పాక్ కి ముందుంది...లేటెస్ట్ గా స్ట్రాంగ్ డోస్

మరో సారి కనుక పాక్ తమ జోలికి వస్తే మాత్రం ఆపరేషన్ సిందూర్ 2.0ని ప్రయోగిస్తామని కూడా భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టిగానే హెచ్చరించారు.;

Update: 2026-01-14 03:46 GMT

పాకిస్థాన్ ఏదో అనుకుంటోంది. భారత్ మీద దానికి ఇంకా ఫ్లాష్ బ్యాక్ ఫీలింగ్ అలా ఉండిపోయింది. మెతకగా ఉంటుందని మాటలకే పరిమితం అవుతుందని అనుకుంటోంది. కానీ గడచిన దశాబ్ద కాలంగా దెబ్బకు దెబ్బ దాడికి దాడి అంటూ భారత్ అసలూ వడ్డీ కలిపి ఇచ్చేస్తోంది. అయినా కూడా ఉగ్రవాదాన్ని నమ్ముకుని తనను తాను నాశనం చేసుకుంటూ భారత్ మీదకు రావాలని చూస్తోంది. మాట్లాడితే చాలు అణు దేశం అని కూడా బెదిరిస్తూ పోతోంది ఇక భారత్ కి ప్రత్యర్థి దేశాలు తనకు మిత్ర దేశాలుగా మార్చుకునే కుటిల ప్రయత్నం చేస్తూ దానికే మిడిసి పడుతూ మురిసిపోతోంది. అలాంటి పాక్ కి భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదీ స్ట్రాంగ్ డోస్ ఇచ్చేశారు.

మా జోలికి రావాలనుకోకు :

మాతో పెట్టుకోకు, మా ఊసే తలవకు, మా జోలికి రావాలని అసలు అనుకోకు అన్నట్లుగా ఉపేంద్ర ద్వివేదీ చెప్పాల్సింది చెప్పేశారు ఆపరేషన్ సింధూర్ గుర్తుందా అని కూడా దాని గురించి మరోసారి చెప్పారు. భారత్ దెబ్బ ఎలాంటిదో పాక్ అబ్బా అని ఎన్ని సార్లు అందో కూడా భారత్ సైన్యాద్యక్షుడు విడమరచి మరోసారి మీడియాకు చెప్పారు.

కో ఆర్డినేషన్ సూపర్ :

ఇక పాక్ మీద ప్రయోగించిన ఆపరేషన్ సిందూర్ త్రివిధ దళాల సమన్వయానికి నిదర్శనమని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్‌ సైనిక శక్తి ఈ సందర్భంగా స్పష్టమైందని ఆయన గుర్తు చేశారు. ఆపరేషన్‌ సిందూర్‌ను చాలా కచ్చితత్వంతో అమలుచేశామని ఆయన అంటున్నారు. ఏకంగా 88 గంటల పాటు సాగిన ఆ ఆపరేషన్‌లో భారత సైనిక దళాలు అత్యంత సమర్థంగా పనిచేశాయని పేర్కొన్నారు. ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేయడంతో పాటు వందకు పైగా పాక్ ప్రోత్సాహంతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు.

ఆపరేషన్ సిందూర్ 2.0 :

మరో సారి కనుక పాక్ తమ జోలికి వస్తే మాత్రం ఆపరేషన్ సిందూర్ 2.0ని ప్రయోగిస్తామని కూడా భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టిగానే హెచ్చరించారు. భవిష్యత్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని పాకిస్థాన్‌కు ఆయన పరోక్షంగా గట్టి హెచ్చరికలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు సున్నితంగా ఉన్నా ప్రస్తుతం అవి నియంత్రణలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేయడం మరో విశేషం.

భరతం పట్టేందుకు సిద్ధం :

పాక్ మీద గట్టి నిఘా కొనసాగుతోందని ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక నిరంతర ప్రక్రియ అని కూడా ఆయన చెప్పడం దాయాది గుండెళ్లో రైళ్లు పరిగెత్తించే మ్యాటరే అనడంతో సందేహమే లేదు. ఇక ఆయన మాటలలో చూస్తే పాక్ భారత్ సరిహద్దుల వద్ద పాక్ ఎనిమిది స్థావరాలు ఉన్నాయని వాటి భరతం పట్టేందుకు సిద్ధమని చెప్పకనే చెప్పారు. మొత్తానికి దాయాదికి సింధు నదీ జలాల బంద్ తో అసలే గొంతు ఎండిపోయింది. ఇపుడు భారత్ సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది ఘాటు హెచ్చరికలతో మొత్తంగా తడి ఆరిపోయేలా ఉందని అంటున్నారు.

Tags:    

Similar News