ఇరాన్ లో 2,000 మంది మృతి... రివర్స్ గేమ్ మొదలుపెట్టిన ప్రభుత్వం!
అవును... ఇరాన్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ఓ వైపు.. వారిని తీవ్రస్థాయిలో అణిచేస్తున్న సైన్యం మరో వైపు.;
ఇరాన్ లో ప్రజా నిరసన రోజు రోజుకీ తీవ్రమవుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఐదో రోజు ఇంటర్నెట్ ని నిలిపేశారు. మరోవైపు అటు నిరసనకారులు, ఇటు వారిని అదుపుచేస్తున్న భద్రతా సిబ్బంది సైతం మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు. దీంతో అమెరికా ఎంట్రీ ఉండచ్చనే ఊహాగాణాలకు బలం పెరిగింది. అదే సమయంలో ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులకు వ్యతిరేకంగా రివర్స్ గేమ్ స్టార్ట్ చేయడం గమనార్హం.
అవును... ఇరాన్ లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్న నిరసనకారులు ఓ వైపు.. వారిని తీవ్రస్థాయిలో అణిచేస్తున్న సైన్యం మరో వైపు. ఈ ఘర్షణల్లో పెద్ద ఎత్తున మరణాలు సంభవించినట్లు చెబుతున్నారు. ఇంటర్నెట్ నిలిపేయడంతో పూర్తి వివరాలు తెలియడం లేదని అంటున్నారు. అయితే.. ఇప్పటివరకూ సుమారు 2,000 మంది వరకూ మరణించగా.. అందులో 100 మందికి పైగా భద్రతా సిబ్బంది ఉన్నట్లు చెబుతున్నారు.
ఇక.. సుమారు 12,000 మందిని సైన్యం అరెస్టు చేసింది. ఈ మరణాలపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ లోని యూఎన్ మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టార్కాన్.. వేగవంతమైన న్యాయ ప్రక్రియల ద్వారా నిరసనకారులపై మరణశిక్ష విధించే అవకాశాన్ని సూచిస్తూ కొంతమంది న్యాయ అధికారులు చేసిన బహిరంగ ప్రకటనలు చూడటం చాలా ఆందోళనకరంగా ఉందని అన్నారు. నిరసనకారులను "ఉగ్రవాదులు"గా ముద్రవేయడాన్ని ఆయన ఖండించారు.
ఈ వ్యవహారంపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందించారు. ఇందులో భాగంగా.. వాషింగ్టన్ గతంలో పరీక్షించిన సైనిక ఎంపికను మళ్లీ పరీక్షించాలనుకుంటే అందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇదే సమయంలో... అమెరికా - ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు, యుద్ధ బెదిరింపుల వేళ మధ్యవర్తిత్వం వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఖతర్ ప్రకటించింది. ప్రాంతీయ సంక్షోభాలను పరిష్కరించడానికి దౌత్యం అత్యంత ప్రభావవంతమైన మార్గమని తెలిపింది.
ప్రభుత్వం రివర్స్ గేమ్!:
ఆర్థిక సంక్షోభంతో ఇరాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు ఓపక్క వెల్లువెత్తుతుంటే.. మరోవైపు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రభుత్వ అనుకూల ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా.. తమ బలాన్ని ప్రదర్శించేందుకు ఇరాన్ ప్రభుత్వం లక్షల మంది ప్రభుత్వ మద్దతుదారులను వీధుల్లోకి సమీకరించింది. టెహ్రాన్ లోని ఎంఘెలాబ్ స్క్వేర్ వద్ద వేల మంది ప్రదర్శనకారులు గుమిగూడగా.. వారిలో దేశాధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి కూడా ఉన్నారు.