ఇది నౌక మాత్రమే కాదు, ఆసుపత్రి కూడా.. కొత్త అద్భుతం ‘ఇక్షక్’ గురించి తెలుసా?

దేశ రక్షణలో భారతదేశం గత కొంతకాలంగా సరికొత్త అబివృద్ధిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే.;

Update: 2025-11-07 02:30 GMT

దేశ రక్షణలో భారతదేశం గత కొంతకాలంగా సరికొత్త అబివృద్ధిని కనబరుస్తున్న సంగతి తెలిసిందే. క్షిపణులు, గగన తల రక్షణ వ్యవస్థల్లో ఇప్పటికే స్వదేశీ పరిజ్ఞానంతో ముందుకు వెళ్తోన్న భారత్.. తాజాగా మరో సరికొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. కొచ్చిలోని సదరన్‌ నేవల్‌ కమాండ్‌ లో ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ జల ప్రవేశం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.

అవును... దేశ రక్షణలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్‌ ఇక్షక్‌ జల ప్రవేశం చేసింది. దీని ద్వారా సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగు పడినట్లయ్యింది. ఇక్షక్‌ జల ప్రవేశ కార్యక్రమానికి నౌకాదళ అధిపతి దినేశ్‌ కె త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దీని ప్రత్యేకతలు అద్భుతంగా ఉన్నాయి.

ఈ సందర్భంగా కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ త్రిభువన్ సింగ్ చెప్పినట్లుగా.. ఇక్షక్ భారతదేశ సముద్ర తీరంలో ఖచ్చితత్వం, స్వావలంబనకు ఒక మార్గదర్శి. ఇది కేవలం సర్వే నౌక మాత్రమే కాదు, అత్యవసర సమయంలో దీన్ని 40 పడకల ఆసుపత్రిగా మార్చవచ్చు. ఇదే సమయంలో ఇందులో 231 మంది సిబ్బంది, 20 మంది అధికారులను ప్రయాణించవచ్చు.

హై రిజల్యూషన్ మల్టీ బీమ్ ఎకో సౌండర్, అటానమస్ అండర్ వాటర్ వెహికల్ (ఏయూవీ), రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్ (ఆర్.ఓ.వీ), నాలుగు సర్వే మోటార్ బోట్లు (ఎస్.ఎం.బీ) వంటి అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో కూడిన ఈ ఇక్షక్.. నేవీ హైడ్రోగ్రాఫిక్ ఫ్లీట్‌ కు సాటిలేని సామర్థ్యాన్ని తెస్తుందని చెబుతున్నారు. ఈ నౌకలో హెలికాప్టర్ డెక్ కూడా ఉంది.

ఈ నౌక 110 మీటర్ల పొడవు, 16 మీటర్ల బీమ్, 3300 టన్నుల డిస్ ప్లేస్ మెంట్ కలిగి ఉంది. హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక అనేది సముద్రపు అడుగుభాగాన్ని మ్యాప్ చేయడానికి, సముద్ర శాస్త్ర డేటాను సేకరించడానికి రూపొందించబడిన ఒక ప్రత్యేక నౌక. సురక్షితమైన నావిగేషన్ కోసం నాటికల్ చార్ట్‌ లను రూపొందించడానికి ఈ డేటా ఉపయోగించబడుతుంది.

దీనికి సంబంధించిన ప్రత్యేకతలను వివీరిస్తూ డిఫెన్స్ పీఆర్వో కమాండర్ అతుల్ పిళ్లై... ఇక్షక్ ప్రాథమిక పాత్ర సర్వే నౌక అయినప్పటికీ, దానిని ఆసుపత్రి నౌకగానూ మార్చవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా... ఆరు పడకలతో కూడిన ఆసుపత్రి సౌకర్యం, ఐసోలేషన్ వార్డ్, ఆపరేషన్ థియేటర్, ల్యాబ్ సౌకర్యం ఉంటాయని వెల్లడించారు.

ఇదే సమయంలో.. అల్ట్రాసౌండ్ స్కాన్, పోర్టబుల్ ఎక్స్-రే మెషిన్, బ్లడ్ బ్యాంక్, అత్యవసర శస్త్రచికిత్స పరికరాలు, పోర్టబుల్ వెంటిలేటర్ వంటి సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. అత్యవసర సమయాల్లో బేస్ హాస్పిటల్ నుండి వైద్య బృందాలు సర్జన్లు, అనస్థీషియాలజిస్ట్, రేడియాలజిస్ట్ మొదలైన వారితో నౌకలోకి ఎక్కవచ్చని ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ సార్జెంట్ కమాండర్ అతుల్ ఎన్ గోపీనాథ్ అన్నారు.

అదేవిధంగా... సర్వే నౌక సముద్రపు అడుగుభాగాన్ని మ్యాప్ చేస్తుందని.. నావిగేషన్ చార్ట్‌ ను సిద్ధం చేస్తుందని.. దీనిని భారత జలాల్లోకి ప్రవేశించే వ్యాపార నౌకలు, క్రూయిజ్ నౌకలు, యుద్ధనౌకలు ఉపయోగించవచ్చని అధికారులు ఎలిపారు. అలాగే ఇది మునిగిపోయిన నాళాలు, పైపులైన్లు, కమ్యూనికేషన్ కేబుల్‌ లను మ్యాప్ చేస్తుందని వెల్లడించారు.

ఇక్షాక్ వద్ద అటానమస్ అండర్ వాటర్ వెహికల్, రిమోట్‌ గా ఆపరేట్ చేయబడిన వాహనాలు ఉన్నాయని.. ఇవి 10,000 మీటర్ల లోతు వరకు సర్వే చేయగలవని తెలిపారు. ఇందులో మల్టీ బీమ్ ఎకో సౌండర్‌ లు, సైడ్ స్కాన్ సోనార్ ఉన్నాయని.. ఇవి మునిగిపోయిన ఓడలు, నీటి అడుగున పైప్‌ లైన్‌ లను గుర్తించడంలో సహాయపడతాయని వెల్లడించారు.

ఇక ఈ నౌకను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డర్స్‌ సంస్థ.. 80 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది. ఇందులో రెండు డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. ఇది గంటకు 18 నాట్ల వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ ఇంటిగ్రేటెడ్ ప్లాట్‌ ఫామ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఈ నౌక నియంత్రించబడుతుంది.



Tags:    

Similar News