మిస్సైళ్ల వర్షం... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకరమైన యుద్ధం!
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది.;
పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ భీకరస్థాయిలో విరుచుకుపడగా.. ఇరాన్ సైతం ఏమాత్రం తగ్గకుండా ప్రతిదాడులు చేసింది. ఈ సందర్భంగా ఇరాన్ లో భారీ ప్రాణ నష్టంతో పాటు పలు నష్టాలు జరగ్గా.. ఇజ్రాయెల్ లోనూ ఆస్తులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ కు అమెరికా సహకారం కీలకంగా మారింది.
అవును.. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం మొదలైంది. ఇందులో భాగంగా.. తొలుత ఇరాన్ అణు స్థావరాలు, సైనిక శిబిరాలు, సైనిక ఉన్నతాధికారుల లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించింది. ఈ సమయంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం వరకూ అవిరామంగా వందల సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. ఈ దాడుల్లో ఇరాన్ కు భారీ నష్టమే జరిగింది.
ఇందులో భాగంగా... ఇరాన్ తన మిలటరీ కీలక నాయకత్వాన్ని, న్యూక్లియర్ శాస్త్రవేత్తలను కోల్పోయింది. ఇదే సమయంలో.. ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందగా, 329 మంది గాయపడ్డారు. ఇదే సమయంలో ఇరాన్ లోని అణు కేంద్రాల్లోని కీలక మౌలిక వసతులు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. దీన్ని.. ఇరాన్ గుండెపై కొట్టడంగా ఇజ్రాయెల్ అభివర్ణించింది.
మరోవైపు... తాము రెండు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే.. దీన్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. ఇదే క్రమంలో.. శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో క్షిపణులను టెల్ అవీవ్ పైకి ప్రయోగించింది. దీంతో.. పదుల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడగా, పలు భవంతులు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఇజ్రాయెల్ కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన ఇజ్రాయెల్ ప్రధానమంతి బెంజమెన్ నెతన్యాహు... ఇరాన్ అణు లక్ష్యాలను దెబ్బతీసేందుకు "ఆపరేషన్ రైజింగ్ లయన్" ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఆ దేశ అణు కార్యక్రమానికి గుండె లాంటి ప్రాంతాన్ని ధ్వంసం చేశామని అన్నారు. దేవుడి దయతో మరిన్ని విజయాలు సాధించబోతున్నామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఇజ్రాయెల్ మనుగడను సవాల్ చేసే ఇరాన్ ముప్పును తిప్పికొట్టేందుకు చేపట్టిన సైనిక చర్య "ఆపరేషన్ రైజింగ్ లయన్" తమ సైన్యం ప్రారంభించిందని నెతన్యాహు అన్నారు. ఇజ్రాయెల్ ను నాశనం చేస్తామంటూ టెహ్రాన్ బహిరంగంగానే సవాల్ చేస్తోందని.. ఈ ముప్పును పూర్తిగా తొలగించేవరకూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.