కెనడాలో 'రియల్ హీరోస్'గా నిలిచిన ఇండియన్స్.. ఏం చేశారంటే..?
విదేశాల్లో భారతీయులపై అనేక రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా మనవాళ్లు చేసే తప్పులను హైలెట్ చేస్తూ అంతర్జాతీయ మీడియా తెగ ప్రచారం చేస్తుంటుంది.
విదేశాల్లో భారతీయులపై అనేక రకాల ప్రచారాలు జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా మనవాళ్లు చేసే తప్పులను హైలెట్ చేస్తూ అంతర్జాతీయ మీడియా తెగ ప్రచారం చేస్తుంటుంది. కానీ, కెనడాలో మన దేశానికి చెందిన కొందరు యువకులు చేసిన గొప్పపని కూడా ఇప్పుడు అంతే స్థాయిలో ప్రచారం జరుగుతోంది. మాతృభూమికి గౌరవం తెచ్చేలా ఆ యువకులు ప్రవర్తించిన తీరు అభినందనలు అందుకుంటోంది. కెనడాలో ఓ మహిళను అపరిచితుడి నుంచి కాపాడిన యువకులు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. పరాయి నేలలో ప్రాణాలు అడ్డుపెట్టి ఓ మహిళను కాపాడి 'రియల్ హీరోలు' అయిపోయారంటూ ప్రశంసలు అందుకుంటున్నారు.
అసలేం జరిగిందంటే?
కెనడాలోని బ్రిటీష్ కొలంబియా, ప్రిన్స్ జార్జ్ పరిధిలోని ఒక క్రికెట్ గ్రౌండ్‌లో 'ప్రిన్స్ జార్జ్ క్రికెట్ క్లబ్'కు చెందిన కొందరు భారతీయ సంతతి యువకులు క్రికెట్ ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఒక స్థానిక శ్వేతజాతీయురాలు తన పెంపుడు కుక్కను తీసుకుని ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తోంది. అయితే, ఒక అపరిచిత వ్యక్తి ఆమెను వెంబడిస్తూ, మానసికంగా ఇబ్బంది పెట్టసాగాడు. దాంతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన ఆ మహిళ భయంతో వణికిపోతూ సాయం కోసం అక్కడే ఉన్న భారతీయ యువకులను ఆశ్రయించింది.
ఆమె పరిస్థితిని గమనించిన మనవాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్పందించారు. ఆటను పక్కనబెట్టి, వెంటనే ఆ మహిళకు అండగా నిలిచారు. ఆ వేధింపులకి గురిచేస్తున్న వ్యక్తికి, మహిళకు మధ్య ఒక రక్షణ వలయంలా నిలబడ్డారు. అంతటితో ఆగకుండా ఆగంతకుడిని గట్టిగా హెచ్చరించి అక్కడి నుంచి పంపించేశారు. విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసి వారు వచ్చినంత వరకు సదరు మహిళకు రక్షణగా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మన భారతీయ యువకులు ఎంత సంయమనంతో, చట్టబద్ధంగా వ్యవహరించారో చూస్తే ముచ్చటేస్తుందని అంటున్నారు.
ఇలాంటి ఘటనల ద్వారా విదేశాల్లో భారతీయుల ఇమేజ్ పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. స్థానిక కెనడియన్లతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మన యువకుల సమయస్ఫూర్తిని కొనియాడుతున్నారు. సోషల్ మీడియాలో భారతీయులపై వచ్చే కొన్ని తప్పుడు ప్రచారాలు, జాత్యహంకార వ్యాఖ్యలకు ఈ సంఘటన ద్వారా తిప్పికొట్టొచ్చని అంటున్నారు. ఇక ఆడవాళ్లకు గౌరవం ఇవ్వడం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం మన రక్తం లోనే ఉందనే విషయాన్ని ఈ యువకులు మరోసారి నిరూపించారని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.