అమెరికాపై యావ చావని భారత యువత

యూజీ స్థాయిలో చేరిన భారతీయుల్లో అత్యధికంగా 43.40 శాతం మంది కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ఎంచుకున్నారు.;

Update: 2026-01-08 04:30 GMT

చింత చచ్చినా పులుపు చావదని అంటారు.. తెలుసుగా.. ఇప్పుడు మన వాళ్లది అదే యావ.. ట్రంప్ ఎన్ని టారిఫ్ లు వేసినా.. మా దేశానికి రావద్దని ఎయిర్ పోర్టులు మూసినా.. ఎంత మందిని నిర్బంధించినా కూడా మన భారతీయ యువత ప్రాధాన్యత మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చదువుకోవడానికి మన యువత అమెరికా బాట పడుతూనే ఉన్నారు. లెక్కలు చూస్తే అదే కనిపిస్తోంది.




 


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై టారిఫ్‌ల మోత మోగించినా.. రెండు దేశాల మధ్య ఇటీవల కొంత రాజకీయ దూరం ఏర్పడినట్టుగా కనిపించినా… చదువుల విషయంలో మాత్రం భారతీయ యువత అమెరికాపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా అండర్‌గ్రాడ్యుయేట్‌ (యూజీ) కోర్సుల కోసం అమెరికా వైపే చూస్తున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే ఉంది.

2021–22 విద్యా సంవత్సరంలో అమెరికాలో డిగ్రీ కోర్సుల్లో చేరిన భారతీయ విద్యార్థుల సంఖ్య 27,545గా ఉండగా.. 2022–23లో ఇది 31,954కు చేరింది. 2023–24లో 36,053 మంది చేరగా.. 2024–25లో ఈ సంఖ్య 40,135కి పెరగడం గమనార్హం. అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థులపై తాజాగా విడుదలైన ఓపెన్ డోర్స్ నివేదిక 2025 ఈ వివరాలను వెల్లడించింది.

యూజీ స్థాయిలో చేరిన భారతీయుల్లో అత్యధికంగా 43.40 శాతం మంది కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులను ఎంచుకున్నారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 22 శాతం మంది చేరగా.. సోషల్‌ సైన్సెస్‌ కోర్సుల్లో మాత్రం కేవలం 2.60 శాతం మందికే ప్రవేశం లభించింది. ఇదే సమయంలో ఇరాన్‌ విద్యార్థుల్లో అత్యధికంగా 44.40 శాతం మంది ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరడం మరో ఆసక్తికర అంశం.

సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) కోర్సుల్లో ఆసియా దేశాల విద్యార్థులదే ఆధిక్యతగా కొనసాగుతుండగా యూరప్‌ దేశాల విద్యార్థులు ఒత్తిడి తక్కువగా ఉండే కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారని వరల్డ్‌ వైడ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కెరియర్స్‌ ఎండీ యు. వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.

భారత్‌లో బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ)లో సైన్స్‌, ఇంజినీరింగ్‌ అంశాలు కలిపి బోధిస్తారు. కానీ అమెరికాలో ఈ రెండు వేర్వేరు సబ్జెక్టులుగా ఉంటాయి. అందుకే అక్కడ ఎంఎస్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలనుకునే భారతీయ విద్యార్థులు ముందుగానే కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన ఒకటి రెండు అదనపు సబ్జెక్టులు చదువుతున్నారు. మొత్తం మీద భారతీయ విద్యార్థుల్లో 65 శాతం మందికిపైగా కంప్యూటర్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ కోర్సుల్లోనే చేరుతున్నారు.

అమెరికాలో ఉన్నత చదువుల కోసం భారతీయులు ఎక్కువగా టెక్సాస్‌, న్యూయార్క్‌, మసాచ్యుసెట్స్‌, కాలిఫోర్నియా, చికాగో ఇల్లినాయిస్‌ రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలను ఎంచుకుంటున్నారు. వీరిలో 63.10 శాతం మంది ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చేరగా 36.90 శాతం మంది ప్రైవేట్‌ వర్సిటీల్లో చేరుతున్నారు.

ఇక మరోవైపు అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ పీజీ కోర్సుల్లో చేరే భారతీయుల సంఖ్య మాత్రం 1,96,567 నుంచి 1,77,892కి తగ్గింది. అయితే చదువు పూర్తైన తర్వాత ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)లో చేరినవారి సంఖ్య 97,556 నుంచి ఏకంగా 1,43,740కి పెరగడం విశేషంగా మారింది.

రాజకీయాలు ఎంత మారినా… అవకాశాల కోసం, భవిష్యత్తు కెరీర్‌ కోసం భారతీయ యువతకు అమెరికా ఇప్పటికీ అగ్ర గమ్యంగా కొనసాగుతూనే ఉంది.

Tags:    

Similar News