బికినీ స్వేచ్ఛ.. భారతీయ సమాజంపై ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీటా కూడా ఇప్పటివరకు అదే ఆలోచనతో ఉన్నారు. కానీ తాజాగా రీటా ఈ సామాజిక కట్టుబాట్లను బద్దలు కొడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
సముద్ర తీరానికి వెళ్లడం అందమైన స్విమ్‌సూట్ లేదా బికినీ ధరించి వందల కొద్దీ ఫోటోలు దిగడం.. కానీ వాటిని సోషల్ మీడియాలో పెట్టడానికి మాత్రం ధైర్యం చేయలేకపోవడం... ఎందుకు? ''సమాజం ఏమనుకుంటుంది? పక్కింటి ఆంటీ చూస్తే ఏమంటుంది?'' అనే భయమే దీనికి కారణం. చాలా మంది భారతీయ మహిళలు విదేశీ బీచ్‌లకు వెళ్లినప్పుడు బికినీలు ధరించి ఫోటోలు దిగుతుంటారు.. కానీ వాటిని కేవలం ఫోన్ గ్యాలరీలకే పరిమితం చేస్తారు. ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లుయెన్సర్ రీటా కూడా ఇప్పటివరకు అదే ఆలోచనతో ఉన్నారు. కానీ తాజాగా రీటా ఈ సామాజిక కట్టుబాట్లను బద్దలు కొడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
భారతదేశంలో గడిపిన 24 ఏళ్ల జీవితం.. నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు నేర్పించింది! అంటూ రీటా తన వీడియోను ప్రారంభించారు. చాలా కాలంగా బికినీ ఫోటో పోస్ట్ చేస్తే ఏమవుతుందా అని ఆలోచించాను. కానీ ఏ దేశమేగినా ఆ దేశ పద్ధతులను పాటించాలనే విషయం నాకు గుర్తొచ్చింది. నేను ఈ బికినీని నా సొంత ఊరైన ఫరీదాబాద్‌లో వేసుకోను కదా... ఇక్కడి బీచ్‌లోనే వేసుకుంటాను. ''బీచ్‌కి వెళ్లి ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకుని నీళ్లలోకి వెళ్లలేం కదా!'' అంటూ సూటిగా ప్రశ్నించారు. ప్రజలు ఏమనుకుంటారనే భయాన్ని పక్కనబెట్టి తన టూ-పీస్ బికినీ లుక్‌ను చూపిస్తూ ఈసారి కచ్చితంగా పోస్ట్ చేస్తానని రీటా గట్టిగా చెప్పారు.
మహిళల దుస్తులపై సమాజం చూపే వివక్షను ఎండగడుతూ రీటా ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకువచ్చారు. భారతీయ అంకుల్స్ ఎక్కడ పడితే అక్కడ పూల్స్, సముద్రాలు, సరస్సులలో కనీసం ప్రాపర్ స్విమ్‌వేర్ కూడా లేకుండా.. కేవలం షార్ట్స్ వేసుకుని అర్ధనగ్నంగా దూకేస్తారని.. వారిని ఎవరూ ప్రశ్నించరని గుర్తుచేశారు. తాను గతంలో థాయిలాండ్, ఇండోనేషియా వంటి దేశాల బీచ్‌లలో బికినీలు ధరించినప్పుడు అక్కడ అంతా సాధారణంగానే ఉందని.. ఎవరూ తనవంక వింతగా చూడలేదని తెలిపారు. మన దగ్గర ఒళ్లంతా కప్పేసే బట్టలు వేసుకున్నా కూడా జనాలు చూసే చూపులు.. జడ్జ్ చేసే విధానం మహిళలను తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రీటా షేర్ చేసిన ఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎందరో మహిళలు ఆమెకు మద్దతుగా నిలిచారు. ''నీ శరీరం, నీ డబ్బు, నీ ఇష్టం.. వెంటనే పోస్ట్ చెయ్'' అని ఒకరు.. ''నువ్వు చాలా హా*ట్‌గా ఉన్నావు'' అంటూ మరొకరు తనను ప్రోత్సహించారు. థాయిలాండ్ వంటి ప్రదేశాలలో తమను ఎవరూ తదేకంగా చూడలేదని.. అక్కడ తమకు పూర్తి స్వేచ్ఛ లభించిందని మరికొందరు మహిళలు తమ అనుభవాలను షేర్ చేసారు. అయితే ఎప్పటిలాగే కొందరు పురుషులు `సంస్కృతి` ముసుగులో విమర్శలకు దిగారు. ''పాశ్చాత్య దేశాలను గుడ్డిగా కాపీ కొడుతున్నారు''అని కొందరు.. ''ఇలాంటి మహిళలకు పురుషులెవరూ కట్టుబడకూడదు'' అంటూ కొందరు సంకుచిత కామెంట్లు చేశారు.
ప్రస్తుతం మనం 21వ శతాబ్ధంలో ఉన్నా.. ఒక మహిళ విలువను తను వేసుకునే బట్టలను బట్టి అంచనా వేసే పురుషాహంకార ధోరణి ఇంకా మారకపోవడం విచారకరం. మహిళలు ఏం వేసుకోవాలో శాసించడం లేదా వారి స్వేచ్ఛను ప్రశ్నించడం కంటే సమాజం గొప్పగా చెప్పుకునే ఆ `సంస్కృతి` వెనుక ఉన్న వివక్షను, సంకుచిత మనస్తత్వాన్ని ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. రీటా ప్రకారం.. ఇప్పటి సాంకేతిక యుగంలో మహిళలు ఇంకా సామాజిక బంధనాల నడుమ జీవించాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయో విశ్లేషించుకోవాల్సిన సమయం వచ్చింది.