మన ఆర్మీలో భైరవులు.. లక్ష మందితో ఆధునిక శక్తి
భారత ఆర్మీ మరింత శక్తిమంతంగా మారుతోంది. ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసుకుంది.;
భారత ఆర్మీ మరింత శక్తిమంతంగా మారుతోంది. ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసుకుంది. ఈ నెల 15న ఆర్మీ డే పరేడ్ లో ప్రత్యేక దళం కవాతు చేయనుంది. మారుతున్న యుద్ధరీతులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సరికొత్త అస్త్రాలతో ఆధునిక యుద్ధ దళాన్ని మన ఆర్మీ సమకూర్చుకోవడం గొప్ప విషయంగా చెబుతున్నారు. సైన్యంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా లక్ష మందితో డ్రోన్ ఆపరేటర్ల సైన్యాన్ని ఆర్మీ తయారు చేసిందని కథనాలు వస్తున్నాయి. ఈ దళానికి భైరవ్ అనే పేరు పెట్టారు. శత్రు స్థావరాలను గుర్తించి దాడుల ద్వారా ధ్వంసం చేయడం డ్రోన్ ఆర్మీ కర్తవ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.
‘భైరవ్’ పేరుతో స్పెషల్ ఫోర్సు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ పత్రికలు కథనాలు రాస్తున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కొత్తగా ఈ భైరవ్ బెటాలియన్లు పనిచేయనున్నాయని చెబుతున్నారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో భైరవ్ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉందని చెబుతున్నారు. సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సెస్ కి మధ్య వారధిలా ‘భైరవ్’ పనిచేయనుందని సమాచారం. బహుళ స్థాయిల్లో అత్యంత వేగంగా, దూకుడుగా దాడి చేయడం ‘భైరవ దళం’ ప్రత్యేకతగా చెబుతున్నారు.
కొత్తగా ఏర్పాటు చేస్తున్న భైరవ్ బెటాలియన్ లో ప్రతి ఒక్క సైనికుడికి డ్రోన్ ఆపరేటింగ్, యుద్ధంలో వాటి వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. భారత సైన్యం ఇప్పటికే 15 బెటాలియన్లను ఏర్పాటు చేసుకుంది. ఈ బెటాలియన్లను చైనా, పాక్ సరిహద్దుల్లో వివిద దళాలకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో వీటిని 25 బెటాలియన్లకు పెంచాలనే లక్ష్యంతో ఆర్మీ ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో ఈ దళం 5 నెలలుగా కఠోర శిక్షణ తీసుకుంటోందని ప్రచారం జరుగుతోంది.
ప్రధానంగా రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడ వాతావరణ పరిస్థితులు, భాష, భౌగోళిక పరిస్థితులపై అవగాహన ఉన్నవారికే ఈ బెటాలియన్ లో ఎక్కువగా నియమించినట్లు చెబుతున్నారు. ఈ నెల 15న జైపూర్ లో జరిగే ఆర్మీ డే పరేడ్ లో భైరవ దళం తొలిసారి కవాతు కూడా చేయనుందని సమాచారం. ఇలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్న ఆర్మీ, రుద్ర బిగ్రేడ్ పేరుతో మరో శక్తిమంతమైన వ్యవస్థను కూడా భారత ఆర్మీ సమకూర్చుకుంటోందని అంటున్నారు. ఇందులో పదాతిదళం, యాంత్రిక యూనిట్లు, ట్యాంకులు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, డ్రోన్ వ్యవస్థలన్నీ ఉంటాయని అంటున్నారు.
భైరవ్ బెటాలియన్ తో పాక్ సరిహద్దుల్లో నిఘా మరింత పటిష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ప్రస్తుతం పాక్ సరిహద్దు వెంబటి రాష్ట్రాల్లో డ్రోన్ల ద్వారా మాదక ద్రవ్యాలు, మరణాయుధాలను ఉగ్రవాదులు దేశంలోకి చొప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ఎప్పటికప్పుడు మన సైన్యం గుర్తిస్తూ కూల్చేస్తున్నారు. రాజస్థాన్ నుంచి కశ్మీర్ వరకు సుదీర్ఘంగా ఉండే సరిహద్దు వెంబడి ఒక్కోసారి పదుల సంఖ్యలో డ్రోన్లు వస్తున్నట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి. దీంతో సరిహద్దుల్లో ఉన్న సైనికులకు అదనపు పని ఒత్తిడి పెరిగిపోయింది. వారిపై ఒత్తిడి తగ్గించేలా ‘భైరవ’ను ఏర్పాటు చేయడం వల్ల సత్ఫలితాలు వస్తాయని, నిఘా కట్టుదిట్టం అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.