కొత్త నిఘా : హెచ్-1బి , స్టూడెంట్ వీసా హోల్డర్లకు డిపోర్టేషన్ ముప్పు
అమెరికాలో ఇమ్మిగ్రెంట్లు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.;
అమెరికాలో ఇమ్మిగ్రెంట్లు ఇప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (ICE) ఇప్పుడు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (IRS) రికార్డుల ఆధారంగా అనధికారిక ఉద్యోగాలను గుర్తిస్తున్నాయి. ఈ కొత్త విధానం ముఖ్యంగా హెచ్-1బి వీసా లాంటి ప్రత్యేక ఉద్యోగదాతకు కట్టుబడి ఉన్న వీసాలు లేదా స్టూడెంట్ వీసా పై ఉన్నవారికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. “సైడ్ హస్టిల్స్” ద్వారా సంపాదించిన ఆదాయాన్ని పన్నుల రూపంలో IRSకి రిపోర్ట్ చేసినా అదే ఇప్పుడు వీసా రీన్యూవల్ నిరాకరణకు, అమెరికాలో ప్రవేశానికి ఆపడానికి, రిమూవల్ ప్రొసీడింగ్స్ కి, చివరికి డిపోర్టేషన్ కి కారణమవుతుంది.
* IRS డేటా షేర్.. ఇమ్మిగ్రెంట్లకు నూతన ముప్పు
ఇమ్మిగ్రేషన్ అటార్నీ జాత్ షావో ప్రకారం “IRS డేటాను ఇప్పుడు ICE తో పంచుకుంటోంది. ఇంతవరకు తమ సైడ్ వర్క్ ని నిజాయితీగా రిపోర్ట్ చేసి, పన్నులు చెల్లించిన వారు కూడా ఇప్పుడు అనధికారిక ఉద్యోగం చేసినట్టుగా కేసులు ఎదుర్కొంటున్నారు.” ముఖ్యంగా హెచ్-1బి వీసా హోల్డర్లు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. “వీసా పొందే ముందు స్టూడెంట్ వీసా (F-1) లో చిన్నతరహా పనులు చేసిన రికార్డులు కూడా ఇప్పుడు బయటపడి, ఎంబసీ లేదా పోర్ట్ ఆఫ్ ఎంట్రీ వద్ద వీసా నిరాకరణకు దారి తీస్తున్నాయి” అని అధికారులు వివరించారు. ఈ నూతన విధానం, ఇమ్మిగ్రెంట్ల గత రికార్డులను కూడా పరిశీలించి, చిన్న పొరపాట్లను కూడా పెద్ద సమస్యలుగా మార్చుతోంది.
* చిన్న తప్పు - పెద్ద మూల్యం
పలువురి గతంలోని చిన్న తప్పులు కూడా ఇప్పుడు మళ్లీ బయల్పడే అవకాశముందని జాత్ షావో హెచ్చరించారు. “ట్రాఫిక్ ఉల్లంఘన లాంటి ఇతర కారణాల వల్ల తన నేపథ్యం వెతికినప్పుడు ఏళ్ల క్రితం స్టూడెంట్‌గా ఫాస్ట్ ఫుడ్ జాయింట్ లో పని చేసిన దాఖలాలు బయటపడితే కూడా కేసులు వస్తున్నాయి” అని ఆయన వివరించారు. ఇది ఇమ్మిగ్రెంట్ల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.
* ‘ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్’ విధానం
ఇమ్మిగ్రేషన్ నిపుణురాలు కృప ఉపాధ్యాయ్ మాట్లాడుతూ “వీసా ఒకసారి ఇష్యూ అయ్యిందంటే వెట్టింగ్ ఆగిపోదు. వీసా హోల్డర్ పై నిరంతరంగా నిఘా ఉంటుంది. చిన్న తప్పు కూడా వీసా నిరాకరణకు లేదా డిపోర్టేషన్ కు కారణమవుతుంది,” అని చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఇప్పుడు “ఎక్స్‌ట్రీమ్ వెట్టింగ్” విధానాన్ని అవలంబిస్తోంది. ఇది ఇమ్మిగ్రెంట్ల ఆర్థిక కార్యకలాపాలను, ప్రత్యేకించి అనధికారిక ఆదాయాన్ని నిశితంగా పరిశీలిస్తోంది.
*హెచ్-1బి హోల్డర్లకు ప్రత్యేక ముప్పు
ప్రొటెగో లా గ్రూప్ ఫౌండర్ అభినవ్ త్రిపాఠి మాట్లాడుతూ “స్పాన్సరింగ్ ఎంప్లాయర్‌కి మాత్రమే బంధించబడిన హెచ్-1బి హోల్డర్లు, తమ పన్ను ఫైలింగ్ లో సైడ్ ఆదాయం చూపిస్తే అది స్టేటస్ ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. ఇది వీసా రద్దు, డిపోర్టేషన్ లేదా ప్రవేశ నిషేధానికి దారి తీస్తుంది” అని హెచ్చరించారు. హెచ్-1బి వీసా హోల్డర్లు ఒకే యజమాని కింద పని చేయడానికి అనుమతించబడతారు, కాబట్టి ఏ ఇతర ఆదాయ వనరు కూడా చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది.
ఏ ఆదాయం రిస్క్, ఏది కాదు?
నిపుణుల ప్రకారం అన్ని రకాల ఆదాయాలు ఒకే విధంగా పరిగణించబడవు.
రిస్క్ ఉన్నవి చూస్తే.. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, ఉబెర్ డ్రైవింగ్, Etsy లో క్రాఫ్ట్స్ అమ్మకం, కన్సల్టింగ్ వంటి షెడ్యూల్ C లో చూపే ఆదాయం. ఇవి “యాక్టివ్” ఆదాయంగా పరిగణించబడతాయి.
సేఫ్ అనబడేవి ఏవంటే.. బ్యాంక్ వడ్డీ , ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గెయిన్స్ (షెడ్యూల్ D) ఇవి పాసివ్ ఇన్‌కమ్ కింద వస్తాయి. ఇవి సాధారణంగా వీసా హోల్డర్ల స్టేటస్ పై ప్రభావం చూపవు.
గ్రే ఏరియాస్ లో చూస్తే.. రెంటల్ ఇన్‌కమ్ (షెడ్యూల్ E), పార్ట్‌నర్‌షిప్ ఇన్‌కమ్ (షెడ్యూల్ K). ఇవి కొన్ని సందర్భాల్లో పాసివ్, కొన్ని సందర్భాల్లో యాక్టివ్ గా పరిగణించబడతాయి. వీటిని కూడా USCIS అధికారులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
తాత్కాలిక ఆర్థిక ఉపశమనం ఇచ్చే సైడ్ హస్టిల్స్, అమెరికాలో ఉన్నత భవిష్యత్తు కలను ఛిన్నాభిన్నం చేయగలవు. కాబట్టి వీసా హోల్డర్లు ముఖ్యంగా హెచ్-1బి , స్టూడెంట్ వీసా ఉన్నవారు చట్టాలను ఖచ్చితంగా పాటిస్తూ అదనపు ఆదాయం కోసం తమ స్టేటస్‌ను ప్రమాదంలోకి నెట్టకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కొత్త నిఘా విధానం ఇమ్మిగ్రెంట్ల జీవితాలను క్లిష్టతరం చేస్తోంది, కాబట్టి జాగ్రత్తగా ఉండటం అత్యవసరం.