భారతీయ విద్యార్థులపై కెనడా కొరడా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ఉన్న దేశానికి వెళ్లి చదవాలంటే ఇప్పుడు చాలా కండిషన్లు ఉన్నాయి.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో భారతీయ విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ట్రంప్ ఉన్న దేశానికి వెళ్లి చదవాలంటే ఇప్పుడు చాలా కండిషన్లు ఉన్నాయి. భారత్ సహా చాలా దేశాలపై పన్నుల భారం మోపుతూ ట్రంప్ తీసుకుంటున్న చర్యలు హింసలాగా మారాయి.
ఇప్పుడు ఇదే బాటను అనుసరించేందుకు కెనడా కూడా రెడీ అయింది. ఆ దేశం కూడా అంతర్జాతీయ వలసదారులకు తలుపులు మూసేస్తోంది. కెనడా డేటా అనాలిసిస్ వింగ్ IRCC వివరాల ప్రకారం.. ఈ ఏడాది 62 శాతం విద్యార్థి వీసాలను తిరస్కరించారు. గతేడాది 52 శాతం.. మునుపటి ఏడాది 40 శాతం కంటే 2025లో ఇది చాలా ఎక్కువ. ఒకప్పుడు కెనడా, అమెరికా ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా మారాయి? అన్నది విశ్లేషిస్తే ఇది విద్యార్థుల భవితవ్యాన్ని ఎలా మార్చేయబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల తిరస్కరణ తీవ్రతరమైంది.
ముఖ్యంగా కెనడాలో చదవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశం అశనిపాతంగా మారింది. ఈ దశాబ్ధ కాలంలో స్టడీ వీసా తిరస్కరణ రేటు అమాంతం పెరిగింది. ఇండియా నుంచి దరఖాస్తుల్లో 80శాతం తిరస్కారానికి గురయ్యాయి. విడివిడిగా ఏ దేశానికి ఎంత? అన్నది తెలీదు కానీ, ఈ పరిస్థితులు భారతదేశంతో పాటు పరిసర దేశాలకు ఇబ్బందికరంగా పరిణమించవచ్చని భావిస్తున్నారు. గతేడాదిలో అమెరికా తర్వాత అత్యధికంగా 10 లక్షల వీసాలతో కెనడా టాప్ 2లో నిలిచింది. 41 శాతం మంది భారతదేశం నుండి, 12 శాతం మంది చైనా నుండి తిరస్కరణలు ఎదుర్కొన్నారు. వచ్చిన అతిథులకు గృహాలు, జీవనోపాధి అనే కోణంలో ఈ రిజెక్షన్స్ కొనసాగుతున్నాయి. దీని కారణంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సహా విద్యార్థులపై స్క్రుటినీ మరింత పెరిగింది.
2025లో కెనడా 4,37,000 మంది స్టడీస్ కోసం అనుమతించనుంది. గత సంవత్సరం కంటే దాదాపు 10 శాతం తక్కువ. ఇందులో 73,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు, 2,43,000 అండర్ గ్రాడ్యుయేట్లు.. 1,20,000 పాఠశాల వయస్సు పిల్లలకు అవకాశాల్ని కల్పిస్తోంది. పీజీ చదవాలన్నా రూల్స్ మారిపోయాయి. ఆంగ్లం, ఫ్రెంచి రిజల్ట్ బి2 స్థాయి లేదా అంతకుమించి నిరూపించుకోవాలి. కాలేజీ గ్రాడ్యుయేట్లు బి1 స్థాయి అర్హతను చూపించాలి. 14 దేశాల విద్యార్థులకు ఆర్థిక రుజువు తో పని లేకుండా వేగవంతమైన వీసాలను అందించిన ది స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ ను మూసేసారు. నిజానికి గతేడాది నుంచి కెనడా స్టడీ అనుమతుల్ని తగ్గిస్తోంది. వర్క్ స్టడీ పర్మిట్లు కూడా అమాంతం తగ్గిపోయాయి. కారణం ఏదైనా అమెరికా, కెనడా వెళ్లి చదువుకోవాలనుకునే విద్యార్థులపై ఇది తీవ్ర ఒత్తిడిని పెంచే సన్నివేశాన్ని తెచ్చింది.