ఐపీఎస్ సునీల్ నాయక్ సంచలన ట్వీట్.. రఘురామపై తీవ్ర ఆరోపణలు

డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ అనేక ఆరోపణలు చేశారు.;

Update: 2026-02-24 08:30 GMT

బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ సంచలన ట్వీట్ చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఏపీ పోలీసులు తనను అరెస్టు చేయడాన్ని ప్రశ్నిస్తూ అనేక ఆరోపణలు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే తనను ఈ కేసులో ఇరికించారని, ఎస్టీగా పుట్టడం వల్లే తాను చేసినా నేరమా అంటూ ‘ఎక్స్’ పోస్టులో ప్రశ్నించారు సునీల్ నాయక్. అంతేకాకుండా ఫిర్యాదుదారు రఘురామపై తీవ్ర ఆరోపణలు చేశారు. రఘురామ తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో బయటపెడతానని హెచ్చరించారు.

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ కేసు మరోసారి విస్తృత చర్చకు దారి తీసింది. ఈ కేసు ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా రెండు రాష్ట్రాల పోలీసు విభాగాల మధ్య పోరుగా మారే పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో ఏ6గా ఆరోపణలు ఎదుర్కొంటున్న బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. సునీల్ నాయక్ ను ట్రాన్సింట్ వారెంటుపై ఏపీకి తరలించడానికి అక్కడి కోర్టులు నిరాకరించాయి. హైకోర్టు సైతం సునీల్ నాయక్ కు రక్షణగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు పెట్టిన కేసులో ఎఫ్ఐఆర్ లో తన పేరులేదని, అయినా పోలీసులు తనను అరెస్టు చేస్తామంటున్నారని ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ వెల్లడించారు. ‘‘కులం నా నేరమా? ఎస్టీగా పుట్టడం పాపమా? చిన్న వర్గాల నుంచి వచ్చిన వారు ఉన్నత పదవులను అధిరోహించడం కొందరికి భరించలేని విషయం’’గా మారిందని ఎక్స్ లో ట్వీట్ చేశారు సునీల్ నాయక్. అంతేకాకుండా 2024లో నమోదైన ఎఫ్ఐఆర్ లో తన పేరు లేదని, ఎటువంటి సంబంధం లేని 2021 నాటి ఘటనలో నన్ను ఇరికించారని ఆయన ఆరోపించారు. తనపై తప్పుగా నేరస్తుడనే ముద్ర వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ రఘురామ తనకు ఫోన్ చేసి బెదిరించారని సునీల్ నాయక్ ఆరోపించారు. రఘురామ తనకు నేరుగా ఫోన్ చేశాడని, ఆయన కాల్ తాను లిఫ్ట్ చేయకపోవడంతో తన స్నేహితుడి ద్వారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పేర్లు బయటపెట్టాలని బెదిరించారని లేనిపక్షంలో తనను నిందితుడిగా చేస్తామని హెచ్చరించినట్లు సునీల్ నాయక్ ఆరోపించారు. రఘురామ రాజు కాల్ డేటా రికార్డులను బయటపెడితే ఈ కేసులో ఎంతమందిని ఒత్తిడికి గురిచేశారో తెలుస్తుందని సునీల్ నాయక్ ట్వీట్ లో తెలిపారు.

ప్రస్తుతం సునీల్ నాయక్ ట్వీట్ వైరల్ అవుతోంది. విపక్షం వైసీపీ సోషల్ మీడియా సునీల్ నాయక్ కు మద్దతుగా ఆయన ట్వీట్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. కాగా, సునీల్ నాయక్ అరెస్టు ఎపిసోడ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారింది. అనూహ్యంగా కేసును తెరపైకి తెచ్చిన పోలీసులు బిహార్ లో ఆయనను అరెస్టు చేయడం, అయితే అరెస్టుకు అవసరమయ్యే పత్రాలు సమర్పించలేకపోవడంతో కోర్టు నుంచి ట్రాన్సిట్ వారెంటు తెచ్చుకోలేకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బిహార్ కేడర్ కు చెందిన సునీల్ నాయక్ కు మద్దతుగా ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు కూడా రంగంలోకి దిగడంతో ఏపీ పోలీసులు ఏమీ చేయలేకపోయారని అంటున్నారు. సునీల్ నాయక్ ను అరెస్టు చేసి తీసుకువస్తున్నామని చెప్పిన ఎస్పీ దామోదర్ బృందం ఉత్త చేతులతో వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీనిపై ఏపీ పోలీసులు ఎలా ముందుకు వెళతారనేది ఉత్కంఠ రేపుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News