'ఖమేనీ ఈ భూమిపై ఉండటానికి అర్హుడు కాదు'.. మరో సంచలనం!

ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలోని బీర్‌ షెబాలో ఓ ఆసుపత్రిని ఇరాన్‌ క్షిపణి తాకింది. దీంతో.. సుమారు 200 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో... టెల్‌ అవీవ్‌ లోని నివాస భవనాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేసాయి.;

Update: 2025-06-20 03:11 GMT

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఈ భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో.. ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తుంటే.. ఇజ్రాయెల్ లోని జనవాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నట్లుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాటితో తమ లక్ష్యాన్ని పునరుద్ఘాటించింది.

అవును... ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలోని బీర్‌ షెబాలో ఓ ఆసుపత్రిని ఇరాన్‌ క్షిపణి తాకింది. దీంతో.. సుమారు 200 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో... టెల్‌ అవీవ్‌ లోని నివాస భవనాలపై ఇరాన్ క్షిపణులు దాడి చేసాయి. దీంతో.. ఇక్కడ 40 మంది వరకూ గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఇజ్రాయెల్‌ ఆగ్రహంతో ఊగిపోయింది. ఈ సందర్భంగా ఆ దేశ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని అంతమొందిస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. ఆయన ఈ భూమ్మీద ఉండటానికి అర్హుడు కాదని పేర్కొంది. ఖమేనీని లక్ష్యంగా చేసుకుంటామని ఆ దేశ రక్షణ మంత్రి కట్జ్‌ హెచ్చరించారు. ఇదే సమయంలో.. ప్రధాని నెతన్యాహు స్పందిస్తూ.. టెహ్రాన్‌ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఖమేనీని అంతమొదిస్తే యుద్ధం ముగిసినట్లేనని ప్రకటించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఇరాన్ లోని అణుస్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందులో భాగంగా... టెహ్రాన్‌ కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరాక్‌ హెవీ వాటర్ రియాక్టర్ పై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు దాడి చేశాయి. ప్రధాన అణుకేంద్రం నతాంజ్‌ పైనా బాంబుల వర్షం కురిపించిన ఐడీఎఫ్.. ఇరాన్‌ బహుళ వార్‌ హెడ్‌ లున్న క్షిపణులను ప్రయోగిస్తోందని పేర్కొంది.

వెనక్కి తగ్గిన ట్రంప్!:

మరోవైపు... చర్చలకు ఇప్పటికే ఇరాన్ కు చాలా సమయం ఇచ్చాను.. ఇక నాకు సహనం లేదు.. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అంటూ చెప్పుకొచ్చిన ట్రంప్.. తాజాగా వెనక్కి తగ్గారు! చర్చల ద్వారా పరిష్కారం కనుగొనడానికి ఇరాన్‌ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ 2 వారాల గడువిచ్చారు. ఈ మేరకు ఈ విషయాన్ని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఆ తరువాత దాడులపై నిర్ణయం తీసుకుంటారని తెలిపాయి.

ఇక ఇరుదేశాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ప్రకటించారు. ఇజ్రాయెల్ - ఇరాన్‌ యుద్ధం పట్ల చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరిరువురూ ఇజ్రాయెల్‌ దాడులను ఖండించారు.

Tags:    

Similar News