కూటమి సర్కారులో వైసీపీ రక్షకులు.. చంద్రబాబుకు బిగ్ షాక్!

ప్రభుత్వం సరఫరా చేస్తున్న సిమెంట్, ఐరెన్ నాణ్యత లోపిస్తున్న కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పేదలకు డబ్బులు ఇచ్చేస్తే, వారికి నచ్చిన సరుకులు కొనుగోలు చేస్తారని భావించింది.;

Update: 2026-03-04 00:30 GMT

కూటమి ప్రభుత్వంలో కొన్ని వ్యవహారాలు రాజకీయంగా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు అధికారాలకే సవాల్ విసిరేలా కొందరు ప్రవర్తిస్తున్నారని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు, అధికారులను రక్షించేలా చంద్రబాబు సర్కారులోనే ప్రయత్నాలు జరగడం విస్మయానికి గురిచేస్తోందని అంటున్నారు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు సామర్థ్యాన్నే ప్రశ్నించినట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. సుమారు 20 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు అవినీతిపై ఆరోపణలు చేయడమే కానీ, ఏ ఒక్కరిపై చర్యలు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని, ఇందుకు ప్రధాన కారణం సీఎం ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో సుప్రీం లీడర్ చంద్రబాబు. మంత్రులు, ఎమ్మెల్యేలను కనుచూపుతో శాసిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఉన్నతాధికారులను కంట్రోల్ చేయలేకపోతున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వంలో అక్రమాలకు సహకరించిన పలవురు ఉన్నతాధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నారని అంటున్నారు. దీనికి తాజా ఉదాహరణగా హౌసింగ్ శాఖలో ఒక నిర్ణయాన్ని ఎత్తిచూపుతున్నారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణశాఖలో వేల కోట్ల అవినీతి జరిగిందని కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఆరోపించాయి. ప్రభుత్వంలోకి వచ్చాక చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్రమార్కులు తప్పించుకునేలా అవకాశం కల్పించినట్లు అవుతోందని అంటున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హౌసింగ్ శాఖలో అవినీతి జరిగిందని విజిలెన్స్ విచారణలో స్పష్టమైంది. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అయితే ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకునే లోగానే ఆ శాఖ ఉన్నతాధికారులు పావులు కదపడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్వర్శ్’ విధానం అమలులోకి వచ్చినందున గృహనిర్మాణ శాఖకు జిల్లాల్లో ఉన్న గోడౌన్లలో స్టాక్ ను క్లియర్ చేయాలని ఆదేశాలు వెళ్లాయి. కేంద్ర ప్రభుత్వం సూచనలతో రాష్ట్రం కూడా ఇకపై గృహ నిర్మాణాలకు సిమెంట్, ఇనుమ వంటివి సేకరించకూడదని నిర్ణయం తీసుకుంది. వీటికి బదులుగా లబ్ధిదారులకు డబ్బులు చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వం సరఫరా చేస్తున్న సిమెంట్, ఐరెన్ నాణ్యత లోపిస్తున్న కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పేదలకు డబ్బులు ఇచ్చేస్తే, వారికి నచ్చిన సరుకులు కొనుగోలు చేస్తారని భావించింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా గతంలో వైసీపీ హయాంలో చోటుచేసుకున్న అవినీతిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది. మారిన ప్రభుత్వ విధానంపై జిల్లా అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వాలని సూచించింది. అయితే సరిగ్గా ఈ ఆదేశాలను అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారని అంటున్నారు.

గత ప్రభుత్వంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తామనే పేరుతో అవసరానికి మించి సిమెంట్, ఐరెన్ సేకరించారు. వీటిని లబ్ధిదారులకు సరఫరా చేయకపోవడంతో సిమెంట్ గడ్డలు కట్టింది. ఐరెన్ తుప్పుపట్టి వినియోగానికి పనికిరాకుండా పోయింది. దీనివల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టంగా చెబుతున్నారు. గత ప్రభుత్వంలో కొన్ని కంపెనీలకు మేళు జరిగేలా డిమాండ్ కి మించి వీటిని సేకరించినట్లు ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ విచారణలో కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం వెలుగు చూడటంతో వారిపై చర్యలకు ప్రభుత్వానికి నివేదించినట్లు చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేంద్రం మార్చిన నిబంధనలతో గిడ్డంగులను క్లియర్ చేసి తమ అక్రమాలను కప్పిపుచ్చేలా హౌసింగ్ ఉన్నతాధికారులు పావులు కదుపుతున్నారని అంటున్నారు.

తాము తప్పించుకోవడమే కాకుండా, గత ప్రభుత్వంలో హౌసింగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టిన వైసీపీ నేతలు, వారి అనుకూల కంపెనీలకు మేలు చేసేలా చంద్రబాబు ప్రభుత్వంలో ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కూటమి నేతల మధ్య విస్తృత చర్చకు దారితీస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవడం ఆలస్యం అవడం వల్ల ఇలా తప్పించుకుంటున్నారని అంటున్నారు. గృహనిర్మాణ శాఖ గిడ్డంగులు ఖాళీ చేస్తే, గతంలో సేకరించిన సిమెంట్, ఐరెన్ పారబోయాల్సివుంటుందని అంటున్నారు. దీనివల్ల అక్రమార్కుల అవినీతికి ఆధారాలు లేకుండా చేసినట్లు అవుతోందని అంటున్నారు. చంద్రబాబు హయాంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుని వైసీపీ హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాన్ని మాఫీ చేసినట్లు అవుతోందని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News