పహల్గామ్ నరమేధంపై ప్రతీకారం: ఉగ్రవాది ఇంటిని పేల్చేసిన ఆర్మీ

పహల్గామ్ దాడిలో అమాయక పౌరులు, ముఖ్యంగా పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశాయి.;

Update: 2025-04-25 04:41 GMT

దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్ సమీపంలో ఇటీవల జరిగిన కిరాతక ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ తన చర్యలను ప్రారంభించింది. ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఆదిల్ షేక్ అనే స్థానిక ఉగ్రవాది ఇంటిని భద్రతా బలగాలు ఐఈడీ ఉపయోగించి పేల్చివేశాయి. ఈ చర్య ఉగ్రవాదులకు.. వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారికి బలమైన సందేశాన్ని పంపింది.

పహల్గామ్ దాడిలో అమాయక పౌరులు, ముఖ్యంగా పర్యాటకులు మరణించిన నేపథ్యంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల ఏరివేతను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దాడితో సంబంధం ఉన్న ఉగ్రవాదులను గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆదిల్ షేక్ ఇల్లు పేల్చివేత ఈ ప్రతీకార చర్యల్లో భాగమేనని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

కాశ్మీర్ లోయలోని బిజ్బెహరా , త్రాల్ ప్రాంతాల్లోనూ భద్రతా బలగాల కూంబింగ్.. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాలు తరచుగా ఉగ్రవాదుల కార్యకలాపాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో ఇక్కడ నక్కి ఉన్న స్థానిక ఉగ్రవాదుల నివాసాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల మద్దతు నెట్‌వర్క్‌ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్స్ జరుగుతున్నాయి.

ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తొయిబాకు అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) బాధ్యత వహించింది. ఈ దాడిలో పలువురు మరణించగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై.. వారికి మద్దతు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రతినబూనింది.

ఆర్మీ చేపట్టిన ఈ ప్రతీకార చర్యలు ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. స్థానిక మద్దతు లేకుండా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగించలేరనే విషయాన్ని ఈ చర్యలు స్పష్టం చేస్తున్నాయి. బిజ్బెహరా, త్రాల్ వంటి ప్రాంతాల్లో కొనసాగుతున్న కూంబింగ్ ఆపరేషన్స్ ద్వారా మరికొంత మంది ఉగ్రవాదులను ఏరివేసే అవకాశం ఉంది. లోయలో శాంతి భద్రతల పునరుద్ధరణకు భద్రతా బలగాలు కట్టుబడి ఉన్నాయని ఈ చర్యలు చాటి చెబుతున్నాయి.

Full View
Tags:    

Similar News