లో క్రైస్తవ జనాభా గణనీయంగా ఉండడంతో ఈ ఘటన మతపరమైన ఘర్షణలకు దారితీస్తుందేమోనన్న భయం నెలకుంది.

వైరల్ ఫోటోతో ఐడీఎఫ్ స్పందన

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ ఫోటోలో, ఒక సైనికుడు పూర్తి సైనిక దుస్తుల్లో ఉండి, చర్చి లేదంటే ప్రార్థనా స్థలానికి వెలుపల ఉన్న ఏసుక్రీస్తు విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొదట ఇది ఫేక్ న్యూస్ కావచ్చని భావించినప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం అధికారికంగా స్పందిస్తూ.. ఆ ఫోటోలో ఉన్నది తమ సైనికుడేనని ధ్రువీకరించింది. సైనికుడి ప్రవర్తన తమ నైతిక విలువలకి విరుద్ధమని, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఐడీఎఫ్ ప్రకటించింది. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

మతపరమైన సెంటిమెంట్

క్రైస్తవ మతానికి కేంద్రమైన వాటికన్ నుంచి మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంస్థలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. యుద్ధంలో ప్రత్యర్థి సైన్యాన్ని ఎదుర్కోవాలి కానీ, పౌర చిహ్నాలను, దైవ విగ్రహాలను ధ్వంసం చేయడం యుద్ధ నేరం కిందకు వస్తుందని మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్న పాశ్చాత్య దేశాల్లో మెజారిటీ ప్రజలు క్రైస్తవులు. ఇలాంటి ఘటనల వల్ల ఆయా దేశాల్లో ఇజ్రాయెల్ పట్ల ఉన్న సానుకూలత తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమెరికాలోని క్రైస్తవ మితవాద గ్రూపులు ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి.

లెబనాన్ సామాజిక సమీకరణాలు

లెబనాన్ ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఉండే దేశం. దక్షిణ లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ, అక్కడ పురాతనమైన చర్చిలు, క్రైస్తవ గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఇజ్రాయెల్ కావాలనే ఇలాంటి చర్యల ద్వారా లెబనాన్‌లోని మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందని అక్కడి స్థానిక నాయకులు ఆరోపిస్తున్నారు. చర్చిలు, విగ్రహాలు సామాన్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చే కేంద్రాలు. వాటిపై దాడులు చేయడం వల్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

యూదు వర్సెస్ క్రైస్తవ వివాదమా?

ఇజ్రాయెల్‌లో యూదుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. గతంలో కూడా జెరూసలేం వంటి చోట్ల క్రైస్తవ ప్రార్థనా స్థలాలపై కొందరు తీవ్రవాద యూదులు దాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఒక సైనికుడు నేరుగా యుద్ధ భూమిలో ఇలాంటి పని చేయడం, ఇజ్రాయెల్ సైన్యంలోని మతపరమైన తీవ్రవాదాన్ని ఎత్తిచూపుతోందని విమర్శలు వస్తున్నాయి.

యుద్ధం అనేది కేవలం భూభాగాల కోసం జరిగేది మాత్రమే కాదు, అది విలువల కోసం కూడా జరగాలి. ఒక విగ్రహాన్ని ధ్వంసం చేయడం వల్ల ఇజ్రాయెల్‌కు యుద్ధంలో వచ్చే లాభం ఏమీ లేదు, కానీ ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసినట్లు అవుతుంది. ఐడీఎఫ్ చేపట్టిన విచారణలో నిందితుడికి కఠిన శిక్ష పడితే తప్ప, ఇజ్రాయెల్ తన ప్రతిష్టను కాపాడుకోవడం కష్టం. ఆయుధాలతో యుద్ధం గెలవచ్చు కానీ, ద్వేషంతో మనసులు గెలవలేరు అనే సత్యాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Tags:    

Similar News